Site icon vidhaatha

Viral news | నదిలో జీబ్రాను చుట్టిముట్టి మొసళ్ల దాడి.. ఫైట్ చేసి ఎలా తప్పించుకుందో చూడండి.. Video

Viral news : ‘నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు బట్టు.. బయట కుక్క చేత భంగపడును’ అని యోగి వేమన చెప్పినట్టుగా బయట కుక్కను కూడా ఎదిరించలేని మొసలి శక్తి నీళ్లలో మాత్రం అపారం. నీళ్లలో ఉన్నప్పుడు మొసలిని ఎదరించగలిగే జంతువే లేదు. దాని బలమైన దవడలతో కొరికితే ఎంతపెద్ద జంతువైనా విలవిల్లాడుతుంది. ఎముకలు ఎండు పుల్లల్లా విరిగిపోతాయి. నీళ్లలో అంతటి శక్తిమంతమైన మొసళ్లతో పోరాడి ఓ జీబ్రా తన ప్రాణాలు దక్కించుకుంది.

చుట్టుముట్టిన మొసళ్లతో ధైర్యంగా పోరాడింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో ఏముందంటే.. ఓ జీబ్రా నదిని దాటేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అది నది మధ్యలోకి రాగానే దాన్ని మొసళ్లు చుట్టుముట్టాయి. ఓ మొసలి పెద్దగా నోరు తెరిచి దాన్ని కొరికే ప్రయత్నం చేసింది. కానీ జీబ్రా తిరగబడి మొసలి దవడను కొరికేసింది. జీబ్రా తెగువ చూసి మిగతా మొసళ్లు కూడా వెనక్కి తగ్గాయి. అదే అవకాశంగా భావించిన జీబ్రా బయటికి పరుగుతీసింది.

ఈ వీడియోపై నెటిజన్‌లు రకరకాల కామెంట్‌లు చేస్తున్నారు. జీబ్రా పోరాటం అద్భుతమని కొనియాడుతున్నారు. జీబ్రా మాదిరిగా తెగువ చూపితే ఆపదల నుంచి సులువుగా బయటపడవచ్చని, విజయమో వీర మరణమో అన్నట్టుగా జీబ్రా పోరాడిందని నెటిజన్‌లు రకరకాల కామెంట్‌లు చేస్తున్నారు.

Exit mobile version