Site icon vidhaatha

సీఎం జగన్‌పై పథకం ప్రకారం దాడి

కుట్రకు పాల్పడుతున్న చంద్రబాబు
క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోం
క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ ప్రవీణ్

విధాత,విజయవాడ: రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పథకం ప్రకారం దాడి చేస్తున్నారని ఏపీ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ డా. యలమంచిలి ప్రవీణ్ వ్యాఖ్యానించారు. విజయవాడ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం వద్దనున్న డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మంగళవారం పెద్ద సంఖ్యలో క్రిస్టియన్ల ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా డా. ప్రవీణ్ మాట్లాడుతూ క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేలా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తుండటం బాధాకరమన్నారు.

అయితే సీఎం జగన్‌పై కుట్రల వెనుక, క్రైస్తవులపై చేస్తున్న దుష్ర్పచారం వెనుక ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇటీవల ఒక పత్రికలో దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ప్రస్తుత సీఎం జగన్ నిత్యం సంభాషిస్తున్నట్లుగా ఆయన అధికారులతో చెప్పినట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, తాము ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే క్రైస్తవ సమాజానికి ఎక్కువ నిధులు కేటాయించారని చెబుతున్న దానిలో నిజం లేదని, ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో హిందూ ధార్మిక సంస్థలకు రూ. 120 కోట్లు, ముస్లిం మైనారిటీలకు రూ. 80 కోట్లు కేటాయించగా.. క్రైస్తవ సమాజానికి జనాభా ప్రాతిపదికన కేవలం రూ. 40 కోట్లు కేటాయించారని డా. ప్రవీణ్ వివరించారు. అయితే ఈ వాస్తవాలను పక్కన పెట్టి ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా పనిగట్టుకుని ప్రచారం చేయడం తగదని హితవు పలికారు.

ఇన్నాళ్లూ లేనిది, ఇటీవల మత రాజకీయాలు చేయడానికి చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నది బీజేపీతో ఉన్న అక్రమ సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికేనా అని ప్రశ్నించారు. చంద్రబాబు బీజేపీతో తన రాజకీయ బంధాల కోసం క్రైస్తవ సమాజంపై దుష్ప్రచారం చేస్తే ఉపేక్షించబోమన్నారు. రాజకీయ వైరాలను మతపరంగా మార్చాలనుకునే కుయుక్తులను ఇకనైనా కట్టి పెట్టాలన్నారు. సీఎం జగన్‌పై కక్ష సాధించే నెపంతో యావత్ క్రైస్తవ సమాజాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు, ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. తాము కూడా రాష్ట్ర పౌరులమేనని, రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం నచ్చిన మతాన్ని స్వీకరించి, ఆచరించే అవకాశం ఉందని డా. ప్రవీణ్ వివరించారు. అయినప్పటికీ చంద్రబాబు, ఆయన కోటరీ పదేపదే తమ సమాజంపై దాడి చేస్తున్నారని, గతంలో జరిగిన పలు ఘటనలనూ ముడిపెట్టి ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.

అయినప్పటికీ క్రైస్తవ సమాజం సంయమనం కోల్పోకుండా ఉంటోందని, చంద్రబాబు, తన కోటరీ వ్యాఖ్యలు చూస్తుంటే భవిష్యత్తుపై భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా జరుగుతున్న భౌతిక, మానసిక దాడులు క్రైస్తవ సమాజంలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని, ఇప్పటికైనా మత విశ్వాసాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను ఆపాలని కోరుతున్నామన్నారు. మత రాజకీయాలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా క్రిస్టియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ అంబేద్కర్ విగ్రహాల వద్ద మానవహారాలు నిర్వహించామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్యదర్శి మేదర సురేష్ కుమార్, పాస్టర్లు ఐజక్, మోషె, వెంకటేష్, ఎం. మధు, జేఏసీ కార్యవర్గ సభ్యులు దాస్, పి. వెంకట్, పి. ప్రభుదాస్, కె. లాజర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version