సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్! ట్రాఫిక్‌ ఆపడంతో పరిగిలో నినాదాలు

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వస్తున్నారంటూ పరిగిలో దాదాపు 45 నిమిషాలు ట్రాఫిక్‌ ఆపేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.

హైదరాబాద్, విధాత : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగ జరుపుకునేందుకు కొడంగల్ తో పాటు కొండారెడ్డి పల్లెకు వెళ్లారు. కొడంగల్ లో ఆయన రాక సందర్భంగా స్థానిక పోలీసులు గంటల కొద్దీ ట్రాఫిక్ ను నిలిపేయడం ప్రజల ఆగ్రహానికి గురయ్యింది. కొండారెడ్డి పల్లెలో దసరా వేడుకల తరువాత పరిగి మీదుగా కొడంగల్ కు వెళ్లారు. పరిగి లోని కొడంగల్ చౌరస్తా వద్ద గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిపివేసి తమను ఇబ్బందులకు గురి చేస్తారా అంటూ వాహనదారులు పోలీసులపై తిరగబడ్డారు. సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ పూర్తిగా ఆగడంతో సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మీరిలా ఆపితే మేము జమ్మి ఎవరికి పెట్టాలని, పండుగ పూట ఇబ్బంది పెట్టడం ఏంటనీ పోలీసులను నిలదీశారు. పండుగ జరుపుకోవాలని హైదరాబాద్ తో పాటు ఇతర గ్రామాల నుంచి వచ్చారు, పిల్లా పాపలతో బండ్ల మీద ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఇక్కడికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఆపి 45 నిమిషాలు అయ్యిందని ఒక వ్యక్తి తెలిపారు. దీనిపై స్పందించిన పోలీసులు మీకు దండం పెడతాము, పండుగ వదిలేసి ఇక్కడ భద్రత విధుల్లో ఉన్నామని సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. మీమీద గౌరవం ఉంది, ఒక్క రెండు నిమిషాలు ట్రాఫిక్ వదిలేయాలని వాహనదారులు పోలీసులను వేడుకున్నారు.

Exit mobile version