▪️చంద్రబాబుపై మండిపడ్డ ఎమ్మెల్యే అనంత
▪️రెండేళ్లుగా అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట
▪️జగనన్న కాలనీలతో సొంతింటి కల సాకారం
▪️కొడిమి లేఔట్‌లో ‘మెగా గ్రౌండింగ్ మేళా’
విధాత,అనంతపురం, జులై 03 :సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చేస్తున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. రెండేళ్లుగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతుంటే అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ముందుకెళ్తున్నారని మండిపడ్డారు. సంక్షేమాన్ని అడ్డుకుంటే చరిత్రహీనులుగా నిలిచిపోతారని హెచ్చరించారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా కొడిమి లేఔట్‌లోని జగనన్న కాలనీలో శనివారం మెగా గ్రౌండింగ్ మేళా నిర్వహించారు.
డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, కమిషనర్ మూర్తితో కలిసి పలువురు లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ జగనన్న కాలనీలతో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామన్నారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, నవరత్నాలను ప్రకటించారన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచే మేనిఫెస్టోను అమలు చేస్తున్నామని, అందులో భాగంగానే పేదలందరికీ ఇంటి పట్టాలను అందించి నిర్మాణాలను చేపడుతున్నామన్నారు.
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ఎక్కడా సంక్షేమాన్ని విస్మరించడం లేదన్నారు. లబ్ధిదారులంతా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని కోరారు. ఆలోగానే కాలనీల్లో రోడ్లు, కరెంట్, బోర్లు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు చెప్పారు. ప్రతి లేఔట్‌ను సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. పేదలకు మంచి చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు తమ ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. చంద్రబాబు, లోకేశ్‌లు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అడ్డుకున్నారని, కోర్టులకు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్‌పై ప్రజలకు విశ్వాసం ఉందని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతామన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ అధికారులు, కార్పొరేటర్లు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.