Site icon vidhaatha

Viral video | బహిర్భూమికి వెళ్లిన వ్యక్తిని కదలకుండా చుట్టేసిన కొండ చిలువ.. మింగేందుకు ప్రయత్నిస్తుండగా..!

Viral video : ఆరుబయట బహిర్భూమికి వెళ్లిన ఓ వ్యక్తిపై 15 అడుగుల పొడవున్న భారీ కొండ చిలువ దాడి చేసింది. క్షణ కాలంలో అతనిపైకి లంఘించి రెండు కాళ్లు, మెడను చుట్టుకుని కదలకుండా చేసింది. ఈ హఠాత్పరిణామానికి ప్రాణ భయంతో అతడు గట్టిగా కేకలు వేయడం మొదలుపట్టాడు. అతని అరుపులు విన్న గ్రామస్తులు అక్కడి వెళ్లి చూసేసరికి భయానక దృశ్యం కంటపడింది. అతడిని కొండచిలువ బారి నుంచి కాపాడేందుకు గ్రామస్తులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. జబల్‌పూర్ జిల్లాలోని కళ్యాణ్‌పూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బహిర్భూమికని ఊరు చివర్లోని అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ 15 అడుగుల పొడవున్న కొండ చిలువ అమాంతం అతడిని చుట్టేసింది. కాసేపట్లోనే కాళ్లు, మెడను చుట్టేసి అతడిని కదలకుండా చేసింది. దాంతో అతడు విలవిలలాడిపోయాడు. తర్వాత కొండచిలువ నోటిని పెద్దగా తెరచి మింగే ప్రయత్నం చేసింది. దాంతో అతను దాని తలను కుడి చేత్తో గట్టిగా పట్టుకుని ప్రాణ భయంతో కేకలు వేశాడు.

అతడి అరుపులు విన్న గ్రామస్తులు అక్కడికి పరుగులు తీశారు. ఆ భయానక దృశ్యాన్ని చూసి షాకయ్యారు. వెంటనే తేరుకుని అతడిని కాపాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందుగా కర్రలతో ఎంత కొట్టినా అది అతడిని విడిచిపెట్టలేదు. దాంతో చేసేది లేక గొడ్డలితో తెగ నరికారు. అప్పుడుగానీ దాని పట్టు సడలలేదు. రెండు ముక్కలై రక్తమోడుతూ బాధితుడిని విడిచిపెట్టింది. తర్వాత దాన్ని కొట్టి చంపేశారు. గ్రామస్తుల రావడం మరికొంత ఆలస్యమై ఉంటే అతడి ప్రాణాలు పోయేవి. కింది వీడియోలో ఆ భయానక దృశ్యాలను మీరు కూడా చూడండి.

Exit mobile version