విధాత, వరంగల్ ప్రతినిధి : పదేళ్ల బీఅర్ఎస్ ఇచ్చి విస్మరించిన హామీలపై బీఆర్ఎస్ కా డోఖా కార్డును కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీ కలిసి విడుదల చేశారు. కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్డులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులపాలుచేసి ఆర్ధిక భారాన్ని మోపిన బీఆర్ఎస్ నేతలు బాకీ కార్డు పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు స్వర్ణతో కలిసి డీసీసీ ప్రసిడెంట్,ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ప్రజలిచ్చిన అధికారాన్ని పూర్తిగా స్వప్రయోజనాలకు వాడుకున్నారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా,సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రజలు ఇప్పుడే మర్చిపోలేదని, టీఆర్‌ఎస్ ఎన్నో హామీలు ఇచ్చి, ఏవీ పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసిందన్నారు. డబుల్ బెడ్ రూమ్ పథకం, రైతు రుణమాఫీ, పేదలకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి ఉద్యోగ, ఉపాధి, నగరాల అభివృద్ధి తదితర అనేక హామీలు ఇచ్చి విస్మరించిన విషయం ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారని అన్నారు.
కాంగ్రెస్ మాట మీద నిలబడుతుందనే నమ్మకం ప్రజలకు ఉందని, మేము ఇచ్చిన హామీలను దశల వారీగా, ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఇప్పుడు ఉన్న ఏకైక పని తప్పులను కప్పిపుచ్చుకోవడం, ప్రజల దృష్టి మళ్లించడం మాత్రమేనని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ బాగోతాలను ప్రజలకు చేరువ అయ్యేలా “BRS కా దోఖా “ను ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.