iPad Pro 2024 : అత్యంత శక్తివంతమైన ఐప్యాడ్​ ప్రొ వచ్చేసింది..!

యాపిల్​ ఐప్యాడ్(Apple iPad)​. ట్యాబ్లెట్ల రంగంలో తిరుగులేని రారాజు. అసలు ట్యాబ్​ను ఇలా వాడొచ్చని చూపించిందే యాపిల్​. ఐప్యాడ్​ను రకరకాల సైజులలో, రకరకాల ఫీచర్లతో ఎప్పటికప్పుడు అప్​డేట్​ చేసుకుంటూ అత్యంత ఆధునికంగా తీసుకురావడం యాపిల్​ ప్రత్యేకత. ఈసారి ఆ ప్రత్యేకత మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఐప్యాడ్​ ప్రొను విడుదల చేసింది.

  • Publish Date - May 12, 2024 / 09:17 PM IST

క్యుపర్టినో కంపెనీ, యాపిల్​ చడీచప్పుడూ లేకుండా సంచలనం సృష్టించింది. తన సరికొత్త ఐప్యాడ్​ ప్రొ(iPad Pro 2024), ఐప్యాడ్​ ఎయిర్(iPad Air 2024)​ మాడళ్లను పరిచయం చేసింది. ఈ రెండు ఐప్యాడ్లు 11 అంగుళాలు, 13 అంగుళాల సైజులో లభిస్తాయి. ఈ నెల 15నుండి మార్కెట్లో లభ్యమవుతాయి.

లెట్​ లూస్​(LET LOOSE) అనే కాన్సెప్ట్​తో ఈవెంట్​ చేసిన యాపిల్​, తన కొత్త ఐప్యాడ్లను ప్రపంచానికి చూపించింది. కొత్త ఐప్యాడ్​ ప్రొ, 2022 దాని కంటే ఎంతో సన్నగా, చాలా అందంగా ఉంది. ఓఎల్​ఈడీ డిస్​ప్లే, యాపిల్​ ఎం4 చిప్​లతో ఇది అత్యంత శక్తివంతంగా తయారైంది. ముఖ్యంగా ఎం4 చిప్(M4 chip)​ పనితనం కంటే, దాని కృత్రిమ మేధ సామర్థ్యం చాలా ఆకర్షణీయంగా ఉంది.

మరీ ముఖ్యంగా ఐప్యాడ్​ ప్రొను ఐప్యాడ్​ ప్రొ ఎయిర్​ అని పిలవొచ్చు. అంత సన్నగా, తేలికగా ఉంది. కొత్త ఓఎల్​ఈడీ డిస్​ప్లే కూడా మంచి కాంట్రాస్ట్​ రేషియోతో స్టన్నింగ్​గా ఉంది. యాపిల్​ ఈ ఐప్యాడ్​ గురించి చెప్పినట్లుగా ఇది మునుపెన్నడూ చూడని బెస్ట్​ ట్యాబ్లెట్​గా ఒప్పుకోవచ్చు.

11 అంగుళాల ఐప్యాడ్​ ప్రొ(iPad Pro 11 inches) ధర రూ.99,900 నుండి మొదలవుతుండగా, 13అంగుళాల ప్రొ(iPad Pro 13 inches) ధర రూ.1,29,900 నుండి మొదలవుతోంది. టాప్​ ఎండ్​ మాడళ్ల ధర 11 ఇంచ్​ రూ.2,29,900 కాగా, 13 ఇంచ్​ రూ. 2,59,900గా ఉంది. ఈ 13 అంగుళాల మాడల్​ దాదాపు మ్యాక్​బుక్​ ప్రొతో సమానంగా, గట్టిగా చెప్పాలంటే ఇంకా ఎక్కువ సామర్థ్యం కలది.

ఈ రెండు ఐప్యాడ్ల లక్షణాలు, ప్రత్యేకతలు చూద్దాం.

ఐప్యాడ్​ ప్రొ‌‌ 11 : డిస్​ప్లే ‌‌– 11ఇంచ్​ టాండెమ్​ ఒఎల్​ఈడీ, రంగులు– సిల్వర్​, స్పేస్​బ్లాక్​, చిప్​ – ఎం4(9 సిపియు, 11జిపియూ కోర్లు), స్టోరేజి – 256, 512జిబి, 1, 2టిబి , కెమెరా– 12ఎంపీ ముందు,వెనుక, వైర్​లెస్​– వైఫై6ఈ, 5జి, కొలతలు– 9.83 6.99 0.21 అంగుళాలు, బరువు–0.98 పౌండ్లు(445 గ్రా).

ఐప్యాడ్​ ప్రొ‌‌ 13 : డిస్​ప్లే ‌‌– 13ఇంచ్​ టాండెమ్​ ఒఎల్​ఈడీ, రంగులు– సిల్వర్​, స్పేస్​బ్లాక్​, చిప్​ – ఎం4(9 సిపియు, 11జిపియూ కోర్లు), స్టోరేజి – 256, 512జిబి, 1, 2టిబి , కెమెరా– 12ఎంపీ ముందు,వెనుక, వైర్​లెస్​– వైఫై6ఈ, 5జి, కొలతలు– 11.09 8.48 0.2 అంగుళాలు, బరువు–1.28 పౌండ్లు(580 గ్రా).

ఈ ఐప్యాడ్​ ప్రొ ప్రత్యేకతల్లో ఎం4 చిప్​తో పాటు అల్ట్రా రెటీనా ఎక్స్​డీఆర్​ డిస్​ప్లే(Ultra Retina XDR Display) ఇవ్వడం చాలా ఆశ్యర్యకరం. ఈ డిస్​ప్లే రంగులను అత్యంత నాణ్యతతో చూపడంతో పాటు ఎంతో దేదీప్యమానంగా ఉంటుంది. 10కోర్​ సిపియు, 10కోర్​ జిపియుతో ఎం4 చిప్​ చాలా శక్తవంతంగా పనిచేస్తోంది. ఎంతో పెద్ద గేమ్స్​, అప్లికేషన్లు కూడా అలవోకగా రన్​ అవుతున్నాయి. దీని ఏఐ సామర్థ్యం తన న్యూరల్​ ఇంజన్​( న్యూరల్​ ప్రాసెసింగ్​ యూనిట్ NPU​) తో అర్థమవుతుంది. ఇది 38 టాప్స్TOPS​ (ట్రిలియన్​ ఆపరేషన్స్​ పర్​ సెకండ్​) వేగంతో పనిచేయగలదు. ఈ వేగంతో పనిచేయగల ల్యాప్​టాపే ఇప్పటివరకు లేదు.

ఈ ఐప్యాడ్​లతో పాటు యాపిల్​ ఐప్యాడ్​ మ్యాజిక్​ కీబోర్డ్​(Apple Magic Keyboard for iPad Pro)ను, యాపిల్​ పెన్సిల్​ ప్రొ(Apple Pencil Pro)ను కూడా విడుదల చేసింది. ఇవి రెండు కూడా మరింత నాజూగ్గా, మరిన్ని ప్రత్యేకతలతో రూపొందాయి. వీటిని కొత్త ఐప్యాడ్​ ప్రొకు జత చేస్తే, మనం ఒక ఎం4 మ్యాక్​బుక్​ ప్రొను తయారుచేసినట్లే.

Latest News