వంటింట్లో ధరల మంట!

‘నానాటికీ పెరిగిపోతున్న ఇంటి ఖర్చులు భరించలేక పోతున్నాం’ కొన్నేళ్లుగా మధ్యతరగతి ఇళ్లలో తరచూ వినిపిస్తున్న మాట ఇది! ఆహార ద్రవ్యోల్బణం అనేది ఒకటి ఉంటుంది

  • Publish Date - April 21, 2024 / 07:00 AM IST

ఏంగొనేటట్టు లేదు.. ఏందినేటట్టులేదు!
పదేళ్ల మోదీ పాలనలో ఆహార ద్రవ్యోల్బణం
మొన్నటికి మొన్న కిలో 200 పలికిన టమాటా
కోయకుండానే కళ్లలో నీళ్లు తెప్పించిన ఉల్లి
చుక్కలనంటి గోధుమలు, చక్కెర ధరలు
తిండికోసం 74% ప్రజల అవస్థలు
రైతులకు దక్కని గిట్టుబాటు ధరలు
పెరుగుతున్న ధరలను దించే శక్తి లేని మోదీ?

న్యూఢిల్లీ : ‘నానాటికీ పెరిగిపోతున్న ఇంటి ఖర్చులు భరించలేక పోతున్నాం’ కొన్నేళ్లుగా మధ్యతరగతి ఇళ్లలో తరచూ వినిపిస్తున్న మాట ఇది! ఆహార ద్రవ్యోల్బణం అనేది ఒకటి ఉంటుంది. ఆహార ధరల పెరుగదలను ఇది సూచిస్తుంటుంది. గత కొన్నేళ్లుగా ఇది తగ్గుతున్న దాఖలాలే లేవు. ధరల పెరుగుదల ఫలితంగా కోట్ల మంది ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా టోకు ధరల సూచీని గమనిస్తే.. గరిష్ఠ స్థాయిలో ఉన్నది. ప్రజల జేబులు కొల్లగొడుతున్న ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇదేమీ కొత్త సమస్య కాదు. మోదీ 2019లో తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాతి సంవత్సరం పప్పుల కుంభకోణం వెలుగు చూసింది. దాని ఫలితంగా కందిపప్పు ధర కిలో రెండు వందలు తాకింది. ఇప్పుడు తాజాగా 2024 ఫిబ్రవరి ఆహార ద్రవ్యోల్బణాన్ని గమనిస్తే కూరగాయల ధరలు పెరిగిన కారణంగా 8.66 శాతాన్ని తాకింది. 2024, జనవరి నెలలో కూరగాయల ధరలు 27.03 శాతం పెరగడంతో ద్రవ్యోల్బణం 30.25 శాతంగా నమోదైంది. ఇదే మోదీ ప్రభుత్వ హయాలో కిలో టమాటా 200 పలికిన సందర్భం చూశాం. ఉల్లిగడ్డలు, గోధుమలు, చక్కెర, ఇతర ఆహార పదార్థాల ధరలు చుక్కలనంటాయి.

భారత్‌లో పెరుగుతున్న ఆకలి
భారతదేశంలో ఆకలి పెరుగుతున్నదని అనేక అంతర్జాతీయ స్వతంత్ర సంస్థల నివేదికలు పేర్కొంటున్నా.. మోదీ సర్కారు మాత్రం బూటకపు ప్రకటనలు, తప్పుడు ప్రచారాలతో నెట్టుకొస్తూ వచ్చింది. కానీ.. ప్రభుత్వ చర్యలు గమనిస్తే.. ఆ నివేదికలతో ఏకీభవించినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే.. ఈ నివేదికలు వచ్చిన తర్వాతే గోధుమలు, బియ్యం, చక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. మోదీ ప్రభుత్వం చెబుతున్నట్టు అంతా బాగుంటే ఎగుమతులపై నిషేధాలు ఎందుకన్న ప్రశ్నలు తలెత్తతాయి. 2022 చివరిలో జాతీయ ఆహార భద్రతా చట్టం నుంచి మరికొన్ని ఆహార పదార్థాలను కేంద్రం తొలగించింది. ఇప్పుడు ఎన్నికలకు ముందు మళ్లీ ఆ కార్యక్రమాన్ని చేపట్టి, 80 కోట్ల మందికి ఉచితంగా తిండి గింజలు అందించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ సంస్థ అయిన నీతి ఆయోగ్‌ 2023 లెక్కల ప్రకారమే దేశంలో 74.1 శాతం మంది ఆహారం కోసం అవస్థలు పడుతున్నారు. ఈ లెక్కలను ఐక్యరాజ్య సమితి కూడా అంగీకరించింది.

ధరలన్నీ ఆకాశంవైపే!
2013లో కిలో గోధుమల ధర మార్కెట్‌లో రూ.16.10 ఉంటే.. 2024 ఏప్రిల్‌లో రూ.23.65కు చేరుకున్నది. కొన్నేళ్ల కిందట గోధుమల ధర ఆల్‌ టైమ్‌ గరిష్ఠానికి వెళ్లింది. ఎరువుల ధరలు విపరీతంగా పెరగడం, ఉక్రెయిన్‌.. రష్యా యుద్ధం, పంట కాలం కలిసిరాకపోవడం ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చాయి. అయినప్పటికీ మంచి విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ఉంటే.. ధరలు స్థిరంగా ఉండి.. దేశ ప్రజలు ఇబ్బందుకు గురికావాల్సి వచ్చేది కాదని విశ్లేషకులు అంటున్నారు. రైతుల నుంచి గోధుమల సేకరణ విషయంలో ప్రభుత్వానికి తగిన విధానం లేకపోయిందని చెబుతున్నారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం కేవలం 25 మిలియన్‌ టన్నుల గోధుమను మాత్రమే సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నది. వాస్తవానికి అంతకు ముందటి సంవత్సరం 34 మిలియన్‌ టన్నులను సేకరించిన విషయం గమనార్హం. అది కూడా భారత వ్యూహాత్మక ఆహార నిల్వలు కనిష్ఠానికి చేరుకున్న సమయంలో. వంటింట్లో నిత్యం ఉండే పాల ధరలు కూడా గత ఏడాది 15 శాతం పెరిగాయి. తర్వాత వంట నూనెలు కూడా మండాయి. 2021లో 80 రూపాయలు ఉంటే.. అది ఇప్పుడు 180కి పెరిగింది. కూరగాయలు, ప్రత్యేకించి టమాటా వంటివి ఒక దశలో పెట్రోల్‌ ధరలతో పోటీ పడ్డాయి. వాతావరణ పరిస్థితులు, పనికిమాలిన విధాన నిర్ణయాల కారణంగా ఉల్లిపాయల ధరల్లో కూడా హెచ్చుతగ్గులు కనిపించాయి. 2014, ఫిబ్రవరిలో నాసిక్‌ మార్కెట్‌లో కిలో ఉల్లిపాయల హోల్‌సేల్‌ ధర 4.5 రూపాయలు ఉంటే.. 2024 ఏప్రిల్‌ 16న అదే మార్కెట్‌లో కిలో 13.8 రూపాయలు పలికింది. వేసవిలో ప్రతి భారతీయుడు ఇష్టపడే మామిడి పళ్ల విషయం తీసుకున్నా.. 2012 నుంచి 2023 వరకు మామిడి పళ్ల ధర 116 శాతం పెరిగింది. 2013లో కిలో మామిడిపళ్లు 96 రూపాయలు ఉంటే.. 2023లో అది రూ.216.1 కి చేరింది. యాపిల్‌ పళ్లు కూడా వాతావరణ పరిస్థితులకు తీవ్రంగా ప్రభావితమవుతుంటాయి. అయితే.. ఇక్కడ మరో అంశం ఏమిటంటే.. యాపిల్‌ మార్కెట్‌ను నియంత్రిస్తున్న కార్పొరేట్‌ వ్యాపారులకు వ్యతిరేకంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తింది. యాపిల్‌ మార్కెట్‌పై కార్పొరేట్‌ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాలంటూ అదానీకి చెందిన స్టోర్ల ఎదుటే కాకుండా.. ప్రభుత్వ కార్యాలయాల ముందు కూడా హిమాచల్‌ రైతులు ఆందోళనకు దిగారు.

జేబులు లూటీ
దీని మొత్తం సారాంశం.. ఆహార ధరలు పెరిగిపోతున్న కారణంగా మరింత ఆకలి పెరుగుతున్నది. పోషకాహార లేమి వెంటాడుతున్నది. పెరిగిన ధరలతో పేద, మధ్యతరగతి ప్రజల పళ్లాల్లో తిండి క్రమంగా తగ్గిపోతున్నది. ఆహార పదార్థాలను కొనుగోలు చేసే ముందు ఒకటిరెండు సార్లు ఆలోచించి కొనాల్సిన పరిస్థితి తలెత్తింది.మరోవైపు రైతులు తమకు గిట్టుబాటు ధర రాక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. తాము ఉత్పత్తి చేసిన పంటల్లో తమకు తగిన వాటా కావాలనే డిమాండ్‌తోనే అన్నదాతలు మరోమారు దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్ధపడ్డారు. ధరల పెరుగుదల ప్రాథమికంగా పెద్ద వ్యాపారులు, స్టాక్‌ నిల్వ ఉంచేవారు, అగ్రి ప్రాసెసింగ్‌ కంపెనీలకు మాత్రమే లబ్ధి చేకూరుతున్నదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు, పన్ను చెల్లింపుదారులు, రైతులు, చిన్న వ్యాపారులు.. వీరంతా ద్రవ్యోల్బణం భారాన్ని నెత్తిన మోస్తున్నారు. విచిత్రం ఏమిటంటే.. శక్తిమంతుడని చెప్పే మోదీ.. ఈ పదేళ్ల పాలనాకాలంలో ఈ ధరలను కనీసమైనా దించలేక పోవడం!

Latest News