Technology news | సూర్యరశ్మిని అంతరిక్షంలోకి తిప్పిపంపి భూతాపాన్ని తగ్గించేందుకు ప్రయత్నం.. కానీ..!

  • Publish Date - April 5, 2024 / 09:02 AM IST

Technology news : భూ వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను సమర్థవంతంగా తగ్గించడానికి, మేఘాలలో మార్పులు తీసుకురావడానికి, సూర్యరశ్మిని తిరిగి అంతరిక్షంలోకి ప్రతిబింబింపజేయడానికి రూపొందించిన సాంకేతికతపై శాస్త్రవేత్తలు తొలిసారి అవుట్‌డోర్‌ ట్రయల్‌ను నిర్వహించారు. శాన్ ఫ్రాన్సిస్కో అఖాతంలో పాలకాలపు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లో ఈ ట్రయల్‌ జరిగింది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అవసరమైన పరిష్కారాల సాధనలో ఇది ఒక మైలురాయిగా చెప్పవచ్చు.

ఈ ట్రయల్‌లో మంచు యంత్రాన్ని పోలిన పరికరం వాతావరణంలోకి సాల్ట్‌ ఏరోసోల్ కణాలతో కూడిన పొగమంచును విడుదల చేసింది. సముద్ర ఉపరితలంపై మేఘాల సహజ లక్షణాలను ఏ మేరకు మార్చగలమనేది అంచనా వేయడానికి ఈ ట్రయల్‌ను నిర్వహించారు. ఈ శాస్త్రవేత్తల బృందం అంతిమ లక్ష్యం ఏమిటంటే మహాసముద్రాల పైన ఉన్న మేఘాల కూర్పును ప్రభావితం చేయడం. ఇలా మేఘాల కూర్పును ప్రభావితం చేయడమనేది సౌర వికిరణం సవరణకు ఒక విధానాన్ని అందిస్తుంది.

అయితే మెరైన్ క్లౌడ్‌ను ప్రకాశవంతం చేసే పద్ధతి వివాదాస్పదంగా మారింది. కానీ ప్రైవేట్ పెట్టుబడిదారులు, ప్రభుత్వ సంస్థలతోపాటు పరిశోధకుల నడుమ సంబంధాలను ఏర్పరిచింది. భూమిపై ఉష్ణోగ్రతలను తగ్గించే ఈ జియో ఇంజనీరింగ్ టెక్నిక్‌లో సముద్రపు ఉప్పు లేదా ఇతర ఏరోసోల్స్ లాంటి చిన్న కణాలను సముద్రం మీదుగా దిగువ వాతావరణంలోకి చల్లుతారు. ఈ కణాలు మేఘాలను ఘనీభవింపజేసే కేంద్రకాలుగా పనిచేస్తాయి. ఇప్పటికే ఉన్న మేఘాలలో పరిమాణంలో చిన్నగా, సంఖ్యలో ఎక్కువగా ఉండే నీటి బిందువుల ఏర్పాటును ప్రోత్సహిస్తాయి.

ఈ నీటి బిందువుల ఫలితంగా మేఘాలు మరింత ప్రకాశవంతమవుతాయి. మరింత ఎక్కువగా ప్రతిబింబిస్తాయి. వాటి ఆల్బెడోను (కాంతి నిష్పత్తిని) సమర్థవంతంగా పెంచుతాయి. సూర్యరశ్మిని తిరిగి అంతరిక్షంలోకి ప్రతిబింబించే సామర్థ్యం పెరుగుతుంది.

ఈ సాంకేతికతపై ఆందోళనలు

అయితే సముద్ర ఉపరితల మేఘాలను ప్రకాశవంతం చేయడం లేదా మరేదైనా ఇతర జియో ఇంజనీరింగ్ విధానాన్ని పెద్దఎత్తున అమలు చేయడానికి ముందు మరింత పరిశోధన, సునిశిత పరిశీలన అవసరమని చాలామంది వాదిస్తున్నారు. సహజ వాతావరణాన్ని సాంకేతిక పద్ధతుల ద్వారా ప్రభావితం చేస్తే సంభవించే అనూహ్య పరిణామాలకు సంబంధించి సందేహాలు, ఆందోళనలు వ్యక్తమవుతుండటమే వారి వాదనకు కారణం.

జియో ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా భూమి వాతావరణాన్ని తారుమారు చేయడ వల్ల అనుకోని పరిణామాలు సంభవిస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ నమూనాలు, పర్యావరణ వ్యవస్థలలో ప్రతికూల మార్పులు చోటుచేసుకోవడం, అవపాతాలు సంభవించడం లాంటివి జరిగే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.

Latest News