Site icon vidhaatha

Viral news | కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కింద బ్యాంకు ఖాతాల్లో నగదు.. భర్తలను వదిలి లవర్లతో 11 మంది భార్యలు జంప్‌

Viral news : ప్రజల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంటాయి. దేశ ప్రజల కోసం ప్రభుత్వాలు ప్రతి ఏటా లక్షల కోట్లను ఖర్చు చేస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రభుత్వ పథకాలను కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని కొందరు వివాహిత యువతులు పక్కదారి పట్టించారు. ఆ స్కీమ్‌ కింద వచ్చిన డబ్బులు తీసుకుని తమ భర్తలను వదిలి లవర్లతో పారిపోయారు. ఉత్తరప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఈ ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన వారు ఇళ్లు నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2.5 లక్షలను సబ్సిడీగా ఇస్తున్నది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ క్రమంలోని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మహారాజ్‌గంజ్ జిల్లా నిచ్‌లాల్ బ్లాక్‌లోని తొమ్మిది గ్రామాలైన తుతిహరి, శీతలాపూర్, చాటియా, రాంనాదర్, బకుల్దిహ, ఖేషర కిషూన్‌పూర్, మేధౌలి గ్రామాల్లో ఈ పథకం కింద 2,350 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారికి తొలి విడతలో రూ.40 వేల చొప్పున ఖాతాల్లో జమ చేశారు.

ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ పథకం కింద మహిళలే అర్హులు కావడంతో వారి ఖాతాల్లో నగదును జమచేశారు. దాంతో ఆ 9 గ్రామాలకు చెందిన 11 మంది వివాహిత యువతులు తమ ఖాతాలో జమ అయిన డబ్బులు తీసుకుని లవర్స్‌తో జంప్‌ అయ్యారు. దాంతో బాధిత భర్తలు లబోదిబోమంటూ బ్లాక్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు, ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దాంతో అధికారులు మిగిలిన విడతల నగదు జమ కాకుండా ఆ 11 మంది యువతుల ఖాతాలను నిలిపేశారు.

ఈ వార్త మహారాజ్‌గంజ్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బారాబంకి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ప్రభుత్వం జమ చేసిన నగదు తీసుకుని భార్యలు ప్రియుళ్లతో పారిపోయారు. అయితే ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద పొందిన డబ్బులను ఇంటి నిర్మాణానికి కాకుండా మరో దానికి ఉపయోగిస్తే లబ్ధిదారుల నుంచి ఆ డబ్బును తిరిగి తీసుకుంటారు. తాజాగా పారిపోయిన మహిళల ఆచూకీ లభిస్తే వారి నుంచి కూడా తొలి విడత నగదును అధికారులు రికవరీ చేస్తారు.

Exit mobile version