విధాత : అతనొక సాదాసీదా చాయ్ వాలా. చాయ్ విక్రయిస్తూ జీవిస్తుంటాడని అంతా భావిస్తుంటారు. కాని అతని ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. కోట్ల కొద్ది ఆస్తులు బయటపడటం పోలీసులకు షాక్ కు గురి చేసింది. బీహార్ లో అభిషేక్ కుమార్ అనే చాయ్ వాలా ఇంట్లో పోలీసులు నిర్వహించిన సోదాలు సంచలనం రేపాయి. సోదాల్లో రూ.1.05 కోట్ల నగదు, 344 గ్రాముల బంగారం, 1.75 కేజీల వెండి గుర్తించారు. అంతేకాదు 75 బ్యాంక్ పాస్ బుక్స్, 28 చెక్ బుక్స్, ఆధార్ కార్డులు, ల్యాప్ టాప్స్, లగ్జరీ కారు స్వాధీనం చేసుకున్నారు.
ఇంత సొమ్ము..ఇన్ని ఆస్తులు అతనికి ఎలా వచ్చాయా అని విచారిస్తే….అతనొక సైబర్ నేరగాడు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నో సైబర్ నేరాలకు అభిషేక్ కుమార్ పాల్పడి కోట్లు కొల్లగొట్టినట్లుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అభిషేక్ కుమార్ అంతరాష్ట్ర సైబర్ క్రైమ్ నెట్‌వర్క్ లీడర్ గా వ్యవహరిస్తున్నాడని గుర్తించిన పోలీసులు అతని ముఠా ఆటకట్టించేందుకు చర్యలు చేపట్టారు. బీహార్‌తో పాటు ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బెంగాల్, అసోం రాష్ట్రాల్లో కూడా అభిషేక్ ముఠా చురుకుగా పనిచేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆన్‌లైన్ లోన్లు, కస్టమర్ కేర్ స్కామ్‌లు, ఉద్యోగ అవకాశాల పేరుతో మోసాలు, ఇంకా క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల పేరుతో ప్రజల నుంచి డబ్బులు కొల్లగొట్టాడు. అభిషేక్ కుమార్ సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ఆఫర్లతో ప్రజలను ఆకట్టుకుని, క్రమంగా వారి బ్యాంక్ వివరాలు, ఓటీపీలు దొంగిలించేవాడు. సోదాలలో లభ్యమైన ల్యాప్‌టాప్ లలో, పెన్ డ్రైవ్‌లలో ఉన్న డేటా పరిశీలిస్తున్నారు. సైబర్ మోసాలకు సంబంధించిన లావాదేవీల జాబితా, నకిలీ ఐడీ కార్డులు, ఇంకా 200 కంటే ఎక్కువ బాధితుల వివరాలు ఇప్పటివరకు బయటపడ్డాయి. క్రిప్టో వాలెట్ల ద్వారా జరిగిన డబ్బు మార్పిడుల వివరాలను గుర్తించారు. పోలీసులు అభిషేక్ కుమార్ ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.