ఎగ్జిట్‌పోల్స్‌ బాగానే ఉన్నా.. బీజేపీలో కలవరం రేపుతున్న ఆ అంశాలు!

శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఉత్సాహాన్ని కలిగించగా.. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమికి నిరాశ కలిగించేవే.

  • Publish Date - June 2, 2024 / 06:39 PM IST

న్యూఢిల్లీ: శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఉత్సాహాన్ని కలిగించగా.. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమికి నిరాశ కలిగించేవే. అయితే.. ఎగ్జిట్‌పోల్స్‌ కాదని, అవి మోదీ మీడియా పోల్స్‌ అని రాహుల్‌ కొట్టిపారేయడమే కాకుండా.. తమకు 295కు పైగా సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ విజయపరంపరను ఎగ్జిట్‌ పోల్స్‌ సూచిస్తున్నాయంటున్న కమలనాథుల్లో ఏదో ఒక మూల కాస్తం కొంత ఆందోళన ఉన్నట్టు కనిపిస్తున్నది. అవే.. ఈ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు. అదే సమయంలో ఇండియా కూటమిని కూడా కొన్ని ప్రశ్నలు వేధిస్తున్నాయి. అవి.. తమ కూటమి పొందికలో ఉన్న లోపాలు!

వాస్తవానికి ఎగ్జిట్‌ పోల్స్‌ అనేవి దాని ట్రాక్‌రికార్డు నేపథ్యంలో నమ్మశక్యం కాకుండా తయారయ్యాయి. అయితే.. వాటిని టీవీ చానళ్లు హోరెత్తిస్తుంటాయి. జనం కూడా ముందే ఫలితాలు తెలుసుకోవాలన్న ఉత్సుకతతో వాటిపట్ల ఆసక్తి చూపుతుంటారు. ఇందులో ఏ ఒక్క సర్వే కూడా ఒకదానితో ఒకటి పొంతన కలిగి ఉండదు. అయితే.. ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నట్టు మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడుతుందా? లేక కొందరు ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నట్టు బీజేపీ మెజార్టీకి దూరంగా ఉండిపోతుందా? అనేది జూన్‌ 4వ తేదీన తేలిపోనున్నది.

తమ సమస్యలను పక్కన పెట్టి బీజేపీకి ఓటేశారా?

అయితే.. ఇక్కడ కొన్ని అంశాలను రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. బీజేపీ హ్యాట్రిక్‌ గురించి ఘోషిస్తున్న సర్వే సంస్థలు.. తమ సర్వే అంశాల్లో ఎక్కడా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించలేదు. అదే సమయంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ కనీస స్థాయిలో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎదుర్కొనడం లేదని చెబుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. వాస్తవానికి ఈ అంశాన్ని కూడా ఎగ్జిట్‌ పోల్ సర్వేలు ముట్టుకోవడానికి సాహసించలేదు.

అయితే.. భారతదేశం గత పదేళ్లలో ఎదుర్కొంటున్న నిరుద్యోగిత, ధరల పెరుగుదల, ఆదాయాలు పెరగకపోవడం, రైతాంగ పోరాటాలు, స్వతంత్ర సంస్థల దుర్వినియోగం, ఇతర పార్టీల్లో ఉన్నవారు ఆ పార్టీని వదిలిపెట్టి.. అధికార పార్టీలో చేరి పునీతులు అవుతున్న దృశ్యాలు, బడా పెట్టుబడిదారులకు రెడ్‌ కార్పెట్లు వేయడం, గుప్పెడు మంది పారిశ్రామికవేత్తలను, బడా వ్యాపారులకు దోచిపెట్టడం.. ఇవన్నీ ప్రజలు గమనించలేదని, తమకు గుడ్డిగా ఓటు వేశారని భావించడం తప్పిదమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇవే అంశాలు బీజేపీని కలవరపెడతాయని పేర్కొంటున్నారు.

ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టుతో ప్రభుత్వ నియంతృత్వం ఏ స్థాయిలో ఉన్నదో జనానికి అర్థం కాలేదనుకోవడం, ఎన్నికల బాండ్ల పేరుతో వేల కోట్లను బీజేపీ ఖాతాకు మళ్లించుకున్న ఉదంతం, ఎన్నికల బాండ్ల కొనుగోళ్లకు, ఈడీ, సీబీఐ కేసులకు మధ్య సంబంధాలు ఉన్నట్టు బయటకు రావడం ఇవన్నీ ప్రజలు గమనించలేదని బీజేపీ భావిస్తే పెద్ద పొరపాటే అవుతుందని ఓ సీనియర్‌ జర్నలిస్టు చెప్పారు.

ఇండియా కూటమిలో భయాలు ఇవీ!

కాంగ్రెస్‌ సహా ఇండియా కూటమి నాయకులు ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తున్నామని ఘంటాపథంగా చెబుతున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఊహాజనితాలని, అవి మోదీ మీడియా పోల్స్‌ అని రాహుల్ చెబుతున్నారు. అయితే.. ఇండియా కూటమి విశ్వాసంపై కొన్ని కీలక అంశాలు అపనమ్మకాన్ని పాదుకొల్పుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తేనే భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనైనా విజయం సాధించగలం అనే పరిస్థితిలో ఇండియా కూటమి నేతలు ఉన్నారు. అయితే.. కూటమి పొందిక మొదలు.. దాన్ని నిలబెట్టుకునేంత వరకూ అనేక సమస్యలు ఇండియా కూటమిని ముప్పుతిప్పలు పెట్టాయి.

కూటమిని నిర్మించడంలో కీలక పాత్ర పోషించిన నితీశ్‌కుమార్‌ తన సహజసిద్ధ పిల్లమొగ్గ వేసి.. తాను ఏ బీజేపీకి వ్యతిరేకంగా కూటమి నిర్మాణానికి కృషి చేశారో.. అదే బీజేపీ చంకన చేరిపోయారు. సీట్ల పంపకాల్లో కూడా ఇండియా కూటమిలో ఒక నిర్దిష్ట ఫార్ములా లేకుండాపోయింది. జాతీయ స్థాయిలో మిత్రపక్షాలుగా ఉన్న లెఫ్ట్‌, కాంగ్రెస్‌.. కేరళలో వైరిపక్షాలు మారిపోయాయి. ఢిల్లీలో పొత్తులు పెట్టుకున్న ఆప్‌, కాంగ్రెస్‌.. పక్కనే ఉన్న పంజాబ్‌లో కత్తులు దూసుకున్నాయి. మమతా బెనర్జీ కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు.

ఇలాంటి అంశాలు ప్రజల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపి ఉంటాయన్నది కాంగ్రెస్‌కు, ఇండియా కూటమికి కలవరం కలిగించేవేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి మమతాబెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారు. ఆ సమయంలో దానిని కాంగ్రెస్‌ ఆమోదించి ఉంటే.. అది కూటమికి గట్టి ప్లస్‌ పాయింట్‌ అయి ఉండేదన్న అభిప్రాయాన్ని ఒక సీనియర్‌ జర్నలిస్టు వ్యక్తం చేశారు. ‘తద్వారా ఒక దళిత నేతను ప్రధాని పదవికి ప్రతిపాదించిన ఘనత కూటమికి దక్కేది. దానితోపాటే మోదీ తరచూ చెప్పే వారసత్వం అంశానికి అవకాశం దక్కి ఉండేది కాదు.

పైగా కూటమికి నాయకత్వ అంశం మొదట్లోనే కొలిక్కి వచ్చి ఉండేది. అది ప్రజల్లో సానుకూల సంకేతాన్ని పంపి ఉండేది. అంతేకాదు.. కాంగ్రెస్‌ వారసత్వ రాజకీయాలపై మోదీ దాడి చేసే అవకాశం దక్కి ఉండేది కాదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దళిత నేత మల్లికార్జున ఖర్గేను విమర్శించడానికి మోదీ వెనుకాడాల్సి వచ్చేది’ అని ఆయన విశ్లేషించారు. ఈ సంకట స్థితిలోనే ఇండియా కూటమి కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి గానీ, ఎన్నికల ప్రచార వ్యూహాలను ఖరారు చేసుకునేందుకు గానీ అవకాశాలు ఉండి ఉండేవని ఆయన అన్నారు.

Latest News