విధాత, హైదరాబాద్ : సినీ నటి సోహానీ కుమారి కాబోయే భర్త సవాయి సింగ్ సూసైడ్ ఘటన సినీ పరిశ్రమంలో కలకలం రేపింది. సోమవారం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న తన ఫ్లాట్ లో ఉరేసుకొని సవాయి సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సవాయి సింగ్ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో తాను చేసిన తప్పులే తనకు ఈ పరిస్థితి రావడానికి కారణమంటూ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. కాబోయే భర్త మరణంతో సోహానీ శోకసంద్రంలో మునిగిపోయింది.
రాజస్థాన్ కి చెందిన నటి సోహానీ- సవాయి సింగ్ గతేడాది జులై నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారి ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళింది. ఎంగేజ్మెంట్ తర్వాత గత కొన్ని నెలలుగా వీరిద్దరూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఒకే చోట కలిసి ఉంటున్నారు. ఇంతలోనే వీరిద్దరి మధ్య ఏం జరిగిందో కానీ, సవాయి సింగ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.
సోహానీ కుమారి హిందీ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. వాటిలో ‘యే హై చాహతే’ సీరియల్ ఆమెకు నటిగా నటిగా మంచి పేరు తీసుకొచ్చింది. నటిగా మంచి పేరు తెచ్చుకున్న సోహానీ రీసెంట్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ‘ప్యార్ టెస్టింగ్’ అనే సీరీస్ నిర్మిస్తోంది.