ఈ ల్యాప్‌టాప్‌ను చూసారా.. అద్దమే..!

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌–2024లో కొన్ని సంచలన ఉత్పత్తులు పదర్శనకు వచ్చాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. ట్రాన్స్‌ప‌రెంట్‌ ల్యాప్‌టాప్‌. అంటే, అద్దం లాంటి ల్యాప్‌టాప్‌.

  • Publish Date - April 13, 2024 / 08:56 PM IST

సాంకేతిక ప్రపంచంలో ప్రతీరోజు ఓ కొత్త ఆవిష్కరణ జరుగుతుంది. సార్ట్‌ఫోన్‌లు, టివీలు, కంప్యూటర్లు, వాహనాలు..ఇలా… ప్రతీ దాంట్లో ఆవిష్కరణలు కొత్త పొంతలు తొక్కుతున్నాయి. ఈమధ్య ఇంకా కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌)వల్ల ఈ కార్యక్రమాలు ఇంకా ఊపందుకున్నాయి. ప్రతీ ఏడాది మొబైల్స్, కంప్యూటర్ల రంగంలో వస్తున్న కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించడానికి ఏర్పడిన వేదికే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్. ఇది ప్రతీ ఏడాది స్పెయిన్లోని బార్సిలోనాలో జరుగుతుంది.

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌–2024లో కొన్ని సంచలన ఉత్పత్తులు పదర్శనకు వచ్చాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. ట్రాన్స్‌ప‌రెంట్‌ ల్యాప్‌టాప్‌. అంటే, అద్దం లాంటి ల్యాప్‌టాప్‌. తెరకు అవతలివైపు ఉన్నది కూడా కనబడుతుందన్నట్లు. దీన్ని తయారుచేసింది లెనోవో. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ రంగంలో పేరొందిన ఈ కంపెనీ ఈ నమూనాను ఎండబ్ల్యూసి–2024లో ప్రదర్శించింది. చూపరులను విశేషంగా ఆకర్షించిన ఈ ల్యాప్‌టాప్‌ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

లెనోవో థింక్‌బుక్‌ ట్రాన్స్‌ప‌రెంట్‌ డిస్‌ప్లే ల్యాప్‌టాప్‌గా పేరు పెట్టుకున్న దీని డిస్‌ప్లే సైజు 17.5 అంగుళాలు. అంచులు లేకుండా ఉన్న దీని తెర 55శాతం పారదర్శకత ప్రదర్శిస్తుంది. అయితే బ్రైట్‌నెట్‌ పెంచినా కొద్దీ ఈ పారదర్శకత తగ్గి పూర్తిగా మామూలు తెరలాగ మారిపోతుంది. అంటే వెనకాల ఉన్నదేది ఇక కనబడదు. జస్ట్ సినిమాల్లో చూసినట్లు ఈ స్క్రీన్ మీద కంప్యూటర్ మ్యాటర్‌తో పాటు వెనకాల‌ ఉన్న మనుషులు, టేబుళ్లు..ఇలా అన్నీ కనబడతాయి. అయితే ఇది ప్రాక్టికల్‌గా వాడటానికి బాగుంటుందా అనే సందేహం ఇప్పుడు వ్యక్తమవుతోంది. వినియోగదారులు దాన్ని వాడేటప్పుడు వెనకాల ఉన్నవన్నీ కనబడితే ఏకాగ్రత తప్పి పని చెడిపోతుందని కొంతమంది ఉద్దేశ్యం.

ఇక కీబోర్డ్ ఉండాల్సిన స్థానంలో ఒక టచ్ ప్యాడ్ ఉంది. కీబోర్డ్ కావాల్సివచ్చినప్పుడు సంబంధిత బటన్ ప్రెస్ చేస్తే, కీబోర్డ్ లేఅవుట్ ఈ ప్యాడ్ మీద ప్రొజెక్ట్ అవుతుంది. అంటే భౌతికంగా కీస్ ఉండవు. ప్యాడ్ మీద వెలుగుతున్న స్క్రీన్ కీబోర్డ్ మీదే టైప్ చేయాల్సిఉంటుంది. అదే ఏదైనా డ్రాయింగ్ వేయాల్సినప్పుడు స్టైలస్ (డిజిటల్‌ పెన్) దగ్గరికి తీసుకురాగానే కీబోర్డ్ అదృశ్యమై ప్యాడ్ మాత్రమే ఉంటుంది. దానిమీద ఇతర ప్యాడ్లలాగే స్టైలస్‌తో బొమ్మలు గీయొచ్చు. ఇది మాత్రం చాలా కష్టమైన విషయంగా సందర్శకులు చెబుతున్నారు. ఒక చదునైన ప్రదేశం మీద టైప్ చేయడమనేది అసంభవమనేది వారి అభిప్రాయం. మనది కూడా అదే అనుకోండి. అయితే ప్రస్తుతం ప్రొటోటైప్‌గా ఉన్న ఈ ల్యాప్‌టాప్‌ పూర్తిగా వాణిజ్యపరంగా తయారుచేసేసరికి చాలా టైమ్ పడుతుంది. చూసినవారందరూ పెదవి విరిచినా, లెనోవో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టామ్ బట్లర్ మాత్రం చాలా నమ్మకంగా ఉన్నాడు. రాబోయే ఐదేళ్లలో ఈ ల్యాప్‌టాప్‌ సంచలనం సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

Latest News