Amit Shah : మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు..లొంగిపోతే రెడ్ కార్పెట్

మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని, లొంగిపోయే వారికి రెడ్ కార్పెట్ స్వాగతం ఉంటుందని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

Amit Shah

విధాత: మావోయిస్టులతో ఎలాంటి చర్చల ప్రసక్తే లేదని..వారు బేషరతుగా ఆయుధాలు వదిలేసి లొంగిపోవాల్సిందేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వచ్చే వారికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతామని వారికి పునరావాసం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లా జగదల్పూర్ లో దసరా దర్బార్ కు అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. శాంతి చర్చలపై మావోయిస్టు పార్టీ నుంచి వరుసగా వెలువడుతున్న లేఖలపై ఈ సందర్భంగా అమిత్ షా స్పందించారు. 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారుతుందని పునరుద్ఘాటించారు. మావోయిస్టులు తమతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని.. ఇప్పుడు వారితో మాట్లాడడానికి ఏముందని ప్రశ్నించారు. 2014- 24 మధ్యకాలంలో జరిగిన ఎన్ కౌంటర్లలో భద్రతా సిబ్బంది మరణాలు 70శాతానికి, పౌరుల మరణాలు 85శాతానికి తగ్గాయని తెలిపారు. సుమారు 10,500 మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అభివృద్ది చేస్తాం

బస్తర్‌ అంతటా ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో ఆయుధాలతో శాంతికి విఘాతం కలిగించే వారికి భద్రతా దళాలు తగిన సమాధానం ఇస్తాయని మావోయిస్టులను హెచ్చరించారు. మార్చి 31, 2026 తర్వాత చత్తీస్ గఢ్ గ్రామాల అభివృద్ధిని మావోయిస్టులు అడ్డుకోలేరన్నారు. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌ అభివృద్ధి కోసం రూ.4లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని..భవిష్యత్తులో మరిన్ని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.

 

Exit mobile version