Site icon vidhaatha

Mp Arvind | కేసీఆర్‌కు ఇంట్లోనే ముప్పు.. ఎవరన్నా చంపుతారని భయం

హైదరాబాద్: బీఆరెస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇంటి సభ్యుల నుంచే ముప్పు పొంచి ఉందని నిజామాబాద్‌ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఫామ్‌హౌస్‌కే కేసీఆర్‌ పరిమితమయ్యారని చెప్పారు. అందరూ ఒక్క చోటే ఉంటే.. ఆయన కుటుంబ సభ్యులే ఆయనను చంపే అవకాశం ఉందని భయపడిన కేసీఆర్‌.. కుటుంబానికి దూరంగా ఉంటున్నారని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కన్నబిడ్డలు కలవాలన్నా ఆయన ముందుగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వాల్సిందేనని అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చేసిన అవినీతి అక్రమాలతో వచ్చిన సొమ్ముతోనే ఎల్కతుర్తిలో బీఆరెస్‌ సభ నిర్వహించబోతున్నదని ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులపైనా, నాటి నీటిపారుదల శాఖ మంత్రిపైన సీబీఐ, ఈడీ విచారణ జరపాలని, వారిని జైల్లో పెట్టాలని అరవింద్‌ డిమాండ్‌ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ.. కేసీఆర్‌ కంటే ఈయన మరీ డేంజర్‌ అని అన్నారు. ప్రజలు కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా రేవంత్‌రెడ్డిని ఎన్నుకుంటే.. ఆయన పాత అధికారులను ఎందుకు కొనసాగిస్తున్నారన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. అత్యంత అవినీతికర అధికారులు గత ప్రభుత్వంలో ఉన్నారని ఆరోపించారు. అసలు.. అధికారుల మీద ముందు విచారణ జరిపితే.. ఎవరు సమర్థవంతమైనవారో వెల్లడవుతుందన్నారు.

Exit mobile version