Angry Rhino ।
అడవి.. జంతువుల ఆవాసం. అక్కడికి వెళ్లినప్పడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఇబ్బంది పెట్టినా అడవి జంతువులు వెంటాడుతాయి. దక్షిణాఫ్రికాలోని గ్రేటర్ క్రుగెర్ నేషనల్ పార్క్‌లో ఇటువంటి భయంగొలిపే ఘటన ఒకటి చోటు చేసుకున్నది. పర్యాటకులను చూసి ఆగ్రహానికి గురైన ఖడ్గమృగం.. వారి జీపును దాదాపు కిలోమీటరు దూరం వరకు వెంటాడింది. భయపడిపోయిన డ్రైవర్.. మట్టి రోడ్డు పైనే బతుకు జీవుడా అంటూ ఖడ్గ మృగం వేగానికి మించిన స్పీడుతో జీపును తోలుకుపోయాడు.
విధాత : అనస్టాసియా చాప్‌మన్ అనే మహిళ తన స్నేహితులతో కలిసి దక్షిణాఫ్రికాలోని గ్రేటర్ క్రుగెర్ నేషనల్ పార్క్‌కు (Greater Kruger National Park) వెళ్లింది. అక్కడ ఒక ఖడ్గమృగం (Rhino) గడ్డి తింటూ ఉన్నది. వారిని చూసిన ఆ జంతువు.. అకస్మాత్తుగా వారివైపు దూసుకొచ్చింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ జీపును ముందుకు దూకించాడు.
అయినా వదలని ఖడ్గమృగం.. వారి జీపును దాదాపు కిలోమీటరు దూరం వరకు వెంటాడింది. తనకు ఎదురైన భయానక అనుభవాన్ని చాప్‌మన్ తన ఇన్‌స్టాలో రాసుకుని.. సదరు వీడియోను పోస్ట్ చేసింది. క్రుగెర్ పార్క్‌లో మాకో విచిత్రమైన అనుభవం ఎదురైంది. కోపంతో ఉన్న ఒక ఖడ్గమృగం మమ్మల్ని వెంటాడింది. మూడు నాలుగు నిమిషాలపాటు దాదాపు కిలోమీటరు దూరం తరిమింది.
మా గైడ్ చిత్తడిచిత్తడిగా ఉన్న ఆ మట్టిరోడ్డుపైనే సాధ్యమైనంత వేగంగా జీపును నడిపించి.. మమ్మల్ని క్షేమంగా బయటపడేశాడు. ‘దాని ప్రవర్తన సాధారణంగా లేదు. జంతువులతో తనకు అప్పుడప్పడు ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయని, కానీ ఇది తన టాప్ 5 భయానక అనుభవాల్లో ఒకటని మా గైడ్ చెప్పాడు’ అని ఆమె రాశారు. అంతేకాదు.. ‘అడవులు జంతువుల ఆవాసం, వాటి గడ్డ. మనం అక్కడ అతిథులం మాత్రమే అని ఈ ఘటన మనకు గుర్తు చేస్తున్నది’ అని పేర్కొన్నారు.
ఈ వీడియో వైరల్ అయ్యింది. దీనిని చూసిన వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. వాటి భారీ కాయం, మెల్లగా కదిలే గుణం రీత్యా అవి త్వరగా అలిసిపోతాయని అనుకున్నా.. కానీ.. ఈ వీడియో చూసిన తర్వాత అవాక్కయ్యానని ఒకరు రెస్పాండ్ అయ్యారు. ఖడ్గమృగాల ప్రాంతంలోకి వెళ్లినప్పడు వాటిని వాటి మానాన వదిలేయాలికానీ.. దగ్గరకు పోకూడదు.. అని మరొకరు పేర్కొన్నారు.
కొద్ది రోజుల క్రితం పశ్చిమబెంగాల్‌లోని జల్దపార నేషనల్ పార్క్‌లో (Jaldapara National Park) ఖడ్గ మృగాలను ఒక ఓపెన్ జీపులోని పర్యాటకులు ఫొటోలు తీస్తుండగా.. రెచ్చిపోయిన ఖడ్గమృగం ఒకటి.. వారిని వెంటబడి తరిమింది. కంగారుపడిపోయిన డ్రైవర్ జీపును వెనక్కు నడిపించడంతో పక్కనే ఉన్న గోతిలోకి జీపు బోల్తా కొట్టింది.
Angry Rhino | రెచ్చిపోయిన ఖడ్గమృగం.. పర్యాటకులను తరిమిన ‘రైనో’ | Vidhaatha | Latest Telugu Newshttps://t.co/A4uNc1JPgy #viral #rhino pic.twitter.com/M0fKFaFoAx
— vidhaathanews (@vidhaathanews) March 29, 2023