Insta reels | విరిగిన పన్ను.. అక్కాతమ్ముళ్లను కలిపింది   

కలయికలు, విడిపోవడాలు ఒకోసారి గమ్మత్తుగా ఉంటాయి. పద్దెమిదేళ్ల క్రితం విడిపోయిన అక్కాతమ్ముళ్లు తిరిగి విచిత్రంగా కలిసారు. తమ్ముడికున్న ఒక విలక్షణమైన గుర్తు, అతన్ని తన అక్కయ్య గుర్తుపట్టేలా చేసింది.

  • Publish Date - July 2, 2024 / 08:37 AM IST

ఉత్తరప్రదేశ్​ రాష్ట్రంలోని కాన్పూర్​(Kanpur)లో నివసిస్తున్న రాజకుమారి(Rajkumari) ఒకరోజు ఇన్​స్టా రీల్స్(Insta Reels)​ చూస్తూ, ఒక్కసారిగా షాక్​ తింది. ఆ రీల్​లో ఉన్న యువకుడిని తను ఎక్కడో బాగా చూసినట్లు అనిపించింది. దాంతో ఆ యువకుడి రీల్స్​ మరిన్ని పరిశీలించింది. బాగా పరిచయమున్న ముఖంలాగే ఉన్నా, గుర్తుపట్టడంలో ఇబ్బంది పడింది. కానీ, ఆ యువకుడిలో ఉన్న ఒక వెరైటీ గుర్తును అక్క పసిగట్టింది. అదే విరిగిన పన్ను(Broken teeth). ఆ యువకుడికి ఒ పన్ను విరిగిఉంది. అది కూడా తేడాగా ఉంది. అంతే.. రాజకుమారి ఆనందానికి అవధులు లేవు. అతను మరెవరో కాదు, 18 ఏళ్ల క్రితం తమనుండి విడిపోయిన తన తమ్ముడు బాల గోవింద్(Bal Govind)​.

పద్దెనిమిదేళ్ల క్రితం ఒకరోజు ముంబయిలో పని చూసుకుంటానని తమ ఊరైన ఇనాయత్​పూర్​(Inayatpur) నుండి బయలుదేరివెళ్లాడు. ఆ వెళ్లడం వెళ్లడం ఇక మళ్లీ కనబడలేదు. కుటంబసభ్యులంతా తెగ వెతికారు. గోవింద్​ స్నేహితులను, ఇంకా తెలిసినవారిని కనుక్కున్నా ఉపయోగం లేకపోయింది. గోవింద్​తో పూర్తిగా కనుమరుగైపోయాడు. కాలక్రమేణా అందరూ తన గురించి మర్చిపోయి, ఎవరి జీవితం వారు గడపసాగారు.

ఒకరోజు ముంబయిలో అనారోగ్యం బారిన పడ్డ గోవింద్​ ఇంటికెళ్దామని, ఓ రైలెక్కాడు. అది కాస్తా, కాన్పూర్​ బదులు, రాజస్థాన్​ రాజధాని జైపూర్​(Jaipur)లో పడేసింది. రైల్వేస్టేషన్​లో ఆనారోగ్యంతో ఉన్న గోవింద్​ను గమనించిన ఒకాయన, తనకు పనిప్పస్తానని చెప్పి తీసుకెళ్లి, ఆరోగ్యం కుదుటపడ్డాక తను పనిచేసే ఫ్యాక్టరీలోనే పనిప్పించాడు. అంతే.. అక్కడే గోవింద్​ కొత్త జీవితం మొదలైంది. మంచిగా ఎదిగాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇద్దరు పిల్లల తండ్రయ్యాడు.

అయితే, అతని విరిగిన పన్ను మాత్రం మారలేదు. ఆ విచిత్రమైన పన్నే అతన్ని ఇన్​స్టాలో తన అక్కకు పట్టించింది. జైపూర్​ విశేషాలతో ఇన్​స్టా రీల్స్​ చేయడం గోవింద్​కు అలవాటు. అలాగే ఇన్​స్టా రీల్స్​ చూస్తూ ఎంజాయ్​ చేయడం రాజకుమారికి అలవాటు. ఆ అలవాట్లే ఆ ఇద్దరినీ కలిపాయి. గోవింద్​ చేసిన ఒకానొక రీల్​ను రాజకుమారి చూడటం తటస్థించింది.  అందులో ఉన్న యువకుడిలో తన తమ్ముడి పోలికలు కనిపించాయి ఆమెకు. ఆత్రుతగా తను గోవింద్​ చేసిన మరికొన్ని విడియోలు వెతికింది. అప్పుడు దొరికింది ఆ బండ గుర్తయిన విరిగిన పన్ను. అంతే.. కళ్ల నిండా ఆనందబాష్పాలతో వాళ్లాయనకు విషయం చెప్పి, గోవింద్​ను ఇన్​స్టాలో కాంటాక్ట్​ చేసింది. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకున్న అక్కాతమ్ముళ్లు ఎంతో ఆనందపడిపోయారు.

తమ్ముడిని వెంటనే తన ఇంటికి రమ్మని కన్నీళ్లతో కోరింది రాజకుమారి. కదిలిపోయిన గోవింద్​, వెంటనే తన కుటుంబాన్ని తీసుకుని అక్క ఊరైన కాన్పూర్​ చేరుకున్నాడు(Govind reached Kanpur). అప్పటికే వారుంటున్న వీధిలోవారందరికీ విషయం తెలిసి రాజకుమారి ఇంటిముందు గుమిగూడారు. ఇంటిముందు ఆగిన ట్యాక్సీలోనుండి దిగిన తమ్ముడిని చూసి అక్కకు, అక్కను చూసి తమ్ముడికి నోట మాట రాలేదు. కళ్లలోనుండి మాత్రం నీళ్లు కారుతూనేఉన్నాయి. వారిద్దరికే కాదు, చుట్టుపక్కలవారికి కూడా. తమ్ముడి పెనవేసుకుని వెక్కివెక్కి ఏడ్చిన రాజకుమారి తమ్ముడికి, తన కుటుంబానికి దిష్టి తీసి, బొట్టు పెట్టి ఇంట్లోకి తీసుకెళ్లింది. మరదలిని దగ్గరకు తీసుకుంది. మేనళ్లులను ఎత్తుకుని ముద్దులు కురిపించింది. ఎప్పుడో పద్దెనిమిదేళ్ల క్రితం మాయమైన ఆనందం ఆ యింటికి తిరిగివచ్చింది.

ఈ ఆనంద గాథలో విరిగిన పన్నుతో పాటు, ఇన్​స్టాగ్రామ్​ పాత్ర కూడా ఉండటం విశేషం.

 

 

Latest News