Hacker vs Scammer | మోసగాళ్లకు మొనగాడు : హ్యాకర్​ను హ్యాక్​ చేసిన హ్యాకర్​

ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలీలో మైక్రోసాఫ్ట్​ టెక్ సపోర్ట్ పేరిట సైబర్​ మోసాలు చేస్తున్న వ్యక్తి గుట్టును ఒక ఎథికల్​ హ్యాకర్ వెబ్‌క్యామ్ ద్వారా లైవ్‌లో రట్టు చేశాడు. ఆధారాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

రాయ్బరేలీ (ఉత్తరప్రదేశ్) : Hacker vs Scammer |  కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లు, మైక్రోసాఫ్ట్ టెక్ సపోర్ట్ పేరిట అమాయకులను మోసం చేస్తున్న ఒక స్కామ్‌ ఆపరేషన్‌ ఇంకో హ్యాకర్ చేతిలో బహిర్గతమైంది. రాయ్‌బరేలీకి చెందిన గౌరవ్ త్రివేది అనే హ్యాకర్​ తన అపార్ట్​మెంట్‌లో ఈ నకిలీ టెక్ సపోర్ట్ రాకెట్ నడుపుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

సైబర్ సెక్యూరిటీ ఔత్సాహికుడు, NanoBaiter అనే X యూజర్, త్రివేది ల్యాప్‌టాప్‌ను హ్యాక్ చేసి, అతని వెబ్‌క్యామ్‌ను ఆన్ చేసి, లైవ్ ఫీడ్‌తో సహా అతని కార్యకలాపాలను బయటపెట్టాడు. “అతను Microsoft టెక్​ సపోర్ట్ అని చెప్పి నన్ను మోసం చేయాలనుకున్నాడు. కానీ బదులుగా, నేను అతని ల్యాప్‌టాప్‌లోకి హాక్ చేసి, వెబ్‌క్యామ్ ఆన్ చేసి లైవ్‌లో పట్టేశా,” అని NanoBaiter పోస్ట్ చేశాడు.

స్కామ్ ఎలా డిపాడు?

ఈ మోసం ఒక కిలీ పాప్అప్ అలర్ట్తో మొదలవుతుంది. స్క్రీన్‌ లాక్ అయ్యి, పెద్ద శబ్దాలు వస్తూ, “మీ డేటా కోల్పోతారు, వెంటనే Microsoft‌కు కాల్ చేయండి” అని బాధితులను బెదిరిస్తారు. బాధితులు కాల్ చేస్తే, మోసగాళ్లు AnyDesk లేదా TeamViewer వంటి రిమోట్ డెస్క్​టాప్​ యాక్సెస్ టూల్స్ ఉపయోగించి డేటా లేదా డబ్బు దోచుకుంటారు.

హ్యాకర్ కౌంటర్ యాక్షన్

NanoBaiter తన వర్చువల్ మెషీన్ ఉపయోగించి త్రివేది సిస్టమ్‌లోకి ప్రవేశించాడు. అతని ల్యాప్‌టాప్ Wi-Fi కార్డ్ ద్వారా లొకేషన్ ట్రేస్ చేసి, వెబ్‌క్యామ్​ను ఆన్​ చేసాడు. ఇక అప్పటినుండి త్రివేది  తనకు తెలియకుండానే లైవ్​లోకి వచ్చేసాడు.  ఫీడ్‌లో అతని ముఖం, నివాసం అన్నీ బయటపడ్డాయి. వీడియోల్లో త్రివేది తన అపార్ట్మెంట్‌లో తినటం, నిద్రపోవటం, స్కామ్‌లు నడిపించటం అన్నీ  ఈ NanoBaiter రికార్డ్ చేశాడు.

పోలీసులు రంగంలోకి

ఈ ఆధారాలను ఆన్‌లైన్‌లో షేర్ చేసిన తర్వాత, NanoBaiter రాయ్‌బరేలీ పోలీసులను కూడా ట్యాగ్ చేశాడు. పోలీసులు స్పందిస్తూ, సైబర్ పోలీస్ స్టేషన్ అధికారి దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాం అని ప్రకటించారు.

సోషల్ మీడియా రియాక్షన్

ఈ అసాధారణ ట్విస్ట్‌ నెట్‌లో వైరల్ అయింది.

మొత్తానికి తాడిని తన్నేవాడుంటే, వాడి తలదన్నేవాడుంటాడనే సామెత మరోసారి రుజువయింది. సైబర్​ మోసాలతో ప్రపంచం అల్లాడుతుంటే, ఈ NanoBaiter లాంటి వారు వాటి భరతం పట్టేందుకు నడుం బిగించడం అభినందనీయం.