వందేళ్ల నాటి విప్లవం.. పతనం అంచున కొట్టుమిట్టాడుతున్నది!
పదేళ్ల క్రితం పురుడుపోసుకున్న చైతన్యం ఆకాశపు రెక్కలు విప్పుకొంటున్నది!
బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి.. నైజాం నవాబు వెన్నువిరిచిన వీరత్వం.. నూతన ప్రజాస్వామిక విప్లవంతో పెట్టుబడిదారీ సమాజాన్ని కూలదోసి సోషలిస్టు సమాజాన్ని స్థాపించాలని కలగలన్న నిరుపమాన త్యాగనిరతి ఇప్పుడు బేలగా చూస్తున్నది! అవినీతిపై మోగిన సమరభేరిలో దిక్కులు పిక్కటిల్లిన నినాదం.. ఇప్పడు ధీరత్వంతో విశ్వాస ప్రకటన చేస్తున్నది!
ఆ వందేళ్లనాటి విప్లవం.. భారత దేశ చరిత్రలో రెండో పురాతన పార్టీగా ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ!
ఆ పదేళ్ల చైతన్యం చినుకు చినుకు కలిసి తుదకు వరదైనట్టు ఉప్పొంగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ!
దేశ చరిత్రలో రెండు వేల వేల ఇరవైమూడో సంవత్సరం ఏప్రిల్ పదో తేదీ ఒక మైలురాయిగా నిలిచింది. ఆ రోజు కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటన.. యావత్ దేశంలోని ప్రగతిశీల శక్తులకు మిశ్రమ అనుభూతులు అందించింది. ఒకవైపు శిఖారాగ్రమానమై దేశానికి కొత్త శక్తులను, ప్రగతిశీల మేధావులను అందించిన భారతదేశపు నంబర్ టూ గ్రాండ్ ఓల్డ్ పార్టీ సీపీఐ తన జాతీయ హోదాను కోల్పోయింది. చాలా బాధాకరం. ఆ ప్రమాదంలో పడని కమ్యూనిస్టు శక్తులకు సైతం ఇది ఆందోళన కలిగించే అంశం. అదే సమయంలో పదేళ్ల క్రితం ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో అన్నా హజారే జాతిని జాగృతం చేసిన ఉద్యమం నుంచి ఎదిగిన.. ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. జాతీయ హోదాను సాధించింది. ఇదొక ఊరట. ఇదొక భరోసా. దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతిపై సమర శంఖం పూరించిన ఒక శక్తి.. జాతీయ స్థాయిని పొందిందన్న ఆనందం.
ఈ రెండు పరిణామాలు గొప్ప గుణపాఠాలు అందిస్తున్నాయి. పదేళ్ల పార్టీ పరిస్థితిని వందేళ్ల పార్టీతో పోల్చడం సరికాదు. ఆ సాహసం కూడా చేయలేం. ఆ సాహసం చేయడం అంటే.. సూర్యుడిపైకి ఉమ్మడమే! నిజమే.. సీపీఐ ఎదుర్కొన్న సవాళ్లు వేరు.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కొన్న సమస్యలు వేరు. సీపీఐ ఎదుర్కొన్న నిర్బంధాలు వేరు.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కొంటున్న నిర్బంధాలు వేరు. రెంటికీ పొంతన లేదు. కానీ.. ఒక సామీప్యం మాత్రం ఉన్నది. రెండూ ఎన్నికల బరిలో ఉన్నవే. రెండూ పార్లమెంటరీ పంథాను అనుసరిస్తున్నవే.
ఎస్‌ఏ డాంగే, అజయ్‌ఘోష్, యశ్‌పాల్, ఎంఎన్ రాయ్, సత్యభక్త.. ఎందరెందరో మహనీయులు. మహా నాయకులు. భారతదేశ ప్రగతిశీల శక్తులు ప్రేమించే.. ఆరాధించే.. నిత్యం స్ఫూర్తి పొందే క్రాంతి కిరణం.. భావి భారతం సోషలిస్టు రిపబ్లిక్ కావాలని, దేశం ఎర్రజెండా నీడన ఎదగాలని తమ ఊపిరిని ఉద్యమాలకు శ్వాసగా అందించి అమరుడైన భగత్‌సింగ్ సహచరులు, సమకాలికులు, ఒకే లక్ష్యం కోసం పనిచేసినవారే. భారత కమ్యూనిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించినవారే. వారి వారసత్వం ఏమైపోయిందనేదే ఆవేదన. కార్మికులు నలుగురు కష్టంలో ఉంటే వారి ధర్నాకు మద్దతు ప్రకటించేంత కిందిస్థాయి ఉద్యమ కార్యాచరణ ఎందుకు కనుమరుగైందనేదే ఆక్రోశం. చారిత్రక పునాదులు ఉన్నప్పటికీ ఆ మహా భవంతి ఎందుకు కునారిల్లుతున్నదనేదే బాధ.
ఒకప్పడు అవిభాజ్య భారతదేశంలో పెషావర్ నుంచి చిట్టగాంగ్ వరకూ లక్షల మంది మెరికల్లాంటి కార్యకర్తలతో శక్తిమంతమైన పార్టీగా వెలిగిన పార్టీ.. ఒకప్పడు దేశంలో వరుసగా మూడు పర్యాయాలు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సీపీఐ.. ఇప్పుడు 545 మంది సభ్యులున్న లోక్‌సభలో రెండు సీట్లకు పరిమితమై పోయిన దీనత్వం వెనుక ఏం జరిగింది? భారత కమ్యూనిస్టు పార్టీ 1925లో ఆవిర్భవిస్తే.. అదే సంవత్సరం పుట్టిన చైనా కమ్యూనిస్టు పార్టీ 1949లోనే ఎలా చైనాలో అధికారం సాధించగలిగింది? ఇక్కడ మాత్రం అంథకారంలో ఎందుకు కొట్టుమిట్టాడుతున్నది? సరే.. విప్లవ పార్టీలంటూ తీవ్రవాదంతో చీలికలు పేలికలై.. అడవుల్లో అనాథ శవాలైపోయిన అద్భుతమైన మేధో సంపదలెన్నో! ఆ పార్టీలను పక్కనపెడితే.. ఇప్పడు సీపీఐ. దాని తర్వాత? సందేహం లేదు. దారులకతీతంగా, పంథాలకతీతంగా కమ్యూనిస్టు శక్తులన్నీ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన విషయం. ఇది అంతర్గతంగానే జరగాల్సిన కసరత్తు.
సోవియట్ యూనియన్‌కు వెళ్లి ఆ దేశాధినేత స్టాలిన్‌తో భారతదేశ భవిష్యత్తుపై చర్చించిన మహానేతలైన పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య వంటి నేతల వారసత్వం కలిగి, తనదే నిజమైన కమ్యూనిస్టు సిద్ధాంత ఆచరణ అని చెప్పే సీపీఐ(ఎం)కు సీపీఐకి పట్టిన దుస్థితి పట్టదని గ్యారెంటీ ఏమన్నా ఉన్నదా? తిరుగులేదన్న త్రిపుర కూలిపోయింది. అడ్డేలేదనుకున్న బెంగాల్‌లో అడ్రస్ కష్టంగా ఉన్నది. ఈ పరిణామాలతో కేరళ కాస్త జాగ్రత్త పడుతున్నట్టుంది. సంప్రదాయాన్ని పక్కనపెట్టి వరుసగా రెండోసారి వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చింది.
నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్ట ఆచరణ ఎత్తుగడల విషయంలో చేయి తిరిగిన కమ్యూనిస్టు, మార్క్సిస్ట్ మేధో బలం ఈ దేశ కాలమాన పరిస్థితుల పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోలేక పోయిందా? ప్రజల కోసమే పనిచేసే కమ్యూనిస్టు పార్టీలు.. ప్రజల మన్ననలు ఎందుకు పొందలేక పోతున్నాయి? వీర తెలంగాణ విప్లవ పోరాట వారసత్వం ఎందుకు నిలువలేక పోయింది? తెలంగాణలో ఎక్కడ తిరిగినా ఎర్రటి స్తూపాలు ఎదురవుతూనే ఉంటాయి. దాని పక్కనే ఒక ఎర్రజెండా ఎగురుతూ కనిపిస్తుంది. ఆ అమరవీరుల వారసులు ఎక్కడున్నారు? ఒకప్పటి కరడుగట్టిన కమ్యూనిస్టు అభిమానులు ఇప్పడు నామమాత్రపు సానుభూతిపరులైపోయారు? ఈ పాపం.. సానుభూతిపరులుగా మారిపోయి తప్పుకొన్నవాదా? వారిని నిలుపుకోలేని నాయకత్వాలదా?
అంతా అయిపోయిన తర్వాత.. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ఘనమైన చరిత్ర, స్వాతంత్ర్యం అనంతర భారతదేశాన్ని రూపుదిద్దే క్రమంలో పోషించిన కీలక పాత్రను సీపీఐకి జాతీయ హోదా విషయంలో ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకొని ఉండాల్సిందని ఆ పార్టీ స్టేట్‌మెంట్ ఇచ్చింది. నిజమే. సీపీఐకి ఘనమైన చరిత్ర ఉన్నది. దానిని గౌరవించాల్సిన అవసరమూ ఉన్నది. కానీ.. ఇప్పడు ఉన్న పాలకుల స్వభావం కమ్యూనిస్టు నేతలకు తెలియనిది కాదు. ఇలా ఒక మతతత్వ పార్టీ ప్రభుత్వాన్ని దేబిరించడం దేనికి సంకేతం? ఇప్పుడు చేయాల్సింది విజ్ఞప్తులా? పార్టీకి ఎదురైన దుస్థితిపై విశ్లేషణలా?
కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న ఏఐటీయూసీని పార్టీ ఏర్పడక ముందే తన చేతిలోకి తెచ్చుకున్నది సీపీఐ. అజ్ఞాతవాసంలో ఉంటూనే.. 1923లో మొట్టమొదటి మేడే ర్యాలీ తీసింది సీపీఐ నాయకత్వమే. ఆలిండియా కిసాన్ సభ, అఖిల భారత విద్యార్థి సమాఖ్య, ప్రగతిశీల రచయితల సంఘం, భారత ప్రజారంగస్థల సంఘం (ఇప్టా).. ఇలా ప్రతి రంగానికి ప్రముఖ వ్యవస్థలను నిర్మించిన ఘనత సీపీఐదే. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఎన్నికల ద్వారా ఒక రాష్ట్రంలో.. కేరళలో అధికారంలోకి వచ్చిన చరిత్ర సీపీఐదే. ఒకప్పడు పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బలమైన పార్టీ సీపీఐ. కానీ ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు?
నానాటికీ సీపీఐ గ్రాఫ్ పడిపోతూనే వచ్చింది. కేంద్రంలోనే కాదు.. రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా. ప్రత్యేకించి కొత్త సహస్రాబ్దిలో. 1999లో సీపీఐ గెలిచిన లోక్‌సభ స్థానాలు నాలుగు. 2004లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ పొత్తుతో అవి పదికి పెరిగాయి. 2009లో మళ్లీ నాలుగే దక్కాయి. 2014లో ఒకే ఒక్క సీటు గెలిస్తే.. 2019కి అవి రెండు అయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీల్లో సీపీఐకి ఉన్న సభ్యులు 21.
అన్నీ ఓట్ల ఆధారంగానే లెక్కించే పరిస్థితిలో సీపీఐకి అన్ని ఓట్లు రాలేదు. కానీ.. కమ్యూనిస్టుల పట్ల జనంలో ఆదరణ ఉన్నది. వారిపై నమ్మకం ఉన్నది. ఈ దేశంలో వామపక్ష శక్తులకు కచ్చితంగా ప్రజా మద్దతు ఉంటుందనేందుకు మొన్నటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగిరిన ఎర్రజెండాలే సాక్ష్యం. నాశిక్ నుంచి ముంబై వరకు పాదాలు నెత్తురోడుతున్నా మహారాష్ట్ర రైతాంగం ఎర్రజెండా నాయకత్వంలో జరిపిన మహా పాదయాత్రే సాక్ష్యం.
కేంద్రంలో అధికారం చేపడుతున్న జాతీయ పార్టీలు ఏవైనా ఆశ్రిత పక్షపాతం నుంచి పక్కకు జరగడం లేదు. బీజేపీ అధికారంలో ఉన్న ఈ పదేళ్లు అది పతాకస్థాయికి వెళ్లిపోయింది. తన అవినీతిని పక్కనపెట్టి.. ప్రతిపక్షాలు, ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీల అవినీతిపై కేంద్రం గురిపెట్టింది. ఈ ప్రాంతీయ పార్టీలు ఏమైనా నిజాయితీగా ఉన్నాయా? అంటే అదీ లేదు. వీటి స్థాయిలో ఇవి అవినీతి సాధారణం చేసేస్తున్నాయి. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయానికి, ప్రత్యేకించి వామపక్ష రాజకీయాలకు ఇది మంచి తరుణం.
జనం కమ్యూనిస్టుల వైపు ఉన్నారు. మరి కమ్యూనిస్టులు జనం వైపు ఉన్నారా? కమ్యూనిస్టులు కోరుకునే విధంగా ప్రజలు లేరా? ప్రజలు కోరుకుంటున్నట్టు కమ్యూనిస్టులు లేరా? ప్రజాపోరాటాల్లోంచి నాయకులు పుడతారా? నాయకులుగా ఎదిగి ప్రజాపోరాటాలను నిర్మిస్తారా? సమస్య ప్రజల్లో ఉన్నదా? కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలో ఉన్నదా? సకల ప్రగతిశీల శక్తులు ఆవేదన చెందుతున్న సమయంలో విమర్శ చేస్తారా? ఆత్మవిమర్శ చేసుకుంటారా?
పార్టీ ప్రస్తుత పరిస్థితికి వేరెవరో కారణం కాదని, సీపీఐ చేసుకున్నదేనని ఆ పార్టీ కార్యకర్త ఒకరు చెప్పారు. ఎంతగానో పోరాడితే తప్ప పార్టీలో యువతకు నాయకత్వం బాధ్యతలు అప్పగించలేదని ఆయన అన్నారు. జాతీయ సమితి మొదలుకుని వివిధ పార్టీ ఫోరంలలో వయో పరిమితిని నిర్ణయించడానికి అంగీకరించారని తెలిపారు. నిర్ణయాలైతే తీసుకున్నారుగానీ.. తగిన విధంగా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్లమెంటరీ పంథాను, ఉద్యమాలను ఏకకాలంలో కొనసాగించాల్సి ఉన్నా.. ఎన్నికల్లో పోటీచేసేందుకు ఉన్న ఆసక్తి.. ఉద్యమాలను కొనసాగించడంపై కమ్యూనిస్టు పార్టీల్లో లేదనే అభిప్రాయం సర్వత్రా ఉన్నది. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని నాలుగు సీట్లు గెలుచుకోవడం అనే ఆలోచనే తప్ప.. పార్టీకి పూర్వ వైభవాన్ని సాధించాలనే తపన ఏ కమ్యూనిస్టు పార్టీలోనూ కనిపించడం లేదు. సీపీఐ కూడా ఇందుకు మినహాయింపు కాదని పరిశీలకులు అంటున్నారు.
ఇప్పటికైనా సీపీఐ, ఇతర కమ్యూనిస్టు పార్టీలు ఆత్మ విమర్శ చేసుకోవాలి. లోపం ఎక్కడ ఉన్నదో సమిష్టిగా ఆలోచించాలి. యువత నాయకత్వ స్థానాల్లోకి రావాలి. పాతతరం తమ అనుభవాలు పంచుకుంటూ యువతను నేతల్లా తయారు చేయాలి. సమాజం మారుతున్నది. ఇది చాట్‌జీపీటీల యుగం. ప్రపంచాన్ని ఏలేందుకు కృత్రిమ మేధస్సు సమాయత్తమవుతున్న సందర్భం. ఇప్పడు తీసుకునే నిర్ణయాలు ఈ వేగానికి అనుగుణంగా ఉండాలి.
విషాదం ఏమిటంటే.. సీపీఐ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇప్పుడున్న పోస్టింగ్.. జనవరి 25నాటిది. అంటే అప్పటి నుంచి ఏ అంశంపైనా సీపీఐ ట్విట్టర్‌లో ఒక్కటంటే ఒక్క పోస్టు పెట్టలేదు. ట్విట్టర్‌లో పెడితేనే అభిప్రాయం వెల్లడించినట్టా? అనొచ్చు. నిజమే. కానీ.. ఇప్పడు ఏం జరిగినా సమాచారం క్షణాల్లో చేతిలోని మొబైల్ ఫోన్ల ద్వారా తెలిసిపోతున్నది. అంతటి వేగంతో సమాజం ఉన్నప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఇటీవల తెలంగాణలో జరిగిన ఉభయ కమ్యూనిస్టు పార్టీల సమావేశం ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నది. దేశంలో ఇప్పటికిప్పుడు విప్లవం ఏమీ రాదు. ఆ విప్లవాన్ని సాధించేందుకు మార్గం విషయంలో ఇప్పుడే కమ్యూనిస్టులు సైద్ధాంతిక చర్చల్లో మునిగిపోవాల్సిన అవసరమూ లేదు. అది ఏ రూపంలో అయినా సరే.. విలీనం రూపంలో అయినా సరే.. ఇప్పడు కావాల్సింది కమ్యూనిస్టుల విశాల ఐక్యత. తక్షణ అవసరం ఈ దేశంలో నానాటికి వేళ్లూనుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్ మతోన్మాద భావజాలాన్ని, జాతీయత ముసుగులో బీజేపీ సాగిస్తున్న అరాచక పాలనకు అంతం పలకడం. నిజానికి ఇప్పడు కావాల్సింది.. భావజాల పోరాటం. ఏది ఏమైనా.. దేశ రాజకీయాల్లో ఒక మాట వినాలని ఉన్నది.. ఆ మాట.. ‘అబ్ కీ బారీ.. వామ్‌వాదీ’! – తాజ్