Telecom tariffs | లోక్‌సభ ఎన్నికల తర్వాత జియో, ఎయిర్‌టెల్ టారిఫ్‌లు పెరిగే ఛాన్స్..!

  • Publish Date - April 10, 2024 / 09:21 AM IST

Telecom tariffs : లోక్‌సభ ఎన్నికల తర్వాత తమ టారిఫ్‌లను సవరించేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ విషయంలో అగ్రగామి సంస్థలైన ఎయిర్‌టెల్‌, జియో ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తమ ప్లాన్‌ ధరలను పెంచడం ద్వారా ఒక యూజర్‌ నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవాలని ఎయిర్‌టెల్‌ (Airtel) భావిస్తోంది. ప్యాకేజీ ధరలు పెంచకుండా డేటా వినియోగాన్ని మరింత పెంచి తద్వారా అధిక ధరలు గల ప్యాకేజీల వైపు వినియోగదారులను మళ్లించాలన్నది జియో (Jio) ఆలోచనగా ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

జియోతో పోలిస్తే ఎయిర్‌టెల్‌ ప్లాన్‌లు ఇప్పటికే కాస్త ఎక్కువగా ఉన్నాయి. ముందు నుంచి ఆ కంపెనీ తన సగటు ఆదాయాన్ని పెంచుకుంటూ వస్తోంది. జియో సగటు ఆదాయం మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌ నడుస్తోంది. దీనివల్ల డేటా వినియోగం పెరుగుతుందని, తద్వారా లాభం పొందొచ్చని జియో భావిస్తోంది. జియో సినిమా ప్రసారాలను యూజర్లకు రిలయన్స్‌ ఉచితంగానే అందిస్తోంది. అయితే వీక్షణ అనుభూతిని మెరుగుపరుచుకోవడం కోసం యూజర్లు అధిక డేటా వెచ్చిస్తారని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనివల్ల టారిఫ్‌ ధరలను పెంచకుండానే అధిక సగటు ఆదాయాన్ని సాధించవచ్చన్నది జియో వ్యూహంగా కనిపిస్తోందని అనలిస్టులు చెబుతున్నారు.

ఎయిర్‌టెల్‌ మాత్రం తన సగటు ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్లాన్ ధరల్లో మార్పును ఎంచుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలు పూర్తవగానే ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. జూలై-అక్టోబర్‌ మధ్య 15 శాతం వరకు టారిఫ్‌లను పెంచవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌ రూ.208గా ఉంది. ఇక జియో యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌ రూ.182 కాగా.. వొడాఫోన్‌ ఐడియా యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌ రూ.145గా ఉంది. మార్కెట్‌ వాటా పరంగా జియో అగ్రగామిగా ఉంది. ఎయిర్‌టెల్‌ రెండో స్థానంలో ఉంది. 18 శాతం వాటాతో వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో కొనసాగుతోంది.

Latest News