బెంగళూరు: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు మరింత ఉద్ధృతమవుతోంది. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ ప్రాణాంతక వైరస్‌ను కట్టడి చేసేందుకు ఢిల్లీ వంటి రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించగా, మరికొన్ని రాష్ట్రాలు నైట్‌కర్ఫ్యూ సహా లాక్‌డౌన్ వంటి ఆంక్షలు అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు వారాంతపు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి.
తాజాగా, రేపటి నుంచి రెండు వారాలపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. నిన్న కర్ణాటకలో అత్యధికంగా 34 వేల కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ఇన్ని కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ చైన్‌ను తెగ్గొట్టేందుకు ఈ నెల 27వ తేదీ నుంచి 14 రోజులపాటు కఠిన లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు యడియూరప్ప ప్రభుత్వం ప్రకటించింది.
మంత్రులు, నిపుణులతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యడియూరప్ప ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకు నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు మాత్రం ప్రజలను అనుమతిస్తామన్నారు.