Site icon vidhaatha

Rohit sharma | రోహిత్‌ శర్మ మరో అరుదైన ఘనత..! తొలి ఆటగాడిన రికార్డు..!

Rohit sharma | టీ20 వరల్డ్‌ కప్‌లో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో ఘనతను సాధించనున్నాడు. ఈ టోర్నీలో బరిలోకి దిగితే అన్ని ఎడిషన్స్‌లో టీ20 ప్రపంచకప్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రోహిత్‌ రికార్డు నెలకొల్పనున్నాడు. ఐసీసీ దక్షిణాఫ్రికా వేదికగా 2007లో టీ20 వరల్డ్‌ కప్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ మెగా ఈవెంట్‌తో టీ20 క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్‌.. 2007లో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ జట్టులో సభ్యుడు. మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలో టీమిండియా తొలిసారిగా టీ20 వరల్డ్‌ కప్‌ను గెలిపించింది. ఆ తర్వాత జరిగిన 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022 టీ20 ప్రపంచకప్‌లలోనూ హిట్‌మ్యాన్‌ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు.

ఇక రోహిత్‌ శర్మ అనంతరం బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మాత్రమే ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. కేవలం ఈ ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఇప్పటి వరకు ప్రతీ టీ20 ప్రపంచకప్‌లో ఆడుతూ వచ్చారు. విశేషం ఏంటంటే.. ఇద్దరూ అరంగేట్ర 2007 టీ20 ప్రపంచకప్‌తోనే తమ కెరీర్‌ను ప్రారంభించారు. విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ ఎనిమిది టీ20 వరల్డ్‌ కప్స్‌లో 34.39 సగటు.. 127.88 స్ట్రయిక్‌ రేట్‌తో 963 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది హాఫ్‌ సెంచరీలున్నాయి.

ఇక షకీబ్ అల్ హసన్ 36 మ్యాచ్‌ల్లో 23.93 సగటు.. 122.44 స్ట్రయిక్‌ రేట్‌తో 742 పరుగులు సాధించాడు. ఇందులో మూడు హాఫ్‌ సెంచరీలున్నాయి. బౌలింగ్‌లో 47 వికెట్లు తీసి టీ20 ప్రపంచకప్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో ఆఫ్రిది ఉన్నాడు. అఫ్రిది 34 మ్యాచ్‌ల్లో 39 వికెట్ల కూల్చాడు. అయితే, ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2022లో భారత్‌కు సారథ్యం వహించిన రోహిత్ శర్మ.. భారత్‌కు కప్‌ను అందించలేకపోయాడు. లీగ్‌ దశలో అద్భుతంగా రాణించిన టీమిండియా నాకౌట్‌ పోరులో చతికిలపడింది. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో ఓటమిపాలై ఇంటిముఖం పట్టింది.

మరో వైపు ఇదే ఆఖరి టీ20 వరల్డ్‌ కప్‌ కావొచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే రోహిత్‌ శర్మ వయసు 37 సంవత్సరాలు. ఈ క్రమంలో వెస్టిండిస్‌, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టీ20 వరల్డ్‌ కప్‌ను ఎలాగైనా టీమిండియాను విజేతగా నిలబెట్టేందుకు రోహిత్‌కు అవకాశం ఉన్నది. టీమిండియా 2013 వరల్డ్‌ కప్‌ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఐసీసీ కప్‌ని గెలవలేదు. ఈ క్రమంలో మళ్లీ ప్రపంచకప్‌ని నెగ్గి క్రెకిట్‌ను మతంగా భావించే భారతీయులు మరోసారి కప్‌ కొడితే చూడాలని ఎంతో ఆశగా ఉన్నారు.

Exit mobile version