GSLVF-16 | నింగిలోకి దూసుకెళ్లిన GSLVF-16

అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక విజయాన్ని సాధించింది. ‘నాసా, ఇస్రో సింథటిక్‌ ఎపెర్చర్‌ రాడార్‌’ (నైసార్) భూపరిశీలన ఉపగ్రహం ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌16 వాహక నౌక.. 2,393 కిలోల బరువున్న ‘నైసార్‌’ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది

GSLVF-16 | అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక విజయాన్ని సాధించింది. ‘నాసా, ఇస్రో సింథటిక్‌ ఎపెర్చర్‌ రాడార్‌’ (నైసార్) భూపరిశీలన ఉపగ్రహం ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌16 వాహక నౌక.. 2,393 కిలోల బరువున్న ‘నైసార్‌’ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఉపగ్రహం ప్రయోగం విజయవంతం కాగానే ఇస్రో శాస్త్రవేత్తలు హర్షద్వానాలతో సంబరాలు జరుపుకున్నారు.

అంతరిక్షంలోకి ఇప్పటివరకు చేర్చిన అత్యంత శక్తిమంతమైన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్లలో ఇది ఒకటి కావడం గమనార్హం. ఇస్రో-నాసా సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టు తొలి ఉపగ్రహం ఇదే కావడం విశేషం. 2014లో నైసార్ మిషన్‌కు పునాదిరాయి పడగా..ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.11,200 కోట్లకు చేరింది. అత్యంత ఖరీదైన ఉపగ్రహంగా నైసార్ నిలిచింది. రెండు సింథటిక్‌ అపర్చర్‌ రాడార్లు (సార్‌) అమర్చిన తొలి ఉపగ్రహం ఇదే. విపత్తులపై విస్పష్ట హెచ్చరికల సమాచారాన్ని నైసార్ ఉపగ్రహం అందించనుంది.

నైసార్‌ రాడార్లు ప్రతి 12 రోజులకు రెండుసార్లు భూమి మొత్తాన్ని కవర్‌ చేస్తాయి. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ), నాసా (నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ ఉపగ్రహానికి నైసార్‌ (నాసా-ఇస్రో సింథటిక్‌ అపర్చర్‌ రాడార్‌) అని పేరు పెట్టారు.

భారత్‌ అమెరికా అంతరిక్ష సహకారంలో దీనిని తొలి అడుగుగా భావిస్తున్నారు. ఇప్పటికే యాక్సిమ్‌ మిషిన్‌ కింద భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను అమెరికా అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా నైసార్‌ భవిష్యత్తులో ఇచ్చే సమాచారంతో పంటలు, ప్రకృతి విపత్తులు, భూకంపాలు, హరికేన్లను అంచనావేసి.. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావచ్చు. దీని డాటా ఆధారంగా ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంటుందని నాసా వెబ్‌సైట్‌ పేర్కొంది. భూమి లోపల జరిగే మార్పులను అంచనా వేసి సమాచారాన్ని అందించనుంది.

ఇస్రోకు సీఎం అభినందనలు

జీఎస్ఎల్వీ – ఎఫ్ 16 ప్రయోగం విజయవంతమయిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. బుధవారం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి నైసార్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ప్రయోగం విజయవంతమైన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ విజయం భారత అంతరిక్ష పరిశోధన ప్రయాణంలో కీలకమైలురాయిగా నిలిచిపోతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. అమెరికాకు చెందిన నాసాతో సంయుక్తంగా చేపట్టిన ఈ మిషన్ విజయం అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే మహత్తరమైన ఘట్టమని పేర్కొన్నారు. జీఎస్ఎల్వీ – ఎఫ్ 16 ప్రయోగం చారిత్రాత్మక పురోగతికి నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందులో భారతీయ శాస్త్రవేత్తల పనితీరు గర్వకారణమని సీఎం కొనియాడారు.