Site icon vidhaatha

Super Jupiter | విశ్వంలో బృహస్పతి కంటే పేద్ద గ్రహం.. గుర్తించిన ఖగోళ శాస్త్రవేత్తలు..!

Super Jupiter : ఇన్నాళ్లుగా విశ్వంలో అతిపెద్ద గ్రహం ఏదంటే గురుగ్రహం (బృహస్పతి-Jupiter) అనే మాత్రమే మనకు తెలుసు. కానీ గురుగ్రహం కంటే ఆరింతలు పెద్ద గ్రహాన్ని ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీని ద్వారా అంతరిక్ష పరిశోధనలో మరో కీలక ముందడుగు వేశారు. నాసాకు చెందిన జేమ్స్ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ (James Webb Space Telescope) విశ్వంలో జూపిటర్ కంటే పెద్దదైన సూపర్ జూపిటర్ (Super Jupiter) గ్రహాన్ని గుర్తించింది. ఇది గురు గ్రహం కంటే 6 రెట్లు పెద్దదని పరిశోధకులు తెలిపారు.

ఈ పరిశోదన చేపట్టిన అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందంలో ఐఐటీ కాన్పూర్‌కు చెందిన డాక్టర్ ప్రశాంత్ పాఠక్‌ కూడా ఉన్నారు. కొత్త గ్రహానికి ఎప్సిలాన్ ఇండి అబ్ (Eps Ind Ab) అని పేరు పెట్టారు. ఇది మన సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలకంటే చాలా పెద్దది. జూపిటర్‌ కంటే పెద్దది కాబట్టి దీన్ని ప్రస్తుతం ‘సూపర్-జూపిటర్’ అని పిలుస్తున్నారు. డైరెక్ట్ ఇమేజింగ్ టెక్నిక్‌ను ఉపయోగించి కనుగొన్న మొదటి మెచ్యూర్‌ ఎక్సో ప్లానెట్ (సౌర వ్యవస్థ వెలుపల ఉన్న గ్రహం) ఇది.

చల్లగా ఉండే ఈ గ్రహం గుట్టును విప్పడానికి సైంటిస్టులు మరిన్ని పరిశోధనలు చేయనున్నారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST), దాని మిడ్-ఇన్‌ఫ్రారెడ్ ఇన్‌స్ట్రుమెంట్ (MIRI) ను ఉపయోగించి ఈ గ్రహాన్ని కనిపెట్టారు. ఈ గ్రహం మనకు 12 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఎప్సిలాన్ ఇండి ఎ నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. పరిశోధనలో డైరెక్ట్ ఇమేజింగ్ కీలక మైలురాయిగా నిలువనుంది. దీని సాయంతో ఎక్సోప్లానెట్‌ని డీటైల్డ్‌గా స్టడీ చేయవచ్చు. JWST హై సెన్సిటివిటీ, ఇన్‌ఫ్రార్డ్‌ కేపబిలిటీస్ కూడా పరిశోధనలో కీలక పాత్ర పోషించనున్నాయి.

ఈ ఎప్సిలాన్ ఇండి అబ్ (Eps Ind Ab) ప్లానెట్‌ చాలా చల్లగా ఉంటుంది. దీనిపై ఉష్ణోగ్రత -1°C (30°F) గా పేర్కొన్నారు. దీని కక్ష్య చాలా పెద్దగా ఉంది. భూమి, సూర్యుని మధ్య దూరం కంటే 28 రెట్లు ఎక్కువ దూర కక్ష్యలో ఇది నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. మన సౌర వ్యవస్థలో ఉన్న వాటి కంటే చాలా భిన్నమైన ఈ గ్రహాన్ని శాస్త్రవేత్తలు అధ్యయనం చేయనున్నారు. ప్రతిష్టాత్మక సైన్స్ జర్నల్ నేచర్‌లో ఈ పరిశోధన పబ్లిష్‌ అయ్యింది. జర్మనీలోని మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రానమీ సైంటిస్ట్ ఎలిజబెత్‌ మాథ్యూస్‌ ఈ రిసెర్చ్‌కు నాయకత్వం వహించారు.

మునుపటి అధ్యయనాలు కూడా ఈ గ్రహాన్ని గుర్తించాయని, అయితే దాని ద్రవ్యరాశి, కక్ష్యను తక్కువగా అంచనా వేశామని ఎలిజబెత్‌ పేర్కొన్నారు. ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ ఎక్సోప్లానెట్ రిసెర్చ్‌లో ఈ డిస్కవరీ ప్రాముఖ్యతను హైలైట్‌ చేశారు. సమీపంలోని గ్రహాన్ని నేరుగా ఇమేజింగ్ చేయడం వల్ల ఇన్‌-డెప్త్‌ స్టడీకి అవకాశం ఉంటుందని తెలిపారు. డాక్టర్ ప్రశాంత్ పాఠక్ సేవలు IIT కాన్పూర్ గ్లోబల్‌ కాంట్రిబ్యూషన్స్‌కి నిదర్శనమని పేర్కొన్నారు.

‘Eps Ind Ab ను అధ్యయనం చేయడం వల్ల శాస్త్రవేత్తలు గ్రహాల నిర్మాణం, వాతావరణ కూర్పు, మన సౌర వ్యవస్థ వెలుపల జీవం మనుగడ సాగించే అవకాశాల గురించి మరింత తెలుసుకోవచ్చు. కొత్త గ్రహం వాతావరణం మన సౌర వ్యవస్థలోని గ్రహాల కంటే హై మెటల్‌ కంటెంట్, భిన్నమైన కార్బన్-టు-ఆక్సిజన్ నిష్పత్తి కలిగి ఉన్నట్లు అనిపిస్తోంది’ అని ప్రశాంత్‌ పాఠక్‌ చెప్పారు. ఈ ఆవిష్కరణ ప్రారంభం మాత్రమేనని, గ్రహం వాతావరణం, కెమికల్‌ కంపొజిషన్‌ బాగా అర్థం చేసుకోవాలని, గ్రహం డీటైల్డ్‌ స్పెక్ట్రాను పొందడం తదుపరి లక్ష్యమని తెలిపారు.

Exit mobile version