మొత్తం 175 సీట్లలో 165 సీట్లు కూటమికే
జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత
అనేక జిల్లాల్లో ఖాతా తెరవని అధికార పార్టీ
కడప జిల్లాలోనూ అంతంత మాత్రమే
మంచి చేసినా ఎందుకు ఇలాగైందో?
నిట్టూర్చిన వైసీపీ అధినేత జగన్
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
9న సీఎంగా చంద్రబాబు ప్రమాణం
విధాత, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. అధికారంలో ఉన్న వైసీపీని కోలుకోలేని విధంగా చావుదెబ్బ కొట్టింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గాను టీడీపీ 136, జనసేన 21, బీజేపీ 8 సీట్లలో గెలుపొందాయి. 175 సీట్లకు 175 సీట్లు ఎందుకు గెలవం? అన్న వైసీపీ.. మిగిలిన 10 సీట్లతో సరిపెట్టుకున్నది. అందరికీ అన్నీ చేసినా ఎందుకు ఇలా అయ్యిందోనంటూ నిట్టూర్చిన జగన్.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. భారీ మెజార్టీతో గెలిచిన కూటమి తరఫున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన అమరావతిలో ప్రమాణం స్వీకరించనున్నారు. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా నాలుగోసారి, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అవుతున్నారు.
జనంలో జగన్‌పై తీవ్ర ఆగ్రహం
కూటమి 165 సీట్లలో విజయాన్ని కైవసం చేసుకోవడం చూస్తే ఆంధ్రులు పాలక పార్టీపై ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో తెలిసిపోతున్నది. ఇంత ఘోరంగా ఓటర్ల చేతిలో చెంప దెబ్బలు తింటామని అధికార వైసీపీ కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. వైసీపీ ఘోర పరాభవానికి ప్రధాన కారణాలు అనేకం ఉన్నాయి. రాష్ట్ర సచివాలయం నుంచి పాలన చేయకుండా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అధికారం చెలాయించడం, మూడు రాజధానులు చేస్తున్నామని చెప్పి అమలు చేయకుండా తాత్సారం చేయడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్టులో అనామకులు సంతకం చేసినా భూమి హక్కులు బదలాయింపు ప్రక్రియ పూర్తి, మాజీ ఎంపి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కోవడం, నిండు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి శీలాన్ని వైసీపీ సభ్యులు శంకించడం, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అడుగుజాడల్లో నడవడం, వివేకానంద రెడ్డి హత్య విషయంలో జగన్, ఆయన సతీమణి భారతీ, ఎంపి అవినాష్ రెడ్డిని చెల్లెళ్లు వైఎస్ షర్మిల, డాక్టర్ సునీత సూటిగా విమర్శించడం, ఊరు పేరు లేని కంపెనీల మద్యం బ్రాండ్ల విక్రయం, కాపు రిజర్వేషన్లు… వైసిపి ఘోర పరాజయానికి కారణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇన్ని తప్పిదాలపై ఆలోచన లేకుండా, సమీక్షించుకోకుండా జగన్ ‘నేను’ అనే పూర్తి అహంభావంతో ప్రజలకు ఉచితాలను అందించాను, గెలుస్తాననే ధీమాలో ఉండిపోయారు. అభివృద్ధి కార్యక్రమాలను వెచ్చించాల్సిన సొమ్మును కూడా పుట్నాలు, బొంగు పేలాల మాదిరి పంచేసి ఓటర్లను తన వైపునకు తిప్పుకోవాలని చేసిన ప్రయత్నాలకు చావుదెబ్బ కొట్టారు. ఇప్పట్లో వైసీసీ పుంజుకుని పునర్వైభవం సాధించడం, చంద్రబాబు నాయుడు ఆ పార్టీని బతకనిస్తాడని అనుకోవడం అసాధ్యమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొంప ముంచిన మూడు రాజధానులు
ప్రతిపక్ష నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి మద్దతు పలికి, ముఖ్యమంత్రి కాగానే మాట మార్చి, మూడు రాజధానులంటూ చెప్పడం మొదలు పెట్టారు. అమరావతిలో అసెంబ్లీ, కౌన్సిల్, విశాఖపట్నంలో సచివాలయం, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, కర్నూలు న్యాయ రాజధాని అంటూ జగన్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఊదరగొట్టారు. ఇందులో ఏదీ కార్యరూపం సాధించకపోవడం జగన్ తొలి వైఫల్యంగా చెప్పుకోవాలి. రాజధాని అనేది లేకుండా చేసిన జగన్‌పై రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఆగ్రహంతో రగిలిపోయారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉండగా, ఆంధ్రకు లేకపోవడం ఓటర్లను ఆలోచింపచేసిందనే చెప్పాలి.
ల్యాండ్ టైటిలింగ్ యాక్టు
ఆంధ్రలో భూముల హక్కుల బదలాయింపుపై వివాదాస్పదమైన చట్టం జగన్ తీసుకువచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ధరణి తీసుకువచ్చిన విధంగా, ఆంధ్రలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టును తెచ్చారు. ప్రభుత్వ అధికారితో సంబంధం లేకుండా, ప్రభుత్వం నియమించిన వ్యక్తి ఎవరైనా సరే భూముల హక్కలను ఒకరి నుంచి మరొకరికి బదలాయించే అధికారాన్ని ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టారని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఈ చట్టం మూలంగా జగన్ అపఖ్యాతి పాలయ్యారు.
కాలుకు బలపం కట్టుకుని తిరిగిన చెల్లెళ్లు
మాజీ ఎంపీ వైఎస్.వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసులో జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన భార్య భారతి, ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసును సీబీఐ విచారిస్తున్నది. ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొకుంటున్న అవినాష్ రెడ్డిని జగన్, భారతి కాపాడుతున్నారని, అరెస్టు కాకుండా చక్రం తిప్పుతున్నారని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ఊరూ వాడా తిరిగి ప్రచారం చేశారు. వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ఈ కేసులో ప్రత్యక్షంగా పోరాడుతున్నారు. ఏపీ హైకోర్టులో కాకుండా తెలంగాణ హైకోర్టులో హత్య కేసుపై విచారించాలని సునీత పోరాడి విజయం సాధించారు. ఈ హత్యతో వైఎస్ కుటుంబం రెండుగా విడిపోయింది. తల్లి విజయమ్మ కూడా జగన్‌కు దూరమయ్యారు. ఎన్నికల సమయంలో విదేశాలకు వెళ్లిపోయారు. వివేకానంద రెడ్డి హత్యలో సంబంధం ఉందంటూ జగన్, భారతి వైపు షర్మిల, సునీతలు వేలెత్తి చూపడంలో సఫలీకృతులయ్యారు. అక్కా చెల్లెల్లు కలిసి జగన్ నైతికతకు మసకబారేలా ప్రచారం చేసి, ప్రజల ముందు దోషిగా నిలబడేలా చేశారని ఈ ఫలితాలు తేల్చి చెబుతున్నాయి.
నిండు సభలో భువనేశ్వరిపై ప్రేలాపనలు
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఎన్ చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి శీలంపై వైసీపీ సభ్యులు నిందలు వేయడం చూసి ఆంధ్ర ప్రజలు చూసి విస్తుపోయారు. చట్ట సభలో ఇలాంటి నిందలు వేయడం కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇది వైసీపీ నేతల పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచింది. ఈ విషయంలో కూడా జగన్ నిలువరించకుండా, పరోక్షంగా విమర్శించేవారిని ప్రోత్సహించారనేది ఓటర్లు గమనించి ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పారు. తన తల్లిని అవమానించిన వారికి తగిన శిక్ష తప్పదని, చంద్రబాబు వదిలేసినా, తాను వదిలే ప్రసక్తి లేదని లోకేశ్ శపథం చేశారు.
ఇవేమీ మద్యం బ్రాండ్లు?
దేశంలో ఊరూ పేరు లేని మద్యం బ్రాండ్లు ఏ రాష్ట్రంలో అమ్ముతున్నారు? అంటే అది ఆంధ్ర రాష్ట్రం మాత్రమే. ఆన్ లైన్ పేమెంట్లు లేకుండా నగదు ఇచ్చిన వారికే మద్యం బాటిళ్లు విక్రయించారు. నకిలీ మద్యం విక్రయించి జగన్ వేలాది కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నాడని, ఆఖరికి మద్యంప్రియుల జీవితాలతో ఆడుకుంటున్నాడని చంద్రబాబు పలు సభల్లో విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే పాత మద్యం బ్రాండ్లను తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రోల్ మోడల్, క్లాసిక్ బ్లూ, ఓల్డ్ టైమర్, హెచ్డి, బూమ్, రాయల్ గ్రీన్, గ్రీన్ ఛాలెంజ్, ఓల్డ్ షెప్, ఆంధ్రా ఛాయిస్ ప్యూర్ వంటి పేర్లతో నాసిరకం మద్యం విక్రయించారు. ఇది కూడా ఓటమికి ఒక కారణంగా చెప్పుకోవాలి.
కేసీఆర్ అడుగుజాడల్లో
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అడుగుజాడల్లో నడవడం కూడా ఆంధ్రులకు ఏమాత్రం రుచించలేదు. ఎర్రవల్లి ఫాం హౌస్ నుంచి కెసిఆర్ గడీల పాలన సాగించి, సచివాలయానికి రాలేదు. ఆయన మాదిరి జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి పాలన సాగించి.. ప్రజలకు దూరమయ్యారనే అపఖ్యాతి పొందారు. నేను ఉచితాలను ఇస్తున్నాను, గడప వద్దే సేవలు అందిస్తున్నప్పుడు, ప్రజలను కలవాల్సిన అవసరం ఏముందనే అహంభావంతో జగన్ వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. జగన్‌ను కలవాలంటే ముందుగా సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కలవాలి. ఆయన ఓకే అంటే తప్ప మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ దర్శనం లభించేది కాదనే అభిప్రాయాలు కూడా జనంలోకి బలంగా వెళ్లాయి.
‘కాపు’ కాసి కొట్టారు
సాధారణంగా ఆంధ్రలో కాపు కులం వాళ్లు కాంగ్రెస్ వైపు ఉంటారు. ఆ తరువాత జగన్ వైపు మొగ్గారు. చంద్రబాబు సిఎం గా ఉన్న సయంలో ఈబిసి కోటాలో కాపులకు ప్రత్యేక కోటా కల్పించినప్పటీ వారు సంతృప్తి చెందలేదు. కాపులను మోసం చేస్తున్నారని ఆ కుల నాయకులు రైల్ రోకో నిర్వహించి విధ్వంసం సృష్టించడం తెలిసింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చినప్పటికీ కాపు రిజర్వేషన్ల విషయంలో చర్యలు తీసుకోకుండా మోసం చేశారనే కాపు కులస్తులు గ్రహించారు. నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి, బిజెపితో జతకట్టడంతో కాపులు విభేధాలను పక్కనబెట్టి కూటమికి జైకొట్టారు. దీంతో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైసిపి పూర్తిగా తూడిచిపెట్టుకుపోయింది. కాపులు ఏకమై కూటమి అభ్యర్థులకు జైకొట్టి జగన్ కు షాకిచ్చారు.
8 ఉమ్మడి జిల్లాల్లో ఖాతాలు తెరవలేదు
కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో వైసిపి అభ్యర్థులు అసలు ఖాతానే తెరవలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఈ 8 జిల్లాల (16 కొత్త జిల్లాలు) నుంచి వైసిపి ఊహించని విధంగా ఎంపి, ఎమ్మెల్యే సీట్లను గెలుపొందింది. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా సాధించకుండా చతికిలపడింది. మాజీ సిఎం కెసిఆర్ అడుగుజాడల్లో నడిచిన జగన్ తన రాష్ట్రంలో 13 జిల్లాలను పునర్విభజన చేశారు. అయినప్పటికీ ప్రజలు ఆదరించకపోగా గుడ్ బై చెప్పారు.
పనిచేయని ఉచితాలు
తన ఐదేళ్ల పాలనలో సుమారు మూడు లక్షల కోట్లను ఉచితాల పేరుతో పంపిణీ చేశానని జగన్ ప్రతి సభలో ఊదరగొట్టారు. ఇందుకోసం ప్రభుత్వ ఆస్తులను కూడా తనఖాపెట్టి ఇబ్బడి ముబ్బడి గా అప్పులు చేశారు. సాధారణంగా అప్పులు అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం తీసుకుంటారు. కానీ.. జగన్ రెడ్డి సంక్షేమ పథకాల కోసం రుణాలు తీసుకుని రాజకీయాల్లో కొత్త బాట వేశారు. ఉచితాలను తీసుకున్న జనం ఈ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో మద్ధతు పలకలేదనేది తెలుస్తోంది. ఉచితాలపై ఆగ్రహంతో ఉన్న కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు, ఉద్యోగులు కూటమి అభ్యర్థులకు జై కొట్టి జగన్ పార్టీని ఇంటికి సాగనంపారు.
అందరికీ మంచి చేసినా ఏమైందో తెలియట్లేదు: జగన్
ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు మంచి చేసినా ఏమైందో తెలియట్లేదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే ఎన్నడూ చూడని విధంగా.. చేయని విధంగా మంచి చేశానని మళ్లీ అదే చెప్పారు. సంక్షేమ పథకాలన్నీ అమలు చేసి కోట్ల మంది లబ్ధి చేకూర్చినా తనకు ఓట్లు పడలేదని నిట్టూర్చారు.