Site icon vidhaatha

నల్గొండ- వరంగల్- ఖమ్మం జిల్లాల పట్టభద్రుల బీఆరెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి

విధాత ప్రత్యేక ప్రతినిధి : నల్గొండ- వరంగల్- ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగు రాకేష్ రెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఖాళీ అయిన ఈ స్థానానికి పార్లమెంటు ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూడా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం వరంగల్ జిల్లాకు చెందిన మాజీ బీఆర్ఎస్వి నాయకులు, వికలాంగుల సంస్థ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి మరికొందరు ఉద్యమ నాయకులు ప్రయత్నించినప్పటికీ అధిష్టానం రాకేష్ రెడ్డి వైపు మొగ్గు చూపారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన రాకేష్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ లో చేరారు. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న రాకేష్ రెడ్డి ఆ పార్టీ నుంచి వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో బిజెపిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ లో చేరారు. ఆ పార్టీలో చేరిన కొద్ది కాలానికే ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పించడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. తొలి నుంచి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన నాయకులను కాదని ఇటీవల కాలంలో బిజెపి నుంచి చేరిన వ్యక్తికి అవకాశం కల్పించడం పట్ల ఉద్యమకారుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మూడు జిల్లాల పరిధిలో బీఆర్ఎస్ నాయకత్వానికి అర్హులైన అభ్యర్థి లభించలేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

అగ్ర కులాలకే అవకాశం

పైగా ఎస్సీ, ఎస్టీ బీసీలను కాదని ఇప్పటివరకు బీఆర్ఎస్ రెడ్డి సామాజిక వర్గం లేదా అగ్రకులాల అభ్యర్థి వైపే మొగ్గుచూపుడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కపిలవాయి దిలీప్ కుమార్ కు ఆ తర్వాత ఎస్సార్ విద్యాసంస్థల అధినేత వరదారెడ్డికి ఆ తదుపరి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి అవకాశం కల్పించారు తప్ప కింది కులాలకు ప్రాతినిధ్యం కల్పించలేదని విమర్శలు ఉన్నాయి. మరోసారి రెడ్డి సామాజిక వర్గం వైపే మొగ్గుచూపుడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో ఓటమిపాలైన తీన్మార్ మల్లన్నకే అవకాశం కల్పించింది. బిజెపి ఎమ్మెల్సీ బరిలో ఉంటుందా లేదా వేచి చూడాల్సి ఉంది. ఇప్పటివరకు మాత్రం తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు.

Exit mobile version