Harish Rao : ఆరునెలల్లో టిమ్స్ పూర్తి చేయాలి

హరీష్ రావు హెచ్చరించారు: హైదరాబాద్, వరంగల్ లోని TIMS ఆసుపత్రులను ఆరు నెలల్లో పూర్తిచేయాలి, లేక ప్రజల నుండి తిరుగుబాటు తప్పదు.

Harish Rao

విధాత, హైదరాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రం నాలుగు వైపుల నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆస్ప‌త్రి భ‌వ‌నాల‌ను ఆరు నెల‌లోపు పూర్తి చేయాల‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆరు నెల‌లోపు ఆస్ప‌త్రులు పూర్తి చేయ‌క‌పోతే పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తామ‌ని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు. నిర్మాణంలో ఉన్న కొత్తపేట టిమ్స్ ‌ఆస్ప‌త్రిని హ‌రీశ్‌రావు, ఎమ్మెల్యేలు స‌బితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, వివేకానంద, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ యాదవ రెడ్డిలో కలిసి ప‌రిశీలించారు. నిర్మాణ ప‌నుల పురోగతిని తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలోనే భూసేకరణ చేసి, టెండర్లు పిలిచి, డిజైన్లు పూర్తి చేసి, 6 అంతస్తుల భవన నిర్మాణం పూర్తి చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప ప్రభుత్వం రెండేళ్లలో 5 ఫ్లోర్లు మాత్రమే వేశారని. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండి ఉంటే ఈ ఆసుపత్రి గత ఏడాదే ప్రారంభమయ్యేదన్నారు. ఎందుకు రెండు సంవత్సరాల నుంచి టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం కాలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎక్కడ కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుందో అని కావాలనే ఈ ఆసుపత్రి నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తున్నారని ముందు చూపు లేని మంద బుద్ది కలిగిన నాయకులు కాంగ్రెస్ నాయకులు అని హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. టిమ్స్ తో సహా వరంగల్ హెల్త్ సిటీ ఆసుపత్రుల పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని, లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం అన్నారు. టిమ్స్ ఆసుపత్రుల కోసం అసెంబ్లీలో మేం ప్రత్యేక చట్టం తెచ్చాం అని గుర్తు చేశారు.

మేడ్చల్ జిల్లాకు మెడికల్ కాలేజీ లేకుండా చేసిన కాంగ్రెస్

వందేళ్ల ముందు చూపుతో కేసీఆర్ ప్రణాళికలు వేసి..33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉండేలా ప్లాన్ చేశారని..2850 ఎంబీబీఎస్ సీట్లను 10వేలకు పెంచారని హరీష్ రావు తెలిపారు. కేసీఆర్ హయాంలో మహేశ్వరం నియోజకవర్గంలో రూ.176 కోట్లతో మెడికల్ కాలేజీ, 500 పడకల ఆసుపత్రిని కట్టడానికి జీవో ఇవ్వగా..2023సెప్టెంబర్ లో నేను, సబితా ఇంద్రారెడ్డి వెళ్ళి ఆ మెడికల్ కాలేజీకి, 500 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన కూడా చేశాం అని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని, 500 పడకల ఆసుపత్రిని రద్దు చేసి ఎల్బీ నగర్ టిమ్స్‌లో విలీనం చేశారు అని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. అటు కుత్బుల్లాపూర్ నియోజకవరంలో రూ.182 కోట్లతో ఇంకో మెడికల్ కాలేజీని కట్టాలని కేసీఆర్ జీవో ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అది రద్దు చేసి అల్వాల్ టిమ్స్‌లో కలిపిందన్నారు. దీంతో మేడ్చల్ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది అని హ‌రీశ్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రుల పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం..లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం..

కాంగ్రెస్ అసమర్థ పాలనలో ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లించక.. కాలేజీలు బంద్ చేస్తామని ప్రైవేట్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1400కోట్లు ఇవ్వక ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నాయని హరీష్ రావు విమర్శించారు.
బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. ఇప్పటికైన ఆయా పెండింగ్ బకాయిలు చెల్లించి విద్య, వైద్యం సక్రమంగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పాలనతో రియల్ ఎస్టేట్ లో తిరోగమనం అని..47వేల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారని..ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీల్లో 55శాతానికి తగ్గారని..జీఎస్టీ 5శాతం మైనస్ కు పోయిందని..కేసీఆర్ హయాంలో 16శాతం పెరిగింది. కానీ రేవంత్ పాలనలో అంతా తిరోగమనమేనంటూ మండిపడ్డారు.

 

Exit mobile version