Solar Eclipse | 8న ఖగోళ అద్భుతం..! 50ఏళ్ల తర్వాత కనువిందు చేయబోతున్న సుదీర్ఘ సంపూర్ణ సూర్యగ్రహణం..!

  • Publish Date - April 6, 2024 / 10:20 AM IST

Solar Eclipse | ఈ నెల 8న ఖగోళ అద్భుతం జరుగబోతున్నది. ఈ ఏడాది తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతున్నది. సాధారణంగా భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో చీకటిగా మారుతుంది. అయితే భూమి, సూర్యునికి మధ్య వచ్చిన చంద్రుడు వృత్తాకారం సూర్యుడిని పూర్తిగా కప్పేస్తే సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది. దాంతో సూర్య కిరణాలు భూమిని చేరుకోలేవు. భూమిపై కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా అంధకారం ఆవరిస్తుంది. సూర్యగ్రహణం నేపథ్యంలో అమెరికాలోని చాలా ప్రాంతాలు నిశీధిలోకి వెళ్లనున్నాయి. గ్రహణం నేపథ్యంలో సూళ్లకు సెలవులు ప్రకటించారు. గతేడాది అక్టోబర్‌ 14న రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ కనువిందు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సంపూర్ణ సూర్యగ్రహణం కోసం ప్రజలంతా సిద్ధమవుతున్నారు. ఈ గ్రహణం మొదట మెక్సికోలో కనిపిస్తుంది. ఆ తర్వాత అమెరికాలోని టెక్సాస్‌, ఓక్లాహామా, అర్కాన్‌సాస్‌, మిస్సౌరి, ఇల్లినాయిస్‌, కెంటకీ, ఇండియానా, ఓహియో, పెన్సిల్వేనియా, న్యూయార్క్‌, వెర్మాంట్‌, న్యూ హ్యాంప్‌షైర్‌, మైన్‌ రాష్ట్రాల మీదుగా కెనడా వరకు వెళ్తుంది.

గ్రహణం నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పూర్తిగా చీకట్లు కమ్ముకోనున్నాయి. అదే సమయంలో టెన్నెస్సీ, మిచిగాన్‌లోని పలు ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించనున్నది. అయితే, దాదాపు 50 సంవత్సరాల తర్వాత ఏర్పడబోతున్న సుదీర్ఘ సూర్యగ్రహణం ఇదే కావడం విశేషం. అయితే, ఈ సూర్యగ్రహణం మాత్రం భారత్‌లో కనిపించడం లేదు. భారత కాలమానం ప్రకారం 8న రాత్రి 9.12 గంటలకు ప్రారంభమై తెల్లవారు జామున 1.25 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం 4.39 గంటల పాటు ఉండనున్నది. దీంతో సూర్యగ్రహణం అత్యంత సుదీర్ఘమైన సూర్యగ్రహణమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అంతేకాదు సంపూర్ణ సూర్యగ్రహణ అద్భుతమైన దృశ్యం 50 సంవత్సరాల కిందట కనిపించిందని.. మళ్లీ ఇప్పుడు మాత్రమే కనిపిస్తుందని పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్‌ 14న ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ గ్రహాణాని కూడా ఓ ప్రత్యేకత ఉన్నది. సూర్యగ్రహణం సమయంలో అత్యంత అరుదుగా ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’గా ఆవిష్కృతమైంది. అమెరికా, మెక్సికో సహా దక్షిణ, మధ్య అమెరికాలోని పలు దేశాల్లో మాత్రమే కనువిందు చేసింది. ఈ దేశాల్లో ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ ఇంతకుముందు 2012లో కనిపించింది. మళ్లీ 2046లో మాత్రమే దర్శనం ఇవ్వనున్నది.

Latest News