బీజేపీ ముందస్తు ప్రణాళిక సక్సెస్
కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదం
బీజేపీ ఉచ్చులో చిక్కిన బీఆరెస్
పార్లమెంట్ ఫలితాల పై సర్వత్రా చర్చ
విధాత ప్రత్యేక ప్రతినిధి:
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో తెలంగాణలో ఎవరి వ్యూహం సఫలమైందీ? ఎవరి వ్యూహం విఫలమైందనే ఆసక్తికర చర్చ సాగుతోంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితిని తమకు అనుగుణంగా వినియోగించుకుని నాలుగు స్థానాల నుంచి ఎనిమిది స్థానాల్లో విజయం సాధించడంలో బీజేపీ సఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోందీ. అన్ని రకాలుగా అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో అధికారం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదం చేసిందనే విమర్శలున్నాయి. మూడు స్థానాల నుంచి ఎనిమిది స్థానాలకు పెరిగినా ఇంకా ఆశించిన స్థాయి ఫలితాలు రాబట్టడంలో విఫలం కావడమేకాకుండా బీజేపీ వేసిన ఉచ్చులో పడ్డారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణంగా అదనంగా ఆ పార్టీకి లభించాల్సిన స్థానాలను అప్పనంగా బీజేపీకి కట్టబెట్టిందనే విమర్శలున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి ఓటమి స్థితిలో ఉన్న బీఆరెస్ తమ లక్ష్యం నిర్ధేశించుకోవడంలో కాంగ్రెస్ పై కోపంతో ఏక పక్షంగా వ్యవహరించడం వల్ల తన ప్రత్యర్ధి కాంగ్రెస్ ను నష్టపరచడం మేరకు విజయవంతమైనా తాను సక్సెస్ కాలేని పరిస్థితి ఏర్పడింది. తొమ్మిది స్థానాల నుంచి జీరోకు చేరి సొంత పార్టీని పుట్టిముంచుకున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాను మునిగిపోతూ బీజేపీని పైకి లేపడంలో బీఆరెస్ తెలిసోతెలియక సహకరించిందంటున్నారు. పర్యవసానంగా తాను నష్టపోయి, కాంగ్రెస్ ను నష్టపరిచి బీజేపీకి లాభం చేసిందంటున్నారు. ఈ కారణంగానే బీజేపీ రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా 8 ఎంపీ స్థానాల్లో విజయం సాధించిందంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి మేల్కొన్న బీజేపీ
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలొస్తాయని, హంగు వస్తుందని ప్రకటించి బీజేపీ నేత సంతోష్ సంచలనానికి తెరతీసిన విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎంపీలను ఎన్నికల బరిలోకి దింపి శాసనసభ ఎన్నికల్లో ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా తో సహా కేంద్ర నాయకత్వాన్ని దింపి రాష్ట్రంలో పతాకస్థాయికి ప్రచారాన్ని తీసుకెళ్ళారు. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పరిస్థితిని తమ వైపు తిప్పుకునేందుకు సర్వశక్తులొడ్డారు. బీజేపీ అంచనాలు తారుమారై 40 స్థానాలు కాదుగదా 8 స్థానాలకు పరిమితమైంది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలుగా తమ స్థానాల్లో గెలుపొందలేక ఓటమిపాలయ్యారు. కానీ, ఇదంతా చర్చకు రాకుండా బీజేపీ అత్యంత జాగ్రత్తవహించింది. లోక్ సభ ఎన్నికలపై ముందుస్తు అంచనా ఉన్న ఆ పార్టీ వెంటనే లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధమైందీ. పదేండ్లు తాము కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రానికి ఏం చేయలేదనే అంశాన్ని, కేంద్రంలో తామేమి చేశామో చెప్పకోకుండా ఆరునెలల ముందు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆరు గ్యారంటీల పేరుతో తీవ్ర విమర్శలు చేయడంలో సక్సెస్ అయ్యారు. ఈ మేరకు కేంద్రంలో తామేమి చేశమనే ప్రశ్న ఉత్పన్నం కాకుండా వ్యూహాత్మక దాడిని పెంచడమే కాకుండా లిక్కర్ కేసులో నిందితురాలిగా ఉన్న కవితను అరెస్టు చేయడం అదే రోజు ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించడంతో ఫలితాన్నిచ్చింది. చర్చను ఇతర విషయాలపైకి మళ్ళించారు. ప్రధాని హోదాలో అభివృద్ధి పనుల ప్రారంభం పేరుతో ముందస్తు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అదే ఊపును కొనసాగిస్తూ సిట్టింగ్ ఎంపీలంతా అనధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టడం కలిసొచ్చింది. కాంగ్రెస్, బీఆరెస్ కంటే బీజేపీ అభ్యర్ధులు దాదాపు రెండు నెలలు ప్రచారంలో ముందున్నారు. ఇదే సమయంలో రాముడుతో పాటు రాజకీయ చర్చను లేవనెత్తారు. కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. దీనికి బీజేపీ అనుకూల మీడియా సహకారం కూడా లభించింది.
కాంగ్రెస్ పై కక్షతో పట్టుతప్పిన బీఆరెస్
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన ప్రతీకారంతో బీఆరెస్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది. ఆరు గ్యారంటీల అమలు, కరువు, కరెంట్ అంటూ ఎక్కడలేని దాడిని బీఆరెస్ నేతలు తీవ్రం చేశారు. ఆరునెలల ముందు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను టార్గెట్ చేసి పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీని విమర్శించడంలో విఫలమయ్యారు. తెలిసి చేశారా? లేక బీజేపీతో బీఆరెస్ కు లోపాయికారి ఒప్పందం ఉన్నందనే ఆరోపణలే నిజమేమోగానీ బీఆరెస్ కాంగ్రెస్ పై ఏకపక్ష విమర్శలు చేసింది. అధికారంలో ఉన్నపుడు బీజేపీని రకరకాలుగా విమర్శించిన బీఆరెస్ తీరు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మారిపోయింది. దీంతో బీజేపీ లక్ష్యం సక్సెస్ అయ్యిందీ. ఈ విమర్శల్లో బీజేపీ తమ స్థానాలను పదిలపరుచుకుంటూ బీఆరెస్ సిట్టింగ్ ఎంపీలను తమ అభ్యర్ధులుగా మార్చుకుని ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగింది. బీఆరెస్ కు కాంగ్రెస్ నుంచి వచ్చిన ఒత్తిడులను తట్టుకునేందుకు ఆ పార్టీ పై విమర్శలెక్కుపెడుతూ ఎన్నికల ప్రచారమంతా పూర్తి చేశారు. దీంతో తమ పట్టు కోల్పోయి దేశ రాజకీయాల్లో బీఆరెస్ అవసరంలేదనే స్థాయి చర్చలో ఆ పార్టీ ఊసే కనుమరుగైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది బీఆరెస్, బీజేపీ ముందస్తు ప్రణాళికలో భాగంగా జరిగిందా? లేక బీఆరెస్ స్వయంకృతాపరాధమా? అనే అనుమానాలున్నాయి. ఫలితాలను పరిశీలిస్తే బీఆరెస్ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో బీజేపీ బీఆరెస్ ను పావుగా వాడుకుందనే అభిప్రాయాలున్నాయి. లిక్కరు కేసులో అరెస్టు అయ్యి తీహార్ జైలులో ఉన్న కవిత కేసులో బీజేపీ సహకారం అవసరమైనందున పరోక్షంగా కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకున్నారనే అభిప్రాయాలున్నాయి. లేకుంటే మెదక్ లాంటి చోట కూడా ఓటమిపాలుకావడమేమిటనే ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పై బీఆరెస్ పెంచిన కోపం కాస్తా ఆ పార్టీకి ఉపయోగపడకుండా బీజేపీకి అనుకూలించింది.
కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదం
అధికారంలోకి వచ్చామనే ఆనందంలో కాంగ్రెస్ రాష్ట్రంలో వ్యూహాత్మక తప్పిదం చేసిందంటున్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ, బీఆరెస్ లను టార్గెట్ చేయడంలో జాప్యం చేశారు. తాము అధికారంలోకి వచ్చామనే భ్రమలో ఆరు గ్యారంటీల హామీల ఉచ్చులో చిక్కుకుని వాటి చుట్టూ పరిభ్రమించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదేండ్లు అధికారంలో ఉండి అమలు చేయని అంశాలను ఏజెండా పైకి తేవడంలో ఆలస్యం చేసి ఆరు గ్యారంటీలను అమలు చేస్తామంటూ తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు శీలపరీక్షకు సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచార సమయమంతా వీటి చుట్టూ తిరిగింది. ప్రభుత్వంలో తామున్నామనే అంశం ఆ పార్టీకి ఆటంకంగా మారింది. ఈ లోపే బీజేపీ, బీఆరెస్ ముప్పేట కాంగ్రెస్ ను ప్రజల్లో పలచన చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ విజయమంతా తమ వల్లేననే పొరలు కమ్మాయి. కాంగ్రెస్ గెలుపునకు పరోక్షంగా శ్రమించిన ప్రజాస్వామిక శక్తులను బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడంలో వాడుకోలేక పోయింది. చివరికి తమ మిత్రపక్షాలుగా ఉన్న టీజేఎస్, సీపీఐ, సీపీఎంలను, కాంగ్రెస్ పార్టీలోని నాయకులు, కేడర్ ను వినియోగించుకోవడంలో వెనుకబడింది. బీజేపీని టార్గెట్ చేసే సమయం జాప్యమైంది. అప్పటికే బీఆరెస్ బలహీనతలను ఆసరా చేసుకుని బీజేపీ పుంజుకున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీని తొలి టార్గెట్ చేసి బీఆరెస్ ను వ్యూహాత్మకంగా నిలువరించడంలో కాంగ్రెస్ ఫెయిలైందనే అభిప్రాయం ఉంది. అభ్యర్ధుల ఎంపిక జాప్యం, ప్రచార జాప్యం, అధికారంలోకి వచ్చామనే అలసత్యం వెరసీ కాంగ్రెస్ కు ఆశించిన స్థాయి ఫలితాలు రానివ్వలేదు. కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో గెలిచి గతం కంటే మెరుగైన ఫలితాలొచ్చాయని సంబరపడవచ్చేమోగానీ బీజేపీ గెలుపునకు పరోక్షంగా కాంగ్రెస్, బీఆరెస్ వైఫల్యం సహకరించింది. విభజన హామీలు సైతం అమలు చేయకుండా పదేండ్లు అధికారంలో ఉండి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై తిరిగి లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించడంలో మంచి ఫలితాలు సాధించడంలో బీజేపీ వ్యూహమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
!!!!!