- ఫోటానిక్ రాడార్‌తో విప్లవాత్మక సాంకేతికత
- ఏ గుప్త క్షిపణి, విమానం, డ్రోన్ కూడా తప్పించుకోలేదు
- డిఆర్డిఓ0తో భవిష్యత్ సమర సాంకేతికతలు
విధాత సైన్స్ డెస్క్: భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) సైనిక సాంకేతిక రంగంలో మరో మైలురాయిగా నిలిచే కీలక విజ్ఞానాన్ని ప్రకటించింది. తొలిసారిగా భారత్ ఫోటానిక్రాడార్ను అభివృద్ధి చేసింది. ఇది సాధారణ రేడియో తరంగాల ఆధారిత రాడార్‌లకు భిన్నంగా, కాంతి ఆధారిత తరంగాలను ఉపయోగించి శత్రు లక్ష్యాలను గుర్తించే సాంకేతికత. దీంతో భారత్ రక్షణ రంగంలో సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టింది.
ఈ రాడార్‌ను అభివృద్ధి చేసింది భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO)లోని ప్రముఖ సంస్థ ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (LRDE), బెంగళూరు. ఇదే సంస్థ “ఉత్తమ్ AESA”, “అరుధ్ర”, “అశ్లేష” వంటి అత్యాధునిక రాడార్‌లను గతంలో కూడా రూపొందించింది.
ఫోటానిక్ రాడార్ అంటే ఏమిటి?
స్టెల్త్ ఫైటర్లు, డ్రోన్లు వంటి శత్రు లక్ష్యాలు రెగ్యులర్ రాడార్‌లకు చిక్కకుండా ఉండేలా రూపొందిస్తారు. అయితే ఫోటానిక్రాడార్ వాటిని కనుగొనగలిగే సామర్థ్యం కలిగి ఉంది. “ఇది బ్లరి కెమెరా నుంచి 4K కెమెరాకు వెళ్లినంత తేడా,” అని విమానిక రంగ నిపుణురాలు రియా మల్హోత్రా అభివర్ణించారు.
సంప్రదాయ రాడార్ సిస్టమ్స్ రేడియో తరంగాలను పంపి, ప్రతిధ్వనిని విశ్లేషిస్తాయి. కానీ గుప్త సాంకేతికత (స్టెల్త్ టెక్నాలజీ) అనేది ఈ రేడియో తరంగాలను శోషించగలిగేలా లేదా ఎక్కడికైనా మళ్లించేలా రూపొందించబడింది. అందువల్ల, వీటిని కనుగొనడానికి సాధారణ రాడార్‌లకు సాధ్యం కాదు. ఫోటానిక్రాడార్లో కాంతి ఆధారిత తరంగాలను వాడతారు. ఇది విద్యుత్ తరరంగాలను కాంతి తరంగాలుగా మారుస్తుంది. తరువాత వాటిని ఆప్టికల్ ఫైబర్, లేజర్ మాడ్యూల్స్ ద్వారా పంపిస్తుంది. తిరిగి వచ్చిన సిగ్నల్స్‌ను అత్యంత వేగవంతమైన ఆప్టికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా విశ్లేషిస్తుంది. ఇది చాలా అధిక రిజల్యూషన్ ఫలితాలను ఇస్తుంది. ఈ రాడార్‌ను జామ్ చేయడం కూడా అసాధ్యమే. ఫలితంగా గుప్త సాంకేతికత కలిగిన డ్రోన్లు, మిస్సైళ్లను కూడా దీని ద్వారా గుర్తించవచ్చు. శత్రు విమానాల రాడార్ క్రాస్ సెక్షన్ చాలా తక్కువగా ఉన్నా, దీని సాయంతో తేలికగా గుర్తించవచ్చు.
DRDO 2.0: భవిష్యత్ యుద్ధాల దిశగా కొత్త వ్యూహం
డిఆర్డిఓ (Defence Research and Development Organisation) తాజా వ్యూహంలో భాగంగా “DRDO 2.0” మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రామాణిక ఆయుధాల అభివృద్ధిని ప్రైవేట్ రంగానికి అప్పగించి, సంస్థ దృష్టిని భవిష్యత్ యుద్ధ సాంకేతికతపై కేంద్రీకరించింది. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్, క్వాంటమ్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది.
DRDO డైరెక్టర్ జనరల్ డాక్టర్ బీకే దాస్ చెప్పినదాని ప్రకారం, ఇప్పటికే 2 కిలోవాట్ల లేజర్ ఆధారిత యాంటీ డ్రోన్ ప్లాట్‌ఫారమ్‌ను విజయవంతంగా ప్రయోగించారు. త్వరలోనే 30 కిలోవాట్ల శక్తి కలిగిన లేజర్ ఆయుధాన్ని టెస్ట్ చేయనున్నారు., రాబోయే యుద్ధాలు సంప్రదాయ ఆయుధాలతో కాదు, టెక్నాలజీ ఆధారితంగా జరుగుతాయి. అందుకే DRDO ప్రధానంగా స్ట్రాటజిక్ ఫ్యూచర్ టెక్నాలజీలపై దృష్టి పెడుతోంది.
DRDO 2.0 సాంకేతిక ఆయుధాలు – భవిష్యత్ యుద్ధాలకు భారత్ అస్త్రశక్తి
Directed Energy Weapons (DEWs)
→ హై-పవర్ లేజర్ ఆయుధాలు, మైక్రోవేవ్ బీమ్‌లను ఉపయోగించి డ్రోన్లు, మిస్సైల్స్‌ను సమర్థవంతంగా తుప్పించగల ఆయుధాలు.
→ ఇప్పటికే 2 కిలోవాట్ & 30 కిలోవాట్ లేజర్ సిస్టమ్‌లను DRDO అభివృద్ధి చేసింది.
Photonic Radar
→ స్టెల్త్ లక్ష్యాల కోసం కొత్త తరహా రాడార్ టెక్నాలజీ. ఇప్పటికే అభివృద్ధి పూర్తి. 2025 చివర్లో ప్రయోగాలు.
Quantum Technologies
→ క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థల అభివృద్ధి. హ్యాకింగ్‌కి ఎటువంటి అవకాశం లేకుండా భద్రత.
Artificial Intelligence & Machine Learning
→ యుద్ధస్థితిని అంచనా వేసే, స్వయం నిర్ణయాలు తీసుకునే రక్షణ వ్యవస్థలు. AI ఆధారిత డ్రోన్లు, మిస్సైల్ లక్ష్య నిర్ణయం, బాటిల్ మేనేజ్‌మెంట్.
Cognitive Radar Systems
→ వాతావరణాన్ని, కదులుతున్న శత్రు ఆయుధాలను గుర్తించి స్వయంగా ట్యూన్ అయ్యే ‘స్మార్ట్ రాడార్‌లు(Smart Radars)’.
D4 Platform (Anti-Drone System)
→ హై-స్పీడ్ డ్రోన్‌లను టార్గెట్ చేసే మల్టీ లేయర్ ప్లాట్‌ఫారమ్. ఇప్పటికే ఆపరేషన్ సిండూర్ సమయంలో విజయవంతంగా ఉపయోగించారు.
Swarm Drones & Autonomous Combat Vehicles
→ అనేక డ్రోన్లను సమన్వయంతో టార్గెట్ చేసే స్వార్మ్ టెక్నాలజీ. అలాగే AI ఆధారిత ట్యాంకులు, జవాన్లు లేకుండా నడిచే యుద్ధ వాహనాలు.
ఫోటానిక్ రాడార్ ప్రయోగాలు 2025 చివర్లో
DRDO తాజా ఫోటానిక్ రాడార్ 2025 చివరిలో ప్రయోగ దశలోకి ప్రవేశించనుంది. డ్రోన్ల పైలట్లతో, స్టెల్త్ లక్ష్యాల సిమ్యులేషన్‌తో అనేక వాతావరణ పరిస్థితుల్లో ఈ వ్యవస్థను పరీక్షించనున్నారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతే, భారత వాయుసేనకు కొత్త దిశలో శత్రు ముప్పులను ముందుగానే గుర్తించే శక్తి లభించనుంది.
చైనా, పాకిస్థాన్లకు నిద్రలేని రాత్రులు
ఈ రాడార్ అభివృద్ధితో భారత్ గుప్త సాంకేతికత (Stealth Technology) ఆధారిత ముప్పులను సమర్థంగా ఎదుర్కోవచ్చు. ఇది దక్షిణాసియాలో భారత్‌కు వ్యూహాత్మక ఆధిపత్యాన్ని కలిగించనుంది. ఫోటానిక్రాడార్ అభివృద్ధి ద్వారా DRDO ప్రపంచ యుద్ధ సాంకేతిక రంగంలో ముందంజ వేసిందనే చెప్పాలి. ఈ రాడార్ అభివృద్ధి వల్ల చైనా, పాకిస్థాన్‌ల వంటి శత్రు దేశాలు తమ ప్రయోగాలను ఇక గుప్తంగా చేయలేవు. ఎందుకంటే స్టెల్త్ డిజైన్లు ప్రధానంగా రేడియో తరంగాలు చేరుకునే ఎత్తులపై ఆధారపడి ఉంటాయి. కాని ఫోటానిక్తరంగాలు, అంటే కాంతి ఆధారిత సిగ్నల్స్‌ను పూర్తిగా అడ్డుకునే సాంకేతికత ఇప్పటి వరకు అభివృద్ధి కాలేదు. అంతేకాకుండా, ఇవి వాతావరణ ప్రభావాలకు తక్కువగా లోనవుతాయి. వర్షం, మేఘాలు, తక్కువ వీచే గాలులు – ఇవేమీ ఫోటానిక్రాడార్ను ప్రభావితం చేయలేవు.
ప్రయోగాలు, ఉత్పత్తి & ప్రైవేట్ రంగం భాగస్వామ్యం
ఫోటానిక్ రాడార్ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. 2025 చివరినాటికి దీని పైలట్ ట్రయల్స్ జరగనున్నాయి. స్టెల్త్ డ్రోన్లు, లో-విజిబిలిటీ లక్ష్యాలపై ప్రయోగాలు జరగనున్నాయి. ఈ టెక్నాలజీ ఉత్పత్తికి ప్రైవేట్ రంగ సంస్థలను భాగస్వాములుగా తీసుకుంటూ, DRDO DCPP (Develop Cum Production Partner) మోడల్‌ను తీసుకువచ్చింది. ఈ రాడార్ ద్వారా, భవిష్యత్‌లో క్షిపణి రక్షణ వ్యవస్థలు, అంతరిక్ష నుండి వచ్చే లక్ష్యాల గుర్తింపు, నౌకాదళాల మార్గదర్శనం వంటి అనేక రంగాల్లో విస్తృతంగా ఉపయోగపడనుంది. ఫోటానిక్ టెక్నాలజీతో రాబోయే దశాబ్దాల్లో భారత్ ఒక ప్రపంచ రక్షణ ఆవిష్కరణ కేంద్రంగా మారే అవకాశముంది. ఈ విధంగా, శాస్త్రీయ పరిశోధనను DRDO ముందుకు తీసుకెళ్తే, ఉత్పత్తిని ప్రైవేట్ రంగం వేగంగా చేయగలదు. దీని వల్ల రక్షణ రంగం దేశీయంగా బలోపేతం అవుతుంది.