ఐటీ నోటీసుల కేసులో కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టులో బిగ్‌ రిలీఫ్‌

ఎన్నికల వేళ నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అష్టదిగ్బంధాన్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీకి సుప్రీంకోర్టులో సోమవారం (01-04-2024) భారీ ఉపశమనం లభించింది.

  • Publish Date - April 1, 2024 / 04:40 AM IST

లోక్‌సభ ఎన్నికలు ముగిసేంత వరకూ ఎలాటి బలవంతపు చర్యలు తీసుకోబోమన్న ఐటీ శాఖ

న్యూఢిల్లీ: ఎన్నికల వేళ నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అష్టదిగ్బంధాన్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీకి సుప్రీంకోర్టులో సోమవారం (01-04-2024) భారీ ఉపశమనం లభించింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నుంచి 1700 కోట్ల రూపాయల వసూలుకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని ఐటీ శాఖ అధికారులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఐటీ శాఖ తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. ఎన్నికల సందర్భంగా ఏ రాజకీయ పార్టీకి సమస్యలు సృష్టించాలని అనుకోవడం లేదని తెలిపారు.

దీనితో.. ఈ అంశంపై విచారణను జూలై 24, 2024.. అంటే లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత విచారిస్తామని పేర్కొంటూ ఈ కేసును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఐదు సంవత్సరాలకు ((1994..95, 2017.. 2018 నుంచి 2020-21) గాను 1823 కోట్లు చెల్లించాలంటూ లోక్‌సభ ఎన్నికలకు కొద్ది వారాల ముందు ఐటీ శాఖ కాంగ్రెస్‌ పార్టీని తాఖీదులు పంపింది. మరోవైపు 2014.. 15 ఆర్థిక సంవత్సరం నుంచి 2016..17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1745 కోట్లు చెల్లించాలని మరో తాజా నోటీసు పంపింది. ఈ నోటీసులపై తీవ్రంగా మండిపడిన కాంగ్రెస్‌.. కేంద్ర ప్రభుత్వం పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతున్నది ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై న్యాయపోరాటానికి దిగింది.

Latest News