Bengaluru | తన ఇంటి ముందు కూర్చున్న ఓ యువకుడి వద్దకు ముగ్గురు మహిళలతో పాటు మరో ముగ్గురు యువకులు వచ్చారు. అతనితో గొడవకు దిగారు. ఓ మహిళను కొట్టేందుకు ఆ యువకుడు దూసుకొచ్చాడు. వాగ్వాదం మరింత ముదిరింది. ఇంకేముంది.. ఆ యువకుడిని నడిరోడ్డుపై పడుకోబెట్టి తొక్కారు. ఓ మహిళ బండ రాయితో తలపై విచక్షణా రహితంగా బాదింది.
ఆ తర్వాత ముగ్గురు మహిళలు, మరో ఇద్దరు కలిసి యువకుడిని గట్టిగా పట్టుకోగా ఓ యువకుడు బండ రాయితో తలపై అనేకసార్లు మోదాడు. దీంతో అతను ప్రాణాలు అక్కడికక్కడే విడిచాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులోని కేపీ అగ్రహార ఏరియాలో గత శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
నడిరోడ్డుపై యువకుడిని బండ రాళ్లతో.. కిరాతకంగా చంపిన మహిళలు.. వీడియో. https://t.co/QVOsfUmu5X pic.twitter.com/UyBF29btId
— vidhaathanews (@vidhaathanews) December 6, 2022
ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే యువకుడి అరుపులు విన్న స్థానికులు నిద్రలో నుంచి మేల్కొన్నారు. ఇరుగు పొరుగు వారు బయటకు వచ్చే సరికి నిందితులు అక్కడ్నుంచి పారిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే యువకుడిని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే విషయం తేలాల్సి ఉంది. నిందితులను ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదు.