97.48 శాతానికి చేరిన రికవరీ రేటు
విధాత,దిల్లీ: దేశంలో హెచ్చుతగ్గులతో కరోనా వ్యాప్తి కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు, మరణాల్లో తగ్గుదల కనిపించింది. కేసులు 32 వేలకు తగ్గగా.. మరణాలు 400 మార్కుకు చేరువయ్యాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడించింది.
తాజాగా 11,81,212 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 32,937 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే కేసులు 8.7శాతం మేర తగ్గాయి. నిన్న మరో 417 మంది మరణించారు. దాంతో మొత్తం కేసులు 3.22 కోట్లకు చేరగా.. ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,31,642గా ఉంది. అయితే నిర్ధారణ పరీక్షలు తగ్గడం కూడా కేసుల సంఖ్యలో క్షీణతకు కారణంగా కనిపిస్తోంది.
ఇక నిన్న 35,909 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.14 కోట్ల మంది వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 97.48 శాతానికి చేరింది. ప్రస్తుతం 3,81,947 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. క్రియాశీల రేటు 1.19 శాతానికి తగ్గింది. నిన్న సెలవురోజు కావడంతో వ్యాక్సినేషన్ నెమ్మదించింది. తాజాగా 17,43,114 మంది టీకా వేయించుకోగా.. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 54,58,57,108కి చేరింది.