Site icon vidhaatha

Switzerland Speeding Fine | అతివేగానికి.. ‘షాకింగ్’ జరిమానా.. ఎంతో తెలుసా?

Switzerland Speeding Fine | స్విట్జర్లాండ్‌లోని లసాన్ నగర వీధిలో ఒక లగ్జరీ కారు అతివేగంగా నడిపినందుకు ఓ ధనవంతుడైన వ్యాపారవేత్తకు రూ.97 లక్షల (90,000 స్విస్ ఫ్రాంకులు) భారీ జరిమానా విధించారు. గంటకు 50 కి.మీ. పరిమితి ఉన్న రోడ్డుపై 77 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుండగా, రోడ్డు భద్రతా కెమెరాలో ఈ వ్యక్తి కారు నిక్షిప్తమైంది. ఇది సాధారణ వేగం అతిక్రమణ కేసు మాత్రమే కాకుండా, ఆయన ఇదే నేరం పదేపదే చేయడం వల్ల జరిమానా మొత్తం భారీగా పెరిగింది. ఇంకో విచిత్రమైన విషయమేమిటంటే, స్విట్జర్లాండ్‌లో జరిమానాలు వ్యక్తి ఆదాయం, ఆస్తులు, ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి నిర్ణయించబడతాయి. ఇంత భారీ మొత్తం జరిమానా పడడానికి ఇది కూడా ఒక కారణం.

ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇదే స్విట్జర్లాండ్‌లో అత్యధిక జరిమానా కాదు. 2010లో ఒక ఫెరారీ డ్రైవర్‌కు రూ.2.4 కోట్లకు సమానమైన జరిమానా విధించారు. ‘వాడ్’ ప్రాంతంలో అమలులో ఉన్న చట్టం ప్రకారం, నేరం జరిగిన సమయానికి నిందితుడి ఆదాయం, ఆస్తి, జీవనశైలి, కుటుంబ అవసరాల ఆధారంగా శిక్ష పరిమితి నిర్ణయిస్తారు. సాధారణంగా పేదవారికి జైలు శిక్ష విధించే అవకాశముండగా, అత్యంత ధనవంతులైన వారికి లక్షల రూపాయల జరిమానా విధిస్తారు.

ఈ తాజా కేసులో, కోర్టు మొదట 10,000 స్విస్ ఫ్రాంకుల ముందస్తు చెల్లింపు ఆదేశించగా, వచ్చే మూడు సంవత్సరాలలో మళ్లీ ఇలాంటి నేరం చేస్తే మిగతా 80,000 ఫ్రాంకులు కూడా వసూలు చేస్తామని తీర్పునిచ్చింది. ఈ వ్యక్తి ఫ్రాన్స్ పౌరుడై వుండి, స్విట్జర్లాండ్‌లో అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. 2016లో జెనీవా నగరంలో బ్యాంక్ దోపిడీ నిందితులను వెంబడిస్తూ వేగ పరిమితిని దాటి డ్రైవ్ చేసిన ఒక పోలీసు అధికారి కూడా జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఈ చట్టం సమానత్వం పేరుతో, ఎవరి ఆర్థిక స్థితి బట్టి వారికి సరిపడా శిక్ష పడేలా చేస్తుంది.

Exit mobile version