- మామిడి రైతులకు ఈ ప్రభుత్వం అండగా ఉంది.
- ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ రేటు ఇస్తున్నాం.
- మామిడి రైతులను ఆదుకోవాలని సీఎం ఆదేశించారు.
- జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మార్కెట్లో మామిడి ధరలను పర్యవేక్షిస్తున్నారు.
- మామిడి ధరలపై చంద్రబాబు నీచ రాజకీయం.
- చంద్రబాబు సన్నిహితుల పల్ప్ ఫ్యాక్టరీలు సిండికేట్ అయ్యాయి.
- వారి వల్ల ఇబ్బంది పడుతున్న రైతుల గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?
- మా యాజమాన్యంలో ఉన్న ఫ్యాక్టరీ సామర్థ్యం చాల తక్కువ.
- 70శాతం మామిడి మా బంధువుల సొంత తోటల నుంచే వస్తుంది.
- బయటి నుంచి కేవలం 20-30 శాతమే కొనుగోలు చేస్తాం.
- దానిని చూపి చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు.
- చంద్రబాబు తానా అంటే… సిపిఐ నారాయణ తందానా అంటున్నాడు.
- ఏదోలా ఈ ప్రభుత్వంపై బురద చల్లాలనేది వారి లక్ష్యం.
- రాయలసీమకు నీరు ఇవ్వాలని గతంలో కేసీఆర్ సూచించారు
- అందుకు పూర్తి సహకారం ఇస్తానని అన్నారు
- నిబంధనల ప్రకారమే నీటిని వాడుకుంటాం
- తెలంగాణాకు నష్టం చేకూర్చాలనే ఆలోచనే లేదు
- వైయస్ఆర్ వల్లే తెలంగాణాకు ప్రాజెక్ట్లు వచ్చాయని కేసీఆర్ అన్నారు.
విధాత:ఇతర రాష్ట్రాల్లో మామిడికి ఇస్తున్న దానికంటే ఎక్కువ ధర చిత్తూరు జిల్లాలో రైతులకు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, భూగర్భగనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మామిడికి మార్కెట్లో రేటు తగ్గుతోందని తెలియగానే సీఎం వైయస్ జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని అన్నారు. జిల్లా యంత్రాంగంను రంగంలోకి దింపి మామిడి ధరలను స్థిరీకరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…
- చిత్తూరు జిల్లాలో పల్ప్ కోసం వినియోగించే తోతాపురి రకం మామిడి రేట్లపై ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా ఇక్కడి పరిస్థితులు చంద్రబాబుకు పూర్తిగా తెలుసు. అయినా కూడా వాస్తవాలను వక్రీకరిస్తూ, రైతుపక్షపాతిగా పనిచేస్తున్న సీఎం వైయస్ జగన్ గారి ప్రభుత్వంపై ఏదో ఒకరకంగా బుదర చల్లాలనే ఉద్దేశంతోనే తప్పడు ఆరోపణలు చేస్తున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు రైతుల గురించి ఆలోచించలేదు. అసలు వ్యవసాయమే దండుగ అని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు హటాత్తుగా చిత్తూరుజిల్లాలోని మామిడి రైతుల గురించి ఆయన మాట్లాడటం రాజకీయ ప్రయోజనాల కోసమే. ఆయన హయాంలో ఇదే తోతాపురి మామిడి కేజి నాలుగు రూపాయల కన్నా తక్కువకే అమ్మారు. అయినా కూడా చంద్రబాబు మామిడి రైతులను పట్టించుకోలేదు.
- చిత్తూరు జిల్లాలో ఎక్కువగా తోతాపురి పంట ఉంది, పల్ప్ ఫ్యాక్టరీలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. పల్ప్ కోసం వాడే తోతాపురి మామిడి కేజీ 16 నుంచి 17 రూపాయల వరకు ఫ్యాక్టరీలు కొనుగోలు చేసేవి. ఈ ఏడాది ప్రారంభంలోనే రూ.9 నుంచి ప్రారంభించిన కొనుగోళ్ళు తరువాత రూ.6 కి తగ్గాయి. మామిడి రాలిపోతున్నా కూడా రైతులు కోయలేకపోతున్నారు. కర్ణాటకకు చెందిన శ్రీనివాసపురం, తమిళనాడుకు చెందిన కృష్ణగిరి మార్కెట్లోకి తక్కువగా మామిడి వస్తే, చిత్తూరు జిల్లాకు వచ్చి మన వద్ద నుంచి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం అక్కడ చిత్తూరు జిల్లా కన్నా తక్కువ రేట్లు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ తో కలిపి ఏడు రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది వర్షాలు పడటం వల్ల కాయలు బరువు పెరిగి, చెట్లకు ఇబ్బంది అని రైతులు ఒకేసారి కోతలు ప్రారంభించారు. అవసరానికి మంచి ఒకేసారి మామిడి మార్కెట్ కు రావడం వల్ల కూడా కొంత మేర రేటు తగ్గింది. రూ. 12తో ప్రారంభమై రూ.9 వద్ద నిలకడగా ఉంది. దీనిపై నాలుగైదు సార్లు జిల్లా కలెక్టర్ పల్ప్ ఉత్పత్తిదారులు, రైతులతో సమావేశాలు నిర్వహించారు. కేజీ 11 రూపాయలకు కొనుగోలు చేయాలని ఒప్పించారు. జిల్లా మంత్రిగా నేను కూడా అదే రేటుపై కొనుగోలు చేయాలని కోరారు.
- 150 టన్నుల కెపాసిటీ వున్న ఫ్యాక్టరీకి అయిదు వందల టన్నుల మామిడి వస్తోంది. లోడ్ చేసేందుకు కనీసం నాలుగు రోజులు పడుతోంది. చిత్తూరు నుంచి పంట రాకముందే ముందుగా కృష్ణాజిల్లా నుంచి పంట వచ్చేది. ఇక్కడ కొనుగోళ్ళు పూర్తయిన తరువాత చిత్తూరు ప్రాంతంలో పంట వచ్చేది. కృష్ణాజిల్లాలో రూ.తొమ్మిదితో ప్రారంభమై కేజీ రూ.నాలుగు రూపాయలకు పడిపోయింది. చిత్తూరులో కూడా అలాగే రేటు తొమ్మిది రూపాయల వద్ద ఉంది.
- చిత్తూరు జిల్లాలో తొంబై శాతం పల్ప్ ఫ్యాక్టరీలు చంద్రబాబు బంధువులు, వారి పార్టీ మద్దతుదారులకు చెందినవే. చంద్రబాబు ప్రోత్సాహంతోనే అవి పనిచేస్తున్నాయి. గతంలో మేం ఈ ఫ్యాక్టరీలు సిండికేట్ అయి రైతులను ఇబ్బంది పెడుతున్నాయని అనేక సార్లు చెప్పాం. కనీసం మా ప్రాంతంలోని రైతులకు అయినా అండగా నిలవాలని సొంత ఫ్యాక్టరీని ప్రారంభించాం. ఇది మా వ్యాపారం కాదు. సింగిల్ లైన్లో మూడు నుంచి నాలుగు వేల టన్నులు మాత్రమే ఈ ఫ్యాక్టరీ ద్వారా సీజన్లో మేం పల్ప్ ఉత్పత్తి చేయగలుగుతాం. మాకు, మా కుటుంబసభ్యులకు ఉన్న సొంత తోటల నుంచి వచ్చే మామిడి ఫ్యాక్టరీకి 70 శాతం వరకు సరిపోతుంది. బయట నుంచి మరో 20 నుంచి 30 శాతం కొనుగోలు చేస్తాం.
- ఇంత తక్కువ కెపాజిటీ ఉన్న ఫ్యాక్టరీ ద్వారా మేం మామిడి రేటును నియంత్రిస్తున్నామని చంద్రబాబు చెప్పడం దారుణం. చంద్రబాబు సన్నిహితులకు చెందిన శ్రీని ఫుడ్స్ పల్ప్ ఫ్యాక్టరీకి కేంద్రం నుంచి ఆనాడు రూ.50 కోట్లు సబ్సిడీ ఇప్పించాడు. అలాగే లియాన్ ఫుడ్స్, జిల్లాలోనే పెద్ద ఫ్యాక్టరీ గా వున్న గల్లా ఫుడ్స్, వర్షాఫుడ్స్, జైన్ ఇరిగేషన్స్ ఫ్యాక్టరీలు కూడా చంద్రబాబు సన్నిహితులవే. ఆ ఫ్యాక్టరీల గురించి, రైతులు పడుతున్న ఇబ్బంది గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు? ఈ జిల్లాకు చెందిన మంత్రిగా నేను మామిడి పల్ప్ ఫ్యాక్టరీలను సిండికేట్ చేసి, ధరలు పడిపోయేలా చేశానని చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నాడు. వైయస్ జగన్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంది, దానిలో నేను మంత్రిగా ఉన్నానని కావాలనే ఇటువంటి రాజకీయం చేస్తున్నాడు.
- చంద్రబాబు సీఎంగా ఉన్పప్పుడే చిత్తూరు జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో నేషనల్ మ్యాంగో బోర్డ్ ఏర్పాటు చేయాలని పలుసార్లు కోరారు. దానిని చంద్రబాబు పట్టించుకోలేదు. ఈ రోజు హటాత్తుగా ఆయనకు మ్యాంగో బోర్డ్ ఏర్పాటు చేయాలని గుర్తుకు వచ్చింది. రైతుల గురించి ఎంతో ఆలోచించే మా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇప్పటికే మ్యాంగో బోర్డ్ ఏర్పాటుపై ప్రతిపాదనలు తయారు చేయించి, కేంద్రానికి కూడా పంపారు. అలాగే మామిడి ధరలు పడిపోతున్నాయనే సమాచారం రాగానే మార్కెటింగ్ కమిషనర్, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిని కూడా అప్రమత్తం చేశారు. జిల్లా యంత్రాంగంను రంగంలోకి దింపి రేటు తగ్గిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు.
- ఇవ్వన్నీ తెలిసి కూడా ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వంపై బురదచల్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. చిత్తూరు జిల్లాలో రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక ఇటువంటి సిగ్గుమాలిన రాజకీయంకు దిగజారిపోయాడు. చిత్తూరు జిల్లాలో ఎవరు రైతుల కోసం నిలబడతారో ఏ రైతును అడిగినా చెబుతారు. ఇక చంద్రబాబు తానా అంటే ఇదే జిల్లాకు చెందిన సిపిఐ నారాయణ తందానా అంటున్నాడు. ప్రస్తుత పరిస్థితి గురించి తెలియకుండానే నారాయణ మాట్లాడుతున్నాడు. కూడబలుక్కుని అసత్య ప్రచారంకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైయస్ జగన్ పాలనలో ఏ ఒక్క రైతుకు నష్టం జరగదు. రైతులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది.
- రాయలసీమకు తాగు, సాగునీటిని అందించేందుకు ఎపి ప్రభుత్వం ఎటువంటి అక్రమ ప్రాజెక్ట్లు నిర్మించడం లేదు. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మన సీఎం వైయస్ జగన్ గారితో మంత్రులు, అధికారుల సమక్షంలోనే ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ రాయలసీమ కరువు ప్రాంతం, ఈ ప్రాంతవాసులకు మీరు తాగు, సాగునీటిని అందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అందుకు తాను కూడా పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు.
- నిబంధనల ప్రకారం ఎపికి ఎన్ని టిఎంసిలు కేటాయించారో వాటిని మాత్రమే మేం తీసుకుంటాం. ఇందులో తెలంగాణాకు ఎటువంటి నష్టం జరగదు. అక్రమంగా శ్రీశైలం డ్యాం నుంచి పంపింగ్ ఎప్పుడూ చేయం. పోతిరెడ్డిపాడుకు ఎగువన అధికంగా వచ్చే నీటిని మాత్రమే తీసుకోగలం.
- స్వర్గీయ వైయస్ఆర్ గురించి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్వయంగా కేసిఆర్ ఏం మాట్లాడారో అందరూ గమనించారు. వైయస్ఆర్ తెలంగాణాకు సహాయం చేశారని, ఆయన వల్లే తెలంగాణాకు ఇన్ని ప్రాజెక్ట్లు వచ్చాయని ప్రశంసించారు. తెలంగాణ ప్రాంతం కూడా చాలా వెనుకబడి ఉంది, అక్కడ ప్రజలకు మేలు చేయాలని కేసిఆర్ అంటున్నారు. అందుకు మేం కూడా సహకరిస్తాం. తెలంగాణాకు నష్టం చేకూర్చే పనులు ఎపి ప్రభుత్వం ఎప్పుడూ చేయదు, ఇందుకు సీఎం వైయస్ జగన్ కూడా అంగీకరించరు. ప్రస్తుతం జరుగుతున్న ఈ వ్యవహారంను పెద్ద ఇష్యూగా చూడాల్సిన అవసరం లేదు.
ReadMore:వైయస్ రాజశేఖరరెడ్డి ఒక నరరూప రాక్షసుడు.. జగన్ ఊసరవెల్లి: టీఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్