విధాత : కేసీఆర్ ప్రసంగంలో పస లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, నాయకులంతా వరుస బెట్టి ఎందుకు విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతు కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ 7లక్షల కోట్ల అప్పులు చేసి..వేలకోట్లు దోచుకున్నారంటున్న కాంగ్రెస్ నేతలు దేశాన్ని 50 ఏళ్ళు ఏలి ఎన్ని లక్షల కోట్లు తిన్నారని నిలదీశారు. అందుకే సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇచ్చారా…? అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పందికొక్కుల్లా తింటున్నారని అందుకే రాష్ట్ర ఆదాయం 15వేల కోట్లు తగ్గిందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ తన పేరు ప్రస్తావించలేదని సీఎం రేవంత్ రెడ్డికి బాధ ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్తు పెట్టుకోవడం లేదన్నారు. కేసీఆర్ ను తిడుతున్న వాళ్ళు నాడు సమైక్యాంధ్ర తొత్తుల కింద ఉన్నారన్నారు. తెలంగాణకు ఎప్పటికి కాంగ్రెస్ పార్టీనే విలన్ అని..అదే తెలంగాణ చరిత్రలో ఉంటుందని జగదీష్ రెడ్డి అన్నారు.
తెలంగాణను ఆంధ్రాలో కలిపిందని.. కాంగ్రెస్ తెలంగాణ పేరు ఎత్తితే వాళ్ళను నక్సలైట్ల పేరుతో కాంగ్రెస్ కాల్చి చంపిందని విమర్శించారు. కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తే ఎవరూ పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ ఏం మాట్లాడుతారో అని మీరు, ప్రజలు ఎదురుచూశారన్నారు. అసెంబ్లీలో పిల్లల్ని ఏం పీకలేకపోతున్నారని..అవతలి టీమ్ బలహీనంగా ఉందని పిల్లల్ని అసెంబ్లీకి పంపుతున్నారన్నారు. కేసీఆర్ ఏ టైమ్ కు ఎట్లా రావాలో అసెంబ్లీకి వస్తారని జగదీష్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో మళ్లీ సమైక్య పాలన రోజులు
16నెలల కాంగ్రెస్ పాలనలో మళ్లీ సమైక్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వచ్చాయని జగదీష్ రెడ్డి విమర్శించారు. ఒక్క ఏడాదిలోనే గురుకుల పాఠశాలల్లో 90 మంది విద్యార్థులు చనిపోయారని విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపాలని, ఈ రోజు వరకు ఎంత ధాన్యం కొన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు., ఎన్ని వడ్లు కొన్నారు..? ఎంత బోనస్ ఇచ్చారో చెప్పాలని..చెప్పకపోతే మీరు రండలు అని జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ మీద ఎందుకు ఏడుస్తున్నారని..కేసీఆర్ మీకు సంవత్సరంన్నర సమయం ఇచ్చారన్నారు. ఎన్.డి.ఎస్.ఏ ఇచ్చిన రిపోర్ట్ నిజం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరూపించాలని సవాల్ చేశారు. కాశేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న హుజూర్ నగర్ కు నీళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఎన్.డి.ఎస్.ఏ నివేదిక కాదని, అది ఎన్డీఏ నివేదిక అని..ఎన్డీఏలో తెలంగాణ కాంగ్రెస్ ఉందని ఎద్దేవా చేశారు.
హామీలు అమలు చేయలేకపోతే ప్రజల కాళ్లు పట్టుకోండి
ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని జీవో ఇచ్చారని, 41 వేల కోట్లు రుణమాఫీ అని చెప్పి 21 వేల కోట్లు చేశామని చెప్పారన్నారు. ఇప్పుడు రైతు రుణమాఫీ పూర్తి అయిందని అంటున్నారని, బీఆర్ఎస్ సభను చూసి లాగులు తడుపుకుంటున్నారన్నారు. పిచ్చిపట్టినట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని, పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారా..? అని ప్రశ్నించారు. హామీలు అమలకు పైసలు లేవని కాంగ్రెస్ పాలకులు ఏడుస్తున్నారన్నారు. మా హామీలు ఇచ్చినందుకు తప్పు అయిందని తెలంగాణ, ప్రజల కాళ్ళు పట్టుకోండి అని హితవు పలికారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు..ఎన్ కౌంటర్లు జరగలేదన్నారు. ఓట్ల రాజకీయం చేసేది బీజేపీ అని విమర్శించారు.
ఆపరేషన్ కగార్ ఆపాలి
కర్రె గుట్టల్లో ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. కే.ఆర్.ఎం.బీలో మనకు వచ్చే నీళ్ల వాటాను వాడుకునే దమ్ము ప్రభుత్వంకు లేదని విమర్శించారు. 130 టీఎంసీల నీళ్లు ఏపీ ప్రభుత్వం తీసుకుపొతే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభలో కేసీఆర్ ఒక్కరే మాట్లాడరంటున్నారని..మరి..మోడీ సభలలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తో ఎప్పుడైనా మోదీ మాట్లాడించారా…? అని, బీఆర్ఎస్ సభకు పల్లీలు అమ్ముకునే అంత జనం కాంగ్రెస్ వాళ్లకు వచ్చినా చాలు అని అన్నారు. కేసీఆర్ లాగా ఒక్కరే మాట్లాడే సభను కాంగ్రెస్ నేతలను పెట్టమనండని సవాల్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్ ,మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత , భాస్కర్ రావు , గాదరి కిషోర్ కుమార్ ,రవీంద్ర కుమార్ , భూపాల్ రెడ్డి , నాయకులు మల్లికార్జున్ రెడ్డి ,కడారి స్వామి యాదవ్ పాల్గొన్నారు.