Site icon vidhaatha

తల్లిదండ్రులూ.. మీరు మారాలి.!

అమ్మానాన్న అనే పువ్వులకు పుట్టిన సౌరభాలు – పిల్లలు. వాళ్లు మన ప్రేమకు ప్రతీకలు. వాళ్లకు ముల్లు దిగితే, మనకు గునపం దిగినట్లుగా ఉంటుంది. వాళ్లను దారిలో పెట్టాలితప్ప, దండించకూడదు. ఒక తల్లిగా, తండ్రిగా, కుటుంబానికి, సమాజానికి ఒక బాధ్యతగల పౌరుడిని అందించగలగాలి తప్ప డబ్బు సంపాదించే మెషిన్ను కాదు. చదవనివ్వండి… చేయనివ్వండి… స్వేచ్చగా.. ఇష్టంగా.. కానీ సరైన పద్ధతిలోనే. తల్లయ్యారు.. తండ్రయ్యారు..ఇక స్నేహితులవ్వండి.. మార్గదర్శిగా మారండి.

‘అపజయమే విజయానికి సోపానం’

ఇంటర్‌ పరీక్షాఫలితాలు చూసాక, ఏడెనిమిది మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత క్షోభ? ఎంత దుఃఖం? ఆ బాధ వర్ణనాతీతం. అందరు తల్లిదండ్రుల గుండె కన్నీటిసంద్రమయింది. అయ్యో.. పరీక్షదేముంది? మళ్లీ రాసి, పాసవచ్చు కదా. ప్రాణం పోతే తిరిగివస్తుందా? అని మనమే అంటున్నాము. కానీ, ఆ భయం, ఒత్తిడి వాళ్ల గుండెల్లో ఎంత పేరుకుపోయిందో గమనించారా? లేదు. మనకి అవేవీ అవసరం లేదు. అసలు పిల్లలను ఎలా పెంచాలో ఎంతమందికి తెలుసు? అంతటికీ కారణం నేటి తల్లిదండ్రులే. వాళ్ల ఆశలు వీళ్లమీద రుద్దడం, వాళ్లకు చేతకాకపోతే తిట్టడం, కొట్టడం, భయపెట్టడం. నువ్వు డాక్టర్‌ కావాలి, ఇంజనీర్‌ కావాలి, కలెక్టర్‌ కావాలి.. అని చిన్నప్పటినుంచే నూరిపోయడం బాగా అలవాటయిపోయింది.

అంతే కానీ, వాడికేది ఇష్టం? ఎందులో ప్రావీణ్యం ఉంది? అని అడిగారా ఎప్పుడైనా? లేదు. వాళ్ల చదువు పోకడ, ఇంట్లో వాళ్ల ప్రవర్తన, వాళ్లకు ఇష్టమైన టైంపాస్‌… వీటిని సరిగ్గా గమనిస్తే ఏ సమస్యలు రావు. మన గొప్పదనం కోసమైనా, వారికో స్మార్ట్‌ఫోన్‌ – అపరిమిత డాటాతో. ఇదొక్కటి చాలు.. రామున్నయినా రావణున్ని చేయడానికి. జియో సిమ్‌కార్డ్‌, యూట్యూబులు, వాట్సప్‌లు, ఫేస్‌బుక్కులు, టిక్‌టాక్‌లు, పబ్‌జీలు… చాలవా? ప్రళయం మొదలవడానికి? తప్పంతా మన దగ్గర పెట్టుకుని వాళ్లను దండిస్తే ప్రయోజనమేమిటి? వద్దు. ఇక చాలు.

Exit mobile version