Site icon vidhaatha

Tokyo Olympics‌: ఆర్చరీ సీడింగ్‌ రౌండ్‌లో దీపికా కుమారి కి 9వ స్థానం

విధాత:భారత మహిళా ఆర్చర్ దీపికా కుమారి వ్యక్తిగత రికర్వ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో నిరాశపరిచింది. టోక్యో ఒలింపిక్స్ లో భాగంగా శుక్రవారం ఉదయం యుమెనొషిమా పార్క్‌లోని ఆర్చరీ ఫీల్డ్‌లో జరిగిన క్వాలిఫకేషన్ రౌండ్‌లో దీపికా కుమారి 9వ స్థానంలో నిలిచింది. హాఫ్ సమయానికి 4వ స్థానంలో నిలిచిన దీపిక ఆ తర్వాత పలు మార్లు గురి కోల్పోయింది. మొత్తం క్వాలిఫకేషన్ రౌండ్ ముగిసే సరికి 663 పాయింట్లతో 9వ స్థానానికి పడిపోయింది. క్వాలిఫికేషన్ రౌండ్ ముగిసే సరికి టాప్ 3లో సౌత్ కొరియా ఆర్చర్లే ఉండటం గమనార్హం. వరల్డ్ నెంబర్ 1 దీపికా కుమారి ప్రస్తుతం క్వాలిఫికేషన్ రౌండ్‌లో 9వ ర్యాంక్ సంపాదించింది. అయితే ఆమె జులై 27 నుంచి ప్రారంభం కానున్న రౌండాఫ్ 32 ఎలిమినేషన్ రౌండ్స్‌లో పాల్గొననున్నది. ఆమె భూటాన్‌కు చెందిన కర్మతో రౌండాఫ్ 32లో తలపడనున్నది. దక్షిణ కొరియాకు చెందిన ఆర్చర్ కాంగ్ చియాంగ్ 692 పాయింట్లతో మహిళ వ్యక్తిగత కర్వ్‌లో వరల్డ్ రికార్డు సాధించింది. మరోవైపు భారత పురుష ఆర్చర్లు కూడా మరి కొద్ది సేపట్లో ర్యాంకింగ్ రౌండ్‌లో పాల్గొననున్నారు.

దీపిక కుమారి శుక్రవారం ఉదయం ర్యాంకింగ్ రౌండ్స్‌లో పాల్గొననున్నట్లు ముందుగానే తెలుసుకున్న భారత క్రీడాభిమానులు ఉదయం నుంచే లైవ్ మ్యాచ్ కోసం సెర్చ్ చేశారు. ఒలింపిక్స్ అధికార బ్రాడ్‌కాస్టర్ సోనీ నెట్వర్క్ ఈ మ్యాచ్ లైవ్ చూపించలేదు. దీంతో పలువురు అభిమానులు సోషల్ మీడియాలో సోనీ నెట్‌వర్క్‌పై ట్రోల్ చేస్తున్నారు. సోనీ లైవ్ , సోనీ టెన్ సహా దూరదర్శన్‌లో కూడా ఆర్చరీ లైవ్ ఇవ్వలేదు.మరోవైపు రోయింగ్ పోటీలను మాత్రం ప్రత్యక్ష ప్రసారం చేయడం గమనార్హం.

Exit mobile version