మళ్లీ మా నాన్న పేరుతో జగన్ ఓట్ల రాజకీయం

గత అసెంబ్లీ ఎన్నికల్లో మా నాన్న వైఎస్ వివేకానంద హత్యను సానుభూతిగా మలుచుకుని ఓట్ల రాజకీయం చేసిన సీఎం జగన్ మళ్లీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లోనూ అదే రాజకీయం చేస్తున్నారని వివేకా కూతురు ఆగ్రహం

  • Publish Date - March 28, 2024 / 02:34 PM IST

  • మీ పేరు బయటకు వస్తుందనే సీబీఐ విచారణ వద్దంటున్నారా ?
  • చిన్నాన్నని చంపినవాడికి ఓటు వెయ్యమనడానికి సిగ్గు లేదా?
  • వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి ఆగ్రహం
  • నేను పోరాడేది న్యాయం కోసం..మీది పదవుల కోసం పోరాటం

విధాత : గత అసెంబ్లీ ఎన్నికల్లో మా నాన్న వైఎస్ వివేకానంద హత్యను సానుభూతిగా మలుచుకుని ఓట్ల రాజకీయం చేసిన సీఎం జగన్ మళ్లీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లోనూ అదే రాజకీయం చేస్తున్నారని వివేకా కూతురు వైఎస్ సునీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ హైకోర్టు వద్ద సునీతారెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్‌ ఐదేళ్లు అధికారంలోకి ఉండి ఈ కేసులో ఏమి చేయకుండా మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో వివేకా పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు జగన్‌కు బంధుత్వాల అర్థం తెలుసా?అని ప్రశ్నించారు. చిన్నాన్న అంటే నాన్నతో సమానమని, చిన్నాన్న చనిపోతే చావు వెనక కుట్ర నిర్ధారించలేదని, పైగా చిన్నాన్న కుమార్తె పైనే నిందలు వేయడం న్యాయమా? అని ఆవేదన వ్యక్తం చేశారు. మీ చెల్లి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీ బాధ్యత ఏంటని, నాపైనే కేసులు పెట్టడం ఏమైనా న్యాయమా అని నిలదీశారు. చిన్నాన్న చనిపోయి ఐదేళ్లు గడిచిందని, ఐదేళ్లుగా మీ ప్రభుత్వమే ఉన్నా ఏం చేశారని, ప్రతిపక్షంలో ఉన్నట్లు మీరు మాట్లాడటం సరికాదని, మీరు చేయాల్సిన పని సరిగా చేయనందునే బయటకు రావాల్సి వచ్చిందని సునీతారెడ్డి స్పష్టం చేశారు. నేను చెప్పేదంతా నిజమని, నాలాగే ఆయన చెప్పగలుగుతారా అని ప్రశ్నించారు. వివేకాను ఎవరు చంపారో దేవుడికి తెలుసని జగన్‌ అంటున్నారని, వివేకాను హత్య చేసిన వారికి రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు.

హత్య చేసిన వ్యక్తి ఎవరో…ఎవరు చంపించారో స్పష్టంగా చెబుతున్నారని, నిందితుల వెనక వైఎస్ అవినాష్, భాస్కర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారని, మీ ప్రభుత్వం ఉండి కూడా నిందితులకు భద్రత కల్పిస్తున్నారని సునీతారెడ్డి మరోసారి ఆరోపించారు. గతంలో మీరే సీబీఐ విచారణ కోరారని, ఇప్పుడు మీరే వద్దన్నారని, మీ పేరు బయటకు వస్తుందని సీబీఐ విచారణ కోరట్లేదా? అని కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితుడిని పక్కన పెట్టుకుని ఓటు వేయాలని కోరుతున్నారని, నిందితుడని సీబీఐ చెబుతున్నా అతడికి, మీరు ఓటు వేయాలని కోరుతున్నారని, మీ చిన్నాన్నను చంపించిన వ్యక్తికి ఓటు కోరడం తప్పుగా అనిపించట్లేదా అని సునీతారెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నా కూడా చిన్నాన్న గుర్తురాలేదని, ఎన్నికలు రాగానే ఇప్పుడు చిన్నాన్న గుర్తుకు వచ్చారని, సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాన్నను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. నేను పోరాడేది న్యాయం కోసం.. మీరు పోరాడేది పదవుల కోసమని, హంతకులకు ఓటు వేయవద్దని ప్రజలను కోరుతున్నానని ఆమె జగన్ ప్రభుత్వంపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.

Latest News