Telangana Bhavan in Delhi | రేవంత్ ఇంటి ముందు అవమానం.. ఇక్కడే ఉంటే అరెస్టు చేస్తామని హెచ్చరిక! కంటతడి పెట్టిన ఐ అండ్ పీఆర్ ఉద్యోగి

మీరు ఎవరు, ఎందుకొచ్చారు ఇక్కడికి అంటూ ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది అసిస్టెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐ అండ్ పీఆర్ ఉద్యోగినిని వెళ్లగొట్టారు.

హైదరాబాద్, విధాత
ఢిల్లీలో తెలంగాణ భవన్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐ అండ్ పీఆర్ ఉద్యోగికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంగ్లా గేటు వద్ద తీవ్ర అవమానం ఎదురైంది. మీరు ఎవరు, ఎందుకొచ్చారు ఇక్కడికి అంటూ ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆమెను వెళ్లగొట్టారు. తను ఐ అండ్ పీఆర్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నానని, ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో నియమించారని హర్ష భార్గవి వివరించింది. అయినప్పటికీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది విన్పించుకోకుండా బయటకు వెళ్లిపోతారా లేదంటే పోలీసులను పిలిపించి అరెస్టు చేయించాలా అంటూ దబాయించారు. ఈ ఘటనతో హతాశురాలైన ఆమె బయటకు వచ్చారు. రోడ్డు పక్కన నిల్చొని తన పై అధికారికి జరిగిన అవమానం గురించి ఫోన్ లో తెలియచేశారు. బయట కూడా నిల్చోవద్దు, వెళ్లిపోవాలని అంటున్నారు, నేను రెగ్యులర్ ఎంప్లాయిని ఎందుకు అరెస్టు చేస్తారంటూ కన్నీరు పెట్టుకున్నది. నేను ఏం తప్పు చేశాను, బయటే నిల్చున్నాను, లోపలికి కూడా వెళ్లలేదన్నారు. ఢిల్లీ పోలీసులు వచ్చి తన పేరు రిజిష్టర్ చేసుకున్నారు, పోలీసు వాహనం వచ్చే వరకు ఆగమన్నారు. తనకు రేవంత్ రెడ్డి బంగ్ల ముందు ఎదురైన ఘటన గురించి హర్ష భార్గవి ఢిల్లీ పోలీసులకు వివరించారు. తను ప్రభుత్వ ఉద్యోగిని అని, సీఎం రేవంత్ రెడ్డి ని కలవడానికి వచ్చానని, లోనికి అనుమతించలేదని ఆమె చెప్పారు.