మాయ‌మైన రైలు.. 40 ఏళ్లకు దొరికింది..!

మీరు చ‌దివింది నిజమే. ఒక పాసింజరు రైలు 40 సంవత్సరాల పాటు ‘మిస్సయింది’. భారతీయ రైల్వే చరిత్రలో ఇది ఒక మిస్టరీ. విచిత్రమేమిటంటే, ఒక రైలు కనబడటంలేదన్న విషయం ఇండియన్ రైల్వేకు కూడా తెలియదు. అదే ‘ది లాస్ట్ ట్రెయిన్ ఆఫ్ తిన్సుకియా’.

  • Publish Date - April 22, 2024 / 07:18 PM IST

అది డిసెంబర్5, 2019. అమెరికా నాసాకు చెందిన ఉపగ్రహమొకటి ఆసియా‌‌–ఆఫ్రికా ప్రాంతంలోని అటవీ భూముల మ్యాపింగ్​ చేస్తుండగా, అసోంకు ఈశాన్యంగా అటవీప్రాంతంలో ఒక అనుమానాస్పద రైలు లాంటిది కనబడింది. పూర్తిగా పచ్చని చెట్లు, తీగలతో కప్పబడి లీలగా కనబడుతున్న ఈ భారీ ఇనుప ట్రాలీ జాడలను చూసి ఉలిక్కిపడ్డ నాసా, వెంటనే ఈ సమాచారాన్ని పెంటగాన్​కు చేరవేసింది. ఇదేదో ఖండాతర క్షిపణిగా భావించిన అమెరికా పూర్తి సమాచారం సేకరించాల్సిందిగా త‌న సిఐఏ, నాసా అధికారుల‌ను ఆదేశించింది. దాంతో అమెరికా ఉపగ్రహాలు ఈ ప్రాంతంపై త‌మ దృష్టిని కేంద్రీక‌రించి స‌మాచారాన్ని సేక‌రించ‌డం మొద‌లుపెట్టాయి. త‌మ భూభాగంపై ఈ అనూహ్య ఉప‌గ్రహ క‌ద‌లిక‌ల‌ను క‌నిపెట్టిన భార‌త ఇస్రో, ప్రభుత్వ ఎన్‌టీఆర్ఓ(భార‌త సాంకేతిక ప‌రిశోధ‌నాసంస్థ), నిఘా విభాగాల‌కు స‌మాచారాన్ని పంపింది.

ఇంత‌లో, పెంట‌గాన్‌లో డ‌బుల్ ఏజెంట్లుగా ప‌నిచేస్తున్న చైనా, ర‌ష్యా గూఢ‌చారులు ఈ ‘ఖండాంత‌ర క్షిప‌ణి రైలు’ గురించి త‌మ‌త‌మ దేశ‌ ప్రభుత్వాల‌కు స‌మాచార‌మిచ్చారు. ఇటువంటి చిత్రవిచిత్రాలు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఈ విష‌యం ఆయా దేశాల్లో ప‌నిచేస్తున్న మ‌న ‘రా’ ఏజెంట్లకు చేరింది.

ఇక విచార‌ణ ప‌రాకాష్టకు చేరింది. ఇది ఎవ‌రి ప‌ని? కొంప‌దీసి ఇండియాలో ఎవ‌రైనా డాక్టర్‌. స్ట్రేంజ్‌ల‌వ్ లాంటి వాడు ఉన్నాడా? ఉంటే మామూలు పౌరుడా, సైన్యానికి చెందిన‌వాడా? అన్న భ‌యాలు ఇతర దేశాలలో మొద‌ల‌య్యాయి. ( డా. స్ట్రేంజ్‌ల‌వ్ అనేది ఇంగ్లీష్ వ్యంగ్య సినిమా. అందులో ఒక విచిత్రమైన అమెరిక‌న్ ఎయిర్‌ఫోర్స్ జ‌న‌ర‌ల్‌, ఎటువంటి ప్రభుత్వ ఆదేశాలు లేకుండా సోవియ‌ట్ యూనియ‌న్‌పై ఆటంబాంబు ప్రయోగించ‌మ‌ని త‌న సిబ్బందికి ఆదేశాలిస్తాడు. ఇక అక్కన్నుంచి, అమెరికా అధ్యక్షుడు, సైన్యాధ్యక్షులు, పెంట‌గాన్ అధికారులు అప్పటికే అణుబాంబుతో బ‌య‌లుదేరిన ఒక బి52 బాంబ‌ర్‌ను ఆప‌డానికి, అణుయుద్ధాన్ని నివారించ‌డానికి ప‌డే క‌ష్టాలు క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. ఆ ఎయిర్‌ఫోర్స్ జ‌న‌ర‌ల్‌నే డా. స్ట్రేంజ్‌ల‌వ్‌గా పిలుస్తారు. ఆ సినిమా పేరు కూడా అదే. చాలా ఫేమ‌స్ సినిమా).

ఇక భార‌త ప‌క్షాన విచార‌ణ మొద‌లైంది. భార‌త ప్రధాన‌మంత్రి కార్యాల‌యం, డిఐఏ(ర‌క్షణ నిఘా సంస్థ), ఎన్ఐఏ, ర‌క్షణ మంత్రిత్వ శాఖ‌, ర‌క్షణ వ్యవ‌హారాల క్యాబినెట్ క‌మిటీ ఈ విష‌యంపై నేరుగా దృష్టి సారించాయి. వెంట‌నే ఒక అంత‌ర్గత మెమో ద్వారా అన్ని అత్యున్నత భార‌త ర‌క్షణ ఏజెన్సీలు ( ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్‌, మిలిట‌రీ స్పేస్ క‌మాండ్‌, స్ట్రాట‌జిక్ ఫోర్సెస్ క‌మాండ్‌) ఈ పుకారును ఖండించాయి. తామెటువంటి క్షిప‌ణినీ అక్కడ మోహ‌రించ‌లేద‌ని ప్రభుత్వానికి నివేదించాయి. అయితే, భార‌త వాయుసేన‌, ఏఆర్‌సీ(వైమానిక ప‌రిశోధ‌నాకేంద్రం), ఇస్రోలు త‌మ ఉప‌గ్రహ‌, డ్రోన్ చిత్రాల ద్వారా చెట్లతో క‌ప్పబ‌డిన ఓ రైలు మాత్రం అక్కడ ఉంద‌ని ధృవీక‌రించాయి. దాంతో హుటాహుటిగా ఎన్ఎస్ఏ, త‌న మార్కొస్‌, గ‌రుడ ద‌ళాల‌ను ఒక సీనియ‌ర్ నిఘా అధికారి నేతృత్వంలో ఆ ప్రదేశానికి పంపింది.

ఇంత‌కీ, అక్కడ ఉన్నది తుప్పుప‌ట్టి పోయిన ఓ రైలు. 40 సంవత్సరాల క్రితం ఎవరికీ తెలియకుండా ‘మాయమైన’ రైలు.

అస‌లు జ‌రిగిందేంటంటే….

అది అస్సాంలోని తిన్‌సుకియా రైల్వే స్టేష‌న్‌కు 40 కి.మీ ముందుండే ఒక చిన్న రైల్వేస్టేష‌న్‌. తిన్‌సుకియా ప‌ట్టణం గువాహ‌టికి ఈశాన్యంగా 480 కి.మీ దూరంలో, అరుణాచ‌ల్ ప్రదేశ్ స‌రిహ‌ద్దుకు 80 కి.మీల దూరంలో ఉంటుంది. 16 జూన్ 1976 న ఉద‌యం 11.08 గంట‌ల‌కు ఓ రైలు ఆ చిన్న స్టేష‌న్‌కు చేరుకుంది. దిగాల్సిన ప్రయాణీకులంద‌రూ దిగిపోయి వారి స్వస్థలాల‌కు వెళ్లిపోయారు. అప్పటికే వాతావ‌ర‌ణం భారీ వ‌ర్ష రాక‌డ‌ను సూచిస్తూ బీభ‌త్సంగా ఉంది. ఇక ప్లాట్‌ఫారం ఖాళీగా లేక‌పోవ‌డంతో, ఈ రైలును రెండు కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కూ ఉన్న ఉప‌యోగంలో లేని సైడ్ లైన్ మీద‌కి మ‌ళ్లించి, ఓ కొండ‌మ‌లుపులో ఆపేసారు. ఇంజిన్‌ను వేరే గూడ్స్ వ్యాగ‌న్లను త‌ర‌లించే ప‌ని కోసం ఈ ట్రైన్ నుండి త‌ప్పించి స్టేష‌న్‌కు పిలిపించుకున్నారు. స‌రిగ్గా, 11.45 కు మొద‌లైన వ‌ర్షం ఆ ఊరిని అల్లక‌ల్లోలం చేసేసింది. స్టేష‌న్ మాస్టర్‌తో స‌హా రైల్వే సిబ్బంది అంతా స‌హాయ‌క చ‌ర్యలు, ఇత‌ర రైళ్ల రాక‌పోక‌ల‌ను నియంత్రించ‌డం లాంటి ప‌నుల్లో నిమ‌గ్నమైపోయారు. స్టేష‌న్ కూడా ఐదారు ఫీట్ల వ‌ర‌ద‌లో మునిగిపోయింది. రెండు మూడు రోజుల వ‌ర‌కు అంతా ఈ హ‌డావుడిలోనే ఉండి ఆ రేక్ (ఇంజ‌న్ లేని రైలును రేక్ అంటారు) గురించి మ‌ర్చిపోయారు. అది ఎవ‌రికీ క‌న‌బ‌డ‌కుండా రెండు కి.మీ దూరంలో నిర్జన ప్రాంతంలో, కొండ‌మ‌లుపులో ఉంది. మెల్లగా వ‌ర‌ద నీళ్ల ప్రభావానికి మొక్కలు, తీగ‌లు మొలిచి, రేక్ మీదుగా కొండ‌ను అల్లుకుపోయాయి. ఆ సైడ్ ట్రాక్ కూడా పూర్తిగా చెట్లు, తీగ‌ల‌తో క‌ప్పబ‌డిపోయింది. మొత్తానికి ఆ రైలంతా పాముల‌కు, తేళ్లకు, ఇత‌ర అట‌వీ జంతువుల‌కు ఆల‌వాలంగా మారిపోయింది.

కాలం గ‌డిచిపోతోంది. ఆ టైమ్‌లో ప‌నిచేసిన రైల్వే సిబ్బందిలో కొంత‌మంది చ‌నిపోగా, మ‌రికొంత‌మంది రిటైరైపోయి పిల్లల వ‌ద్దకు వెళ్లిపోయారు. ఆ రైలు డ్రైవ‌ర్‌గా ప‌నిచేసిన డేనియ‌ల్ స్మిత్ సెప్టెంబ‌ర్‌1976లో అస్ట్రేలియాకు వ‌ల‌స వెళ్లిపోయాడు. దాంతో ఆ రైలు గురించిన స‌మాచారం పూర్తిగా అంధ‌కారంలోకి జారిపోయింది. ఆ విధంగా ఒక రైలు విజ‌య‌వంతంగా ‘అదృశ్యమైంది’. తిరిగి 40 ఏళ్ల త‌ర్వాత ప్రపంచాన్ని గ‌డ‌గ‌డ వ‌ణికించి బ‌య‌ట‌కొచ్చింది.

గ‌మ్మత్తుగా ఉంది క‌దా.. ఈ మాయ‌మైన రైలు క‌థ‌.

Latest News