విధాత, వరంగల్ ప్రతినిధి: పాలస్తీనా ప్రజలపై జినోసైడ్ హత్యాకాండకు పాల్పడుతూ ఇజ్రాయిల్ జరుపుతున్న దురాక్రమణ దాడులకు నిరసనగా సిపిఐ( ఎంఎల్ ) న్యూడెమోక్రసీ పిలుపులో భాగంగా వరంగల్ లో ధర్నా చేశారు. నిరసనలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఇజ్రాయిల్, అమెరికా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ
రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ ఇజ్రాయిల్ పాలకులు పాలస్తీనా దేశ భూభాగాన్ని ఆక్రమిస్తూ ప్రజలను ఊచకోత కోస్తున్నారని మండిపడ్డారు. ఈ దుశ్చర్యకు అమెరికా, బ్రిటన్ సామ్రాజ్యవాదుల అండ ఉందని ఆయన విమర్శించారు. 145 ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నామని ప్రకటించినప్పటికీ, అమెరికా వ్యతిరేకించిందని ఆయన అన్నారు. రెండు సంవత్సరాలుగా పాలస్తీనా లోని గాజా తదితర ప్రాంతాల ప్రజలపై ఇజ్రాయిల్ ప్రభుత్వం చేస్తున్న మారణకాండలో దాదాపు 66 వేల ప్రజలు హత్యకు గురయ్యారని, రెండు లక్షల మంది క్షతగాత్రులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇజ్రాయిల్ ప్రభుత్వం పాలస్తీనా ప్రజలకు ఆహారం అందకుండా చేయడం వల్ల వందలాది మంది ఆకలితో చనిపోతున్నారన్నారు. ప్రపంచం లోని వివిధ దేశాల ప్రజలు స్వచ్ఛంద సంస్థలు వారికి ఆహారం ఔషధ, ఇతర సామాగ్రిని అందించేందుకు సముద్ర మార్గం ద్వారా వస్తున్న నౌకలను ఇజ్రాయిల్ ప్రభుత్వం ఆపివేసిందని విమర్శించారు. దాదాపు 500 మంది స్వచ్ఛంద, సంస్థల కార్యకర్తలను నిర్బంధించిందన్నారు. ఇజ్రాయిల్, అమెరికా ప్రభుత్వాలు చేస్తున్న ఈ దుర్మార్గాన్ని ఖండించాలని, పాలస్తీనా ప్రజలకు అండగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ, ప్రజాసంఘాల నాయకులు రాచర్ల బాలరాజు, ఎలకంటి రాజేందర్ జిల్లా, గంగుల దయాకర్, బండి కోటేశ్వరరావు, బొమ్మెడ సాంబయ్య, జక్కుల తిరుపతి, మర్రి మహేష్, బన్న నర్సింగం, బండి కుమార్, అయిత యాకయ్య తదితరులు పాల్గొన్నారు.