Site icon vidhaatha

Publicity Stunt Viral Video | కూలి పని చేసినట్టు ఫొటోలు, వీడియోలకు పోజిచ్చాడు.. కట్‌ చేస్తే! ద్యావుడా!!

Publicity Stunt Viral Video | ఫొటోల కోసం పోజులు ఇస్తూ చిన్నా చితక పనులు చేస్తూ పొద్దున్నే పేపర్‌లో కవరేజీకి కక్కుర్తిపడే నాయకులకు మన దేశంలో కొదవ లేదు. ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నామని లేదా కష్టజీవి కష్టం తెలుసుకుంటున్నానని చెబుతూ ఇలాంటి ఫీట్లు చేస్తూ ఉంటారు కొందరు రాజకీయ నాయకులు. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో ఇటువంటి ఫీట్స్‌ కనిపిస్తూ ఉంటాయి. అదొక గొప్పగా భావించి మీడియా ఏ మాత్రం సిగ్గుపడకుండా కవరేజీ ఇచ్చిన సందర్భాలు చాలానే చూశాం. రోడ్లు ఊడ్చడం, దారిని పోతూ ఇస్త్రీ బండి వద్ద ఇస్త్రీ చేయడం.. దోశల బండి దగ్గర దోశలు వేయడం పరిపాటే. ఇదే పద్ధతిలో ఒక రాజకీయ నాయకుడు భవన నిర్మాణ కార్మికుడిలా పనిచేసి ఫొటోలు, వీడియోలకు పోజులు ఇవ్వబోయాడు. కానీ.. ఫాఫం.. ఎరక్కపోయి.. ఇరుక్కు పోయాడు. అందులోనూ ఇందులోనూ కాదు.. పేద్ద గొయ్యిలో! దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తున్నది. రాజకీయ నాయకుల ‘ఓటు పాట్ల’ను, పబ్లిసిటీ స్టంట్‌ను కళ్లకు కడుతున్నది.

ఒక గ్రామీణ ప్రాంతంగా కనిపిస్తున్న ప్రాంతంలో తీసిన ఈ వీడియోలో ఒక రాజకీయ నాయకుడు మేస్త్రి పనిచేస్తూ కనిపిస్తాడు. ఆయనకు ఆయన అభిమానులు పెట్టుకున్న పేరు ‘నేతా జీ’. ఒక సివిల్‌ వర్క్‌ జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్న సదరు నేతా జీకి భలే అవుడియా బుర్రలో మెరిసింది. అంతే.. అక్కడ మేస్త్రీ అవతారం ఎత్తాడు. ఇతర కూలీలు బేసిన్లలో తీసుకొచ్చిన కంకరును ఒక గోతిలో వేస్తూ ఉంటాడు. ఒకటి వేసినా.. పాపం అనుభవం లేదాయె! రెండో బేసిన్‌లో కంకరును గోతిలో వేయడానికి ప్రయత్నించే క్రమంలో కాలికింద మట్టిగడ్డ ఊడిపోయింది. అంతే.. తనకు రెండింతల లోతు ఉన్న గోతిలోకి సడన్‌గా పడిపోయాడు. దీంతో చుట్టుపక్కలవాళ్లు కంగారు పడిపోవడం ఆ వీడియోలో కనిపిస్తుంది.

సివిల్‌ పనుల్లో ఉండే కష్టాన్ని, కూలీలు పడే ఇబ్బందులను ఈ వీడియో చెప్పకనే చెప్పింది. ఇది పాత వీడియోనే అయినా.. తాజాగా మళ్లీ వైరల్‌ అయింది. ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కొందరైతే.. పాపం.. ఏదో చేద్దామనుకుంటే ఏదో అయింది.. అంత మాత్రాన దీనిపై కామెడీ చేస్తే ఎలా? అని స్పందించారు. ‘ప్లీజ్‌ పూర్తి వీడియో షేర్‌ చేయండి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంది..’ అని ఒకరు రాశారు. ‘యాక్షన్‌లకు ఎప్పుడూ రియాక్షన్‌ ఉంటుంది’ అని ఒకరు కామెంటారు. పేదలు ఎంత రిస్క్‌ తీసుకుని ఇటువంటి పనులు చేస్తుంటారోనని ఒకరు పేర్కొన్నారు. వర్కింగ్‌ క్లాస్‌ పని పరిస్థితులు మెరుగుపర్చాల్సిన అవసరాన్ని ఈ వీడియో నొక్కి చెప్పిందన్నవారూ ఉన్నారు. సదరు రాజకీయ నాయకుడు ఇక జన్మలో ఇటువంటి డ్రామాలు ఆడబోడని ఇంకొకరు తేల్చి చెప్పారు.

Exit mobile version