Site icon vidhaatha

ఫైజాబాద్‌లో బీజేపీని కాపాడలేక పోయిన రాముడి గుడి.. మత అజెండాను తిరస్కరించిన రాముడి నేల

లక్నో: అయోధ్యలో రామ మందిరం.. ఇదే అంశంపై అనేక ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తూ వచ్చింది. పలు దఫాల్లో కేంద్రంలో సైతం అధికారంలోకి వచ్చింది. ఈసారి ఏకంగా అయోధ్యలో రామాలయాన్ని నిర్మించి, ప్రధాని మోదీ స్వయంగా పూజారిలా మరీ జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీన్నే ఎన్నికల ప్రచారంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. అంతేకాదు.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. అయోధ్య గుడికి తాళం పడుతుందని కూడా హెచ్చరించారు. కానీ.. అయోధ్యపురి ఉన్న ఫైజాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు మాత్రం ఆ మాటలను విశ్వసించలేదు. వారే కాదు.. ఫైజాబాద్‌ చుట్టుపక్కల నియోజకవర్గాల్లోనూ రాముడి గుడి ప్రభావం కనిపించలేదు. ఫైజాబాద్‌లో బీజేపీ అభ్యర్థి లల్లు సింగ్‌ పరాజయం బాటలో ఉన్నారు. ఇక్కడ సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి అవధేష్‌ ప్రసాద్‌ 15వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దేశంలో బీజేపీ గాలి వీస్తున్నదంటూ ఎగ్జిట్‌పోల్స్‌ చేసిన హడావుడి వాస్తవ ఫలితాల్లో ప్రతిఫలించలేదు. మొత్తంగానే యూపీలో బీజేపీ ఘోరమైన ఎదురుదెబ్బలు తిన్నది. ప్రతిపక్ష ఇండియా కూటమికంటే తక్కువ సీట్లకు పడిపోతున్నది. వాస్తవానికి ఫైజాబాద్‌ బీజేపీకి నమ్మకమైన స్థానంగా అందరూ భావించారు. కానీ.. ఆ అంచనాలు పటాపంచలయ్యాయి.

Exit mobile version