Site icon vidhaatha

2024 YR4 | అంచనాకు మించిన పరిమాణంతో దూసుకొస్తున్న సిటీ – డెస్ట్రాయింగ్‌ ఆస్టరాయిడ్‌.. భూమికి ముప్పు ఉందా?

2024 YR4 | 2032లో భూమి, చంద్రునికి సమీపంగా వస్తుందని భావిస్తున్న సిటీ డెస్ట్రాయింగ్‌ ఆస్టరాయిడ్‌ ఊహించినదానికన్నా ఎక్కువ పరిమాణంలో ఉన్నదని శాస్త్రవేత్తలు (Scientists) చెబుతున్నారు. పెను ఉత్పాతాన్ని సృష్టించగల ఈ గ్రహశకలం విషయంలో తమ అంచనాలను సవరించే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. భూమి విషయంలో భద్రంగానే ఉన్నా.. చంద్రుడి విషయంలో కొంత ముప్పు తలెత్తే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 2024 YR4గా గుర్తించిన ఈ ఆస్టరాయిడ్‌.. గతంలో ఊహించిన పరిణామం కంటే పెద్దదిగా ఉన్నదని జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ (JWST) ద్వారా అంచనా వేశారు. తొలుత 2024 YR4 40 మీటర్ల వ్యాసం (131 అడుగులు)తో ఉన్నదని భూమిపై నుంచి వేసిన అంచనాలో లెక్కగట్టారు. అయితే.. ఈ గ్రహశకలం.. వాస్తవానికి సుమారుగా 60 మీటర్ల వ్యాసంతో (200 అడుగులు) ఉన్నదని తాజాగా అంచనా వేసినట్టు డైలీ మెయిల్‌ ఒక కథనంలో పేర్కొన్నది. అంటే.. 15 అంతస్తుల భవంతి అంత ఉంటుదన్నమాట. ఇంతటి పరిమాణంలో ఉన్న ఆస్టరాయిడ్‌ భూమిని తాకితే హిరోషిమాపై వదిలిన అణు బాంబు సృష్టించిన విధ్వంసానికి 500 రెట్లు పేలుడు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

గత ఏడాది డిసెంబర్‌లో ఈ ఆస్టరాయిడ్‌ను గుర్తించారు. తొలుత ఇది భూమిని ఢీకొనేందుకు 3.1 శాతం అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. సంతోషకరమైన వార్తేంటంటే.. 2024 YR4 భూమిని తాకే అవకాశాలు లేవని NASA ప్రకటించడం. అయితే.. చంద్రునికి మాత్రం కొంత ప్రమాదం పొంచి ఉన్నట్టు JWST పరిశీలన ద్వారా తెలుస్తున్నదని డైలీ మెయిల్‌ కథనం పేర్కొంటున్నది. పెద్ద భవంతి సైజులో ఉన్న ఈ ఆస్టరాయిడ్‌ చంద్రుడిని ఢీకొనే అవకాశాలు 2 శాతం ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. భూమిపై ఉన్న టెలిస్కోప్‌లు ఈ గ్రహశకలం పరిమాణంపై అంచనాలు వేసినా.. అవన్నీ దానిపై ఉన్న కాంతిని ఆధారం చేసుకుని అందాజుగా వేసినవే. ఒక ఆస్టరాయిడ్‌ ఎంత కాంతివంతంగా ఉంటే అంత పెద్దదని అర్థమని, అదికూడా ఆస్టరాయిడ్‌ ఉపరితలం ఎలా ప్రతిఫలిస్తున్నదనే అంశంతో సంబంధం ఉంటుందని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ తన బ్లాగులో రాసింది. ఆ గ్రహశకలం ద్వారా వెలువడే వేడిని పరారుణ వికిరణం (infrared radiation) రూపంలో కొలిచే పరికరాన్ని ఉపయోగించి, ఈ సమస్యలను JWST అధిగమించింది. మార్చి 26వ తేదీన దాదాపు 5 గంటలు వెచ్చించిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌.. అంతరిక్షంలో ఆస్టరాయిడ్‌ రొటేట్‌ అవుతున్న తీరును రికార్డు చేసింది. అది సేకరించిన ఇన్‌ఫ్రారెడ్‌ డాటా ప్రకారం.. 2024 YR4.. ఏడు మీటర్లు అటూఇటూగా 60 మీటర్ల డయామీటర్‌ను కలిగి ఉన్నట్టు, ప్రతి 20 నిమిషాలకు ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతున్నట్టు గుర్తించింది.

Exit mobile version