Site icon vidhaatha

Brett Lee | జస్ప్రీత్‌ బుమ్రా ఓ అద్భుతమైన బౌలర్‌.. ప్రశంసలు కురిపించిన ఆస్ట్రేలియా దిగ్గజం బ్రెట్‌ లీ

Brett Lee | టీ20 ప్రపంచకప్‌ను నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రాపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రెట్‌లీ ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రస్తుత తరం ఫాస్ట్ బౌలర్లలో బుమ్రా అత్యుత్తమ బౌలర్‌ అంటూ కితాబిచ్చాడు. అతనో అద్భుతమైన బౌలర్ అని, అన్ని ఫార్మాట్లలోనూ మెరుగైన బౌలర్ అంటూ అభినందించారు. బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించి ప్రత్యర్థి జట్లపై దాడి చేస్తాడని, కొత్త బంతితో అద్భుతమైన వేగాన్ని రాబట్టగలడని చెప్పాడు. టీ20 వరల్డ్ కప్‌లో ప్రదర్శన అతనిలోని నాయకత్వ సామర్థ్యాలను బయటపెట్టిందని.. అతనో అసాధారణమైన బౌలర్ అని నిస్సందేహంగా చెప్పవచ్చని.. భారత్ సాధిస్తున్న విజయాల్లో ప్రశంసలు అందుకునే అర్హత ఉందని వ్యాఖ్యానించాడు.

అయితే, వెస్టిండిస్‌ – అమెరికా వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌ వేసిన విషయం తెలిసిందే. మెగా టోర్నీలో కుదురుగా బౌలింగ్‌ చేసి 15 వికెట్లు కూల్చాడు. టోర్నీలోని అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్‌ ది టోర్నీ అవార్డు సైతం దక్కిన విషయం తెలిసిందే. ఇంకా బ్రెట్‌లీ స్పందిస్తూ టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన భారతజట్టు అద్భుతంగా ఉందని పేర్కొన్నాడు. బ్యాటింగ్‌లో మొదటి నుంచి చివరి స్థానం వరకు తమదైన ఆధిపత్యాన్ని చాటగలిగే ఆటగాళ్లు ఉన్నారని.. బ్యాటింగ్‌ ఆర్డర్‌ను చూస్తే స్పష్టమవుతోందని పేర్కొన్నాడు. మిడిల్ ఆర్డర్ చాలా బలంగా ఉందని, వేగంగా పరుగులు రాబట్టగలిగే హార్డ్‌ హిట్టర్స్‌ ఉన్నారని.. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా అసాధారణ ఆటగాడని చెప్పాడు.

Exit mobile version