Vasuki Indicus | ఈ భూమ్మీద అతిపెద్ద పాము అనకొండ కాదట.. అంతకంటే పెద్దదే ఉందట..!

Vasuki Indicus | ఈ భూమ్మీద చిన్నవి, పెద్దవి కలిపి ఎన్నో జాతుల పాములు ఉన్నాయి. చిన్న పాముల్లో ఎక్కువగా కట్లపాము, రక్తపింజర, నాగుపాము తదితర విషసర్పాలు ఉంటాయి. ఇక పెద్ద పాము అనగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది అనకొండ. కానీ అనకొండ కంటే కూడా పెద్ద పాము ఒకప్పుడు ఈ భూమ్మీద జీవించి ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Publish Date - April 23, 2024 / 08:25 AM IST

Vasuki Indicus : ఈ భూమ్మీద చిన్నవి, పెద్దవి కలిపి ఎన్నో జాతుల పాములు ఉన్నాయి. చిన్న పాముల్లో ఎక్కువగా కట్లపాము, రక్తపింజర, నాగుపాము తదితర విషసర్పాలు ఉంటాయి. ఇక పెద్ద పాము అనగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది అనకొండ. కానీ అనకొండ కంటే కూడా పెద్ద పాము ఒకప్పుడు ఈ భూమ్మీద జీవించి ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గుజరాత్‌లోని ఓ గనిలో అనకొండ కంటే భారీ పరిమాణంలో ఉన్న ఒక సర్పం శిలాజాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పాము 50 అడుగులకు పైగా పొడవుతో టన్నుకుపైగా బరువుతో ఉండి ఉంటుందని అంచనా వేశారు. ఈ శిలాజ సర్పానికి ‘వాసుకి’ అని పేరు పెట్టారు. హిందూ పురాణాల ప్రకారం దేవదేవుడైన శివుడి మెడలో ఉండే సర్పాన్ని వాసుకి అంటారు.

ఎలా గుర్తించారు..?

2005లో గుజరాత్‌లోని ఓ బొగ్గు గనిలో తవ్వకాలు జరుపుతుండగా కొన్ని శిలాజాలు బయటపడ్డాయి. వాటిని సేకరించిన శాస్త్రవేత్తలు అవి పురాతన కాలం నాటి ఓ భారీ మొసలి లాంటి జీవి వెన్నుపూసలు కావొచ్చని ప్రాథమికంగా భావించారు. ఆ తర్వాత ఈ విషయం మరుగున పడింది. కొన్నేళ్ల తర్వాత వాటిపై రూర్కీ ఐఐటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు.

గనిలో లభించిన మొత్తం 27 వెన్నుపూసలను క్రమపద్ధతిలో చేర్చారు. వాటిలో కొన్ని ఒకదానికొకటి అనుసంధానమై ఉండటాన్ని గమనించారు. వివిధ జీవుల వెన్నుపూసలతో ఈ శిలాజ ఎముకలను పోల్చి చూశారు. ఈ వెన్నుపూసల శిలాజాలు ఓ భారీ సర్పానికి సంబంధించినవి కావొచ్చని గత ఏడాదే ఓ అంచనాకు వచ్చారు. పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి అది భారీ సర్పమేనని నిర్ధారించారు.

ఆ వెన్నుపూసల పరిమాణం, స్థితిగతులు, దొరికిన ప్రాంతం, ఇతర ఆధారాలను బట్టి ఆ సర్పం జీవించిన తీరు, దాని ఆహారం ఏమిటి అనే అంచనాలు వేశారు. ఆ అంచనాల ఆధారంగా అది ప్రపంచంలోనే అతిపెద్ద సర్పమని తేల్చారు. అనంతరం దానికి పరమ శివుడి మెడలో ఉండే సర్పం పేరిట ‘వాసుకి ఇండికస్‌’ అనే పేరు పెట్టారు.

ఆ సర్పం ఎన్నేళ్ల నాటిదంటే..!

వాసుకి ఇండికస్‌ 50 అడుగుల (15 మీటర్లు) పొడవుతో టన్నుకుపైగా బరువుతో ఉంటుందని సైంటిస్టులు అంచనా వేశారు. సుమారు 4.7 కోట్ల ఏళ్ల కింద ఈ సర్పం జీవించిందని తేల్చారు. దీని భారీతనం కారణంగా మెల్లగా కదిలేదని, దానికి చిక్కిన జంతువులను గట్టిగా చుట్టేసి అనకొండలా తినేసేదని గుర్తించారు. అంతరించిపోయిన వాటిలో ఇప్పటివరకు కొలంబియాలో గుర్తించిన టిటనోబోవానే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. టిటనోబోవా 42.7 అడుగుల (13 మీటర్లు) పొడవుతో 1,100 కిలోలకుపైగా బరువుతో ఉండి ఉంటుందని అంచనా వేశారు. ఈ సర్పం చేపలు, తాబేళ్లు, మొసళ్లు, వేల్స్‌ను తినేదని అంచనా వేశారు. ఇప్పుడు టిటనోబోవా కంటే వాసుకి ఇండికస్‌ పెద్దదని నిర్ధారించారు.

అందుకే భారీ ఆకారం..!

అప్పటి వేడి వాతావరణం, అందుబాటులో ఉన్న ఆహారం, శత్రు జీవులు లేకపోవడం లాంటి కారణాల వల్ల వాసుకి ఇండికస్‌ అంత భారీగా ఎదిగి ఉంటుందని భావిస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది అనకొండ తరహాలోనే నీటిలో కంటే నేల మీదే ఎక్కువగా జీవించి ఉండటానికి అవకాశం ఉందన్నారు. భారీగా ఉండటం వల్ల చెట్లపైకి ఎక్కగలిగి ఉండేది కాదని, ఇది కచ్చితంగా టిటనోబోవా కంటే పెద్దదని, కాబట్టి భూమ్మీద జీవించిన సర్పాలన్నింటికంటే పెద్దదని చెప్పవచ్చని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన రూర్కీ ఐఐటీ శాస్త్రవేత్తలు దేవజిత్‌ దత్తా, సునీల్‌ వాజ్‌పాయ్‌ తెలిపారు.

Latest News