Nizamabad |
విధాత ప్రతినిధి, నిజామాబాద్: పొరపాట్లకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన జరగాలని ఓటరు జాబితా పరిశీలకులు, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జెడ్.చోంగ్తు సూచించారు. ఆమె కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, బాల్కొండ, బోధన్, బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను శనివారం సందర్శించారు.
చంద్రాయనపల్లి, పెర్కిట్, శ్రీరాంపూర్ పాఠశాలల్లో కొనసాగుతున్న పోలింగ్ స్టేషన్లతో పాటు, నిజామాబాద్ అర్బన్ పరిధిలోని మోడరన్ పబ్లిక్ హైస్కూల్, ఎడపల్లి మండలం జానకంపేట్, వర్ని మండలంలోని సత్యనారాయణపురం పోలింగ్ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గత ఏడాది నవంబర్ నుండి ఇప్పటివరకు జిల్లాలో చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాల నిర్వహణ తీరుతెన్నుల గురించి కలెక్టర్ వివరించారు.
ఈ సందర్భంగా పరిశీలకులు క్రిస్టినా జెడ్.చోంగ్తు సిబ్బందితో చర్చించారు.18-19 సంవత్సరాల వయస్సు కలిగిన కొత్త ఓటర్ల నుండి స్పందన ఎలా ఉంది అని ఆరా తీశారు. ఓటరు నమోదు కార్యక్రమం గురించి గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారా, ఇంటింటి సర్వే సందర్భంగా గమనించిన అంశాలేమిటీ తదితర వాటిని ఆరా తీశారు. మృతి చెందిన ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించే ముందు కుటుంబ సభ్యుల ద్వారా నిర్ధారణ చేసుకోవాలని, మరణ ధ్రువీకరణ పత్రం లేకపోయినా సంబంధిత మున్సిపల్, గ్రామ పంచాయతీ నుండి సేకరించి ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని అబ్జర్వర్ సూచించారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి ఓటరు జాబితా పరిశీలకులు క్రిస్టినా జెడ్ చోంగ్తు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పులు కోరుతూ దాఖలైన దరఖాస్తుల వివరాలను కలెక్టర్ ఆమె దృష్టికి తెచ్చారు. రాజకీయ పార్టీల ప్రతినిధులను ఉద్దేశించి పరిశీలకులు క్రిస్టినా మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నియమ, నిబంధనలు తప్పకుండా పాటిస్తూ, పక్కాగా ఓటరు జాబితా రూపకల్పన జరిగేలా కృషి జరుగుతోందన్నారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఈ ప్రక్రియలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, పూర్తి సహకారం అందించాలని కోరారు. కాగా బోధన్, నిజామాబాద్ నియోజకవర్గాల పరిధిలో బోగస్ ఓటర్ల నమోదుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలుపగా, క్షేత్ర స్థాయిలో ప్రత్యేక బృందాలతో క్షుణ్ణంగా విచారణ జరిపిస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వివరించారు. ఈ నెల 19వ తేదీ లోపు కొత్త ఓటర్లు అందరు తమ పేర్లు నమోదు చేసుకునేలా విస్తృత ప్రచారం చేస్తూ, అవగాహన కల్పించాలన్నారు.