Axiom-4 |అంతరిక్ష ప్రయోగాల్లో తనదైన శైలితో దూసుకుపోతున్న భారత్.. ఆ ప్రయాణంలో కీలక ముందడుగు వేసింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా.. తన తొలి, భారతీయుల రెండవ అంతరిక్ష యాత్రకు వెళ్లాడు. ఫ్లారిడాలోని నాసా అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్‌లోని స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్‌లో శుభాంశు కూడా ఉన్నాడు. స్పేస్ సెంటర్ లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి ఈ రాకెట్ బయల్దేరింది. 1969లో చంద్రునిపైకి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ బయల్దేరిన అపోలో 11 కూడా ఇదే లాంచ్ ప్యాడ్ నుంచి వెళ్లటం విశేషం.
1984లో వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ నాటి సోవియట్ రష్యా మిషన్‌లో భాగంగా రోదసిలోకి వెళ్లాడు. మళ్లీ నాలుగు దశాబ్దాల తర్వాత గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఈ ఘనత సాధించాడు. అంతరిక్ష ప్రయాణం నేపథ్యంలో ఆరోగ్యంగా ఉండే క్రమంలో ఆయన నెలరోజులకు పైగా క్వారంటైన్‌లో ఉన్నారు. మిషన్ పైలట్‌గా వ్యవహరిస్తున్న శుక్లాతోపాటు.. అంతరిక్ష నిపుణులు పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్‌స్కీ-విస్నియెస్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు, యుఎస్‌కు చెందిన కమాండర్ పెగ్గీ విట్సన్ ఈ అంతరిక్ష నౌకలో ఉన్నారు.
ఆక్సియం 4 మిషన్‌లో భాగంగా ఈ నలుగురు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళుతున్నారు. పదిహేను రోజులపాటు సాగే ఈ మిషన్‌లో ఈ బృందం సుమారు 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నది. వాటిలో ఏడింటిని భారత పరిశోధుకులు ప్రతిపాదించారు. అంతరిక్షం నుంచి ఒక వీఐపీతో శుక్లా సంభాషించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. సాధారణంగా భారతదేశంలోని వీఐపీ అనగానే మొదట గుర్తుకు వచ్చేది ప్రధాన మంత్రి నరేంద్రమోదీ. దీంతో.. ఆ వీఐపీ మోదీయే అయి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆక్సియం 4 మిషన్ వాతావరణ ప్రతికూల పరిస్థితులు, సాంకేతిక లోపాల కారణంగా అనేక సార్లు వాయిదా పడింది. ఇప్పుడు బయల్దేరిన జూన్ 25.. నాసా ప్రకటించిన ఆరో తేదీ. సుమారు 28 గంటలపాటు కక్ష్య ప్రయాణం తర్వాత ఆక్సియం 4 మిషన్ భారతీయ కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోకి వెళ్లనున్నారు.
ఇటీవల మీడియాతో మాట్లాడిన గ్రూప్ కెప్టెన్ శుక్లా.. తాను సాధనాలు, పరికరాలు మాత్రమే తీసుకొని వెళ్లడం లేదని, కోట్ల హృదయాల ఆశలు, కలలను తనతో తీసుకువెళుతున్నానని చెప్పారు. తన చరిత్రాత్మక ప్రయాణానికి కొన్ని గంటల ముందు తన కుటుంబానికి ఒక సందేశం పంపిన శుక్లా.. ‘నాకోసం చూస్తూ ఉండండి.. నేను వచ్చేస్తున్నాను..’ అని పేర్కొన్నారు.